ధృవ వంశ చరిత్ర druva vamsa charitra
ధ్రువ వంశం - దక్ష సంతతి
ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు; సురుచి, సునీతి. వారిలో సురుచికి ఉత్తముడు సునీతికి ధ్రువుడు పుట్టారు. వారిలో ధ్రువుడు చిన్నతనంలోనే నారద మహర్షి కృప వల్ల ప్రాప్తించిన ఉపదేశానుసారం దేవాది దేవుడైన జనార్దను నారాధించి ఆయన దర్శనభాగ్యాన్ని పొందాడు. ఆ తరువాత పెద్దకాలం పాటు మహారాజుగా, మనిషిగా బాధ్యతలను నిర్వర్తించి దేహాంతంలో విశ్వంలోనే కాంతివంతమైన నక్షత్రంగా ఉత్తమ స్థానంలో నిలిచాడు.
ధ్రువుని కొడుకు క్లిష్టుడు. ఆ తరువాత ఆ వంశంలో పరంపరగా ప్రాచీన బర్షి, ఉదారధి, దివంజయుడు, రిపుడు, చాక్షుషుడు, రురు, అంగుడు, వేనుడు రాజ్యం చేశారు. ఈ వేనుడు నాస్తికుడు, ధర్మభ్రష్టుడు, పొగరుబోతు. మహర్షులను, పూజ్యులను దారుణంగా
అవమానించేవాడు. దేశంపాడైపోతుండడంతో మరో దారిలేక మహర్షులంతా కుశాఘాతాలతో వానిని చంపివేశారు! రాజ్యం అరాచకం కాకుండానూ, విష్ణుమానస పుత్రుని కోసమూ ప్రయత్నాలు చేయసాగారు.ముందు వేనుని శరీరం కాస్త వెచ్చగా వుండగానే అతని ఊరు భాగాన్ని మంత్ర సహితంగా మంథనం చేయగా ఒక పుత్రుడు దయించాడు. అతడు నల్లగా, అతిచిన్న పరిమాణంలో వుండడంతో, అతనిని 'ఇక్కడే వుండు' అనే భావంతో 'నిషీద' అన్నారు. ఈ శబ్దం వల్ల అతని పేరు నిషాదుడుగా స్థిరపడిపోయింది. అనంతర కాలంలో అతడు కొండల మీదికి. వెళ్ళిపోయాడు తరువాత మునులంతా కలిసి తమ తపశ్శక్తిని వినియోగించి శ్రీహరిని జపిస్తూ వేనుని కుడిచేతిని మథించగా అందునుండి విష్ణువే పృథు
నామంతో అవతరించాడు. ఆయన ప్రజాను రంజకమైన పరిపాలనను చేయడమే కాక వారికోసం పృథ్విని పితికి సమస్త ద్రవ్యాలను రాబట్టి ప్రజలను ఐశ్వర్యవంతులను
చేశాడు
పృథువు తరువాత వంశానుగతంగా అంతర్ధానుడు, హవిర్ధానుడు, ప్రాచీన బర్హి రాజులయ్యారు. ఈ ప్రాచీన బర్హిలవణ సముద్ర పుత్రియైన సాముద్రిని పెండ్లాడి పదిమంది పుత్రులను కన్నాడు. వారందరూ ప్రాచేతస నామంతో ప్రసిద్ధులై ధనుర్వేదంలో నిష్ణాతులై లోకంలో ధనుర్గారులను తయారు చేశారు. ధర్మాచరణ నిరతులై ప్రజలను కాపాడారు. తరువాత పదివేల సంవత్సరాల పాటు నీటి అడుగున కఠోరతపస్సు చేసి తత్ఫలితంగా
ప్రజాపతి పదవినీ, వరప్రసాదియైన మారిషయను దివ్యస్త్రీని భార్యగానూ పొందారు. శివుని చేత శపింపబడిన దక్షుడు ఈ మారిషకే కొడుకుగా పుట్టాడు.
దక్షుడు ముందు నాలుగు రకాల మానస పుత్రులను సృష్టించాడు. కానీ శివుని శాపం వల్ల వారు అభివృద్ధి చెందలేదు. అప్పుడు దక్ష ప్రజాపతి స్త్రీ, పురుష సంయోగంపై ఎక్కువగా దృష్టిని పెట్టి సృష్టిని పెంచవలసి వచ్చింది. ఆయన వీరణ ప్రజాపతి కూతురైన ఆసక్తి అను సుందరిని పెండ్లాడి వేయి మంది పుత్రులను కన్నాడు కానీ వారంతా నారదమహర్షి ఉపదేశం మేరకు గృహస్థ జీవన విముఖులై పృథ్వి యొక్క హద్దులను చూసివస్తామని పోయి మరి రాలేదు. దక్షుడు మరల వేయి మంది పుత్రులను కని సృష్టిని కొనసాగించాడు. వారు 'శబలాశ్వ' నామంతో ప్రసిద్ధులయ్యారు. కాని వారు నారదుని బోధనలను విని సన్యాసులయిపోయారు. ఈ మారు దక్షుడిక కోపం పట్టలేక నారదుని మర్త్యలోకంలో
జనించాలని శపించాడు. అందువల్ల నారదుడు కశ్యప పుత్రునిగా పుట్టవలసివచ్చింది.
ఈ మారు దక్ష ప్రజాపతి అసిక్నియను భార్య ద్వారా అరవైమంది అందమైన కన్యలను ఉత్పన్నం చేసి వారిలో నిద్దరిని అంగిరామహర్షికి, ఇద్దరు కన్యలను కృశాశ్వునికి
పది మందిని ధర్మునికీ, పదునాల్గురిని కశ్యపునికీ, ఇరవై ఎనమండుగురిని చంద్రునికీ ఇచ్చి వివాహం చేశాడు. ఓ మహాదేవా! ఆ తరువాత దక్షుడు మనోరమ, భానుమతి,
విశాల, బహుద అను నలుగురు కన్యలను అరిష్టనేమి కిచ్చి వివాహముగావించాడు.
ధర్ముని పత్ని విశ్వ ద్వారా విశ్వేదేవులూ, కశ్యపపత్ని సాధ్య ద్వారా సాధ్యగణాల వారూ జన్మించారు. మరుద్వతి ద్వారా మరుత్వంతుడూ, వసుద్వారా అష్టవసువులూ ఆవిర్భవించారు. శంకరదేవా! భానుకి పన్నెండుగురు భానులూ, ముహూర్తకు ముహూర్తులూ
జన్మించారు. లంబనుండి ఘోషులు, యామీ ద్వారా నాగవీథి జన్మించారు. ధర్ముని పత్నులలో చివరిదైన సంకల్ప ద్వారా సర్వాత్మకు డైన సంకల్పుడు రూపాన్ని ధరించాడు.
ఆపసుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు, అష్టవసువులు, వీరిలో మొదటి దేవతకు వేతుండి, శ్రమ, శ్రాంత, ధ్వని అనే కొడుకులు పుట్టారు. భగవంతుడైన కాల పురుషుడు ధ్రువపుత్రునిగా అవతరించాడు. వర్చ మహర్షి సోమపుత్రుడు ఆ దేవుని దయ వల్లనే మనిషి వర్చస్వికాగలడు. ధరుడను వసువు కుమనోహరయను దేవకన్య ద్వారా ద్రుహిణ హుత, హవ్యవహ, శిశిర, ప్రాణ,
రమణ నామకులైన పుత్రులు కలిగారు. అనిల పత్ని పేరు శివ. వారికి పులోమజుడు, అవిజ్ఞాతగతి నామకపుత్రులు జనించారు. అనల (అగ్ని) పుత్రుని పేరు కుమారుడు.
ఇతడే రెల్లు వనంలో అవతరించిన కుమారస్వామి; కృత్తి కలచే పాలింపబడి కార్తికేయుడైనాడు. ఈయన తరువాత శాఖ, విశాఖ, నైగమేయులు అనలునికి కలిగారు.
దేవల మహర్షి ప్రత్యూష వసువు పుత్రుడు. విఖ్యాత దేవశిల్పి విశ్వకర్మ ప్రభాస వసునందనుడు. విశ్వకర్మకు నలుగురు మహాబల పరాక్రమవంతులైన కొడుకులు పుట్టారు.వారే అజైకపాదుడు, అహిర్భుధ్న్యుడు, త్వష్ట, రుద్రుడు. త్వష్ట పుత్రుడే మహా తపస్వియైన విశ్వరూప మహర్షి. రుద్ర నందనులైన హర, బహురూప, త్ర్యంబక, అపరాజిత, వృషాకపి, శంభు, కపర్ది, రైవత, మృగవ్యాధ, శర్వ, కపాలి నామకులు ఏకాదశ రుద్రులుగా శంకరాంశ
సంభూతులై మూడులోకాలకూ అధిపతులైనారు.
కశ్యపపత్ని అదితి పుత్రులు విష్ణు, శక్ర, అర్యమ, ధాత, త్వష్ట, పూష, వివస్వాన్,సవిత, మిత్ర, వరుణ, అంశుమాన్, భగనామధేయులై ద్వాదశాదిత్యులుగా వెలిగి లోకాలను వెలిగిస్తున్నారు.
రోహిణి మున్నగు ఇరువదేడు నక్షత్రకన్యలను దక్షుడు చంద్రునికిచ్చి వివాహం చేశాడు. దితికడుపున హిరణ్యాక్ష,
హిరణ్యకశిపులూ, సింహికయను కూతురూ పుట్టారు.
ఆమె పెండ్లి విప్రచిత్తితో జరిగింది. హిరణ్యకశిపునికి అను“ద, ప్రద, ప్రహ్లాద, సంప్రోద నామకులైన పుత్రులు జనించి 'హ్లాదు' లుగా ప్రసిద్ది చెందారు; ముఖ్యంగా విష్ణుభక్తుడు ప్రహ్లాదుడు. సంఫ్ల(ఈ)దునికి ఆయుష్మాన్, శిబి, వాష్కలులు పుత్రులుగా జన్మించారు. ప్రహ్లాదపుత్రుడు విరోచని. అతని పుత్రుడే బలిచక్రవర్తి. బలికి నూర్గురు కొడుకులు. వారిలో పెద్దవాడు బాణుడు.
హిరణ్యాక్ష పుత్రులైన ఉత్కురుడు, శకుని, భూత సంతాపనుడు, మహానాభుడు, మహాబాహు, కాలనాభులు మహా బలశాలులు.
దనువు తనయులైన ద్విమూర్ధ, అయోముఖ, శంకర, శంకుశిర, కపిల, శంబర, ఏక చక్ర, మహాబాహు, తారక, మహాబల, స్వర్భాను, వృషపర్వ, పులోమ, మహాసుర,
విప్రచిత్తులు విఖ్యాతవీరులు.
స్వర్భానుని కన్య సుప్రభ. వృష పర్వుని కూతురు శర్మిష్ఠ. అతని కింకా ఉపదానవి. హయశిర అను మరో ఇద్దరు శ్రేష్ఠకన్యలున్నారు.
పులోమా, కాలకా వైశ్వానరకన్యలు. ఈ పరమ సౌభాగ్య శాలినుల వివాహం మరీచి పుత్రుడైన కశ్యపునితో జరిగింది. వారికి అరవై వేల మంది శ్రేష్ఠులైన దానవులు పుట్టారు. కశ్యపుడు వీరిని పౌలోములనీ కాలకంజులనీ వ్యవహరించాడు.
విప్రచిత్తి, సింహికలకు వ్యంశ, శల్య, బలవాన్, నభ, మహాబల, వాతాపి, నముచి, ఇల్వల, ఖస్రుమాన్, అంజక, నరక కాలనాభులు పుట్టారు.
ప్రహ్లాదుని వంశంలో నివాతకవచ నామధారులైన దైత్యులు రెండు వందలమంది ఉదయించారు.
తామ్రాకు సత్త్వ గుణ సంపన్నులైన ఆరుగురు కన్యలు పుట్టారు. వారి పేర్లు :శుకి, శ్యేని, భాసి, సుగ్రీవి, శుచి, గృధిక. వీరికి క్రమంగా 1.చిలుకలు, గుడ్లగూబలు,
కాకాదులు 2. శ్యేనాలు 3. భాసాలు 4. అశ్వాలు, ఒంటెలు 5. నీటి పక్షులు 6. గ్రద్దలు పుట్టగా వీటిని తామ్రవంశమన్నారు
(సుగ్రీవునికి గుజ్రాలూ, గృధ్రాకు గ్రద్దలు పుట్టాయి. )
వినతాగర్భాండముల నుండి విశ్వవిఖ్యాతులైన అరుణుడు గరుడుడు ఉదయించారు. సురసాగర్భము నుండి అపరిమిత తేజస్సంపన్నములైన సర్పాలు సహస్ర సంఖ్యలో జనించగా, కద్రువకు కూడా నాగులే జన్మించారు. వీరిలో ప్రముఖులు శేషుడు, వాసుకి, తక్షకుడు, శంఖుడు, శ్వేతుడు, మహాపద్ముడు, కంబలుడు, అశ్వతరుడు, ఏలాపత్రుడు, నాగుడు, కర్కోటకుడు, ధనంజయుడు.
క్రోధాదేవికి మహాబలవంతమైన పిశాచగణము, సురభికి గోవులూ, ఎద్దులూ, ఇరావతికి వృక్షకుటుంబమూ జన్మించాయి
ఖగా యను నామెకు యక్ష రాక్షస గణాలూ, మునియను నామెకు ఆటపాటలతో అలరించే అచ్చరలూ, అరిష్టకు పరమసత్త్వసంపన్నులైన గంధర్వులూ పుట్టారు. నలభై
తొమ్మిది మరుత్తులను దేవతలు (రాక్షస మాతయైన) దితి కడుపున పుట్టారు.
ఈ మరుద్గణాల్లో ఏకజ్యోతి, ద్విజ్యోతి, త్రిజ్యోతి, చతుర్ద్యోతి, ఏకశుక్ర, ద్విశుక్ర, త్రిశుక్రులు ఏడుగురూ ఒక గణం. ఈదృక, సదృక, అన్యాదృక, ప్రతిసదృక, మిత, సమిత, సుమిత నామధారులంతా మరొకగణం. ఋతజిత్, సత్యజిత్, సుషేణ, సేనజిత్, అతిమిత్ర, అమిత్ర, దూరమిత్ర నామక మరుత్తులది ఇంకొక గణం ఋత, ఋతధర్మ, విహర, వరుణ, ధ్రువ, విధారణ, దుర్మేధ నామధారులది నాలుగవ మరుద్గణం. ఇక ఈ దృశ, సదృశ, ఏతాదృశ, మితాశన, ఏతేన, ప్రసదృక్ష, సురత నామక మహాతపస్వులు. అయిదవ గణానికి చెందిన మరుత్తులు. హేతుమాన్, ప్రసవ, సురభ, నాదిరుగ్ర, ధ్వనిర్భాస, విక్షిప, సహనామధేయులది ఆరవమరుద్గణం. ద్యుతి, వసు, అనాధృష్య, లాభ, కామ, జయీ, విరాట్టు, ఉద్వేషణులది ఏడవ మరుద్గణం. వీటిని వాయుగణాలనీ, స్కంధాలనీ కూడా అంటారు.
ఈ నలభై తొమ్మండుగురు మరుత్తులూ విష్ణురూపాలే. మనువుతో సహా దేవదానవ రాజులు, సూర్యాదిగ్రహాలు వీరినే పూజిస్తారు.
All copyrights reserved 2012 digital media act

Comments
Post a Comment