నారద భక్తి సూత్రాలు విత్ మీనింగ్ narada bakthi sutras with Telugu lyrics and meaning

నారద భక్తి సూత్రాలు

నారద భక్తి సూత్రాలు విత్ మీనింగ్ narada bakthi sutras with Telugu lyrics and meaning


మొదటి అధ్యాయం



1 . అధాతో భక్తిం వ్యాఖ్యాస్యామః
అటుపిమ్మట ఈ కారణమువలన భక్తిని వ్యాఖ్యానము చేయుచున్నాము .

2 . సా త్వస్మిన్ పరమప్రేమరూపా .
భగవంతునిపై ఆ భక్తి పవిత్రమైన ప్రేమ రూపము .

3 . అమృతస్వరూపా చ
ఆ భక్తి అమృత స్వరూపము .

4 . యల్లబ్ద్వ పుమాన్ సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి .
అటువంటి పరాభక్తిని పొందిన పురుషుడు సిద్ధుడై , అమృతుడై , తృప్తుడగుచున్నాడు .

5 . యత్ప్రాప్య నకించిద్వాంచతి నశోచతి నద్వేష్టి రమతే నోత్సాహీ భవతి .
ఏ పరాభక్తిని పొందిన తరువాత తదన్యమగువానిని కొంచెమైనను కోరడో , లభ్యము కాని విషయములను గూర్చి శోకింపడో , తనకు సంప్రాప్తించిన అనిష్ట విషయములను ద్వేషింపడో , ఏ వస్తువునందును క్రీడింపడో జగద్వ్యా పారములందు ఉత్సాహమును చూపడో .

6 . యద్దజ్ఞ త్వా మత్తో భవతి స్తభ్దో భవతి ఆత్మారామో భవతి .
ఏ భక్తి వల్ల భగవత్స్వరూపము అవగతమయి పిచ్చివానివలె అగుచున్నాడో నిశ్చేష్టుడగుచున్నాడో , ఆత్మానందముననుభవించు వాడగుచున్నాడో

7 . సా న కామయమానా నిరోధరూపత్వాత్ .
ఆ భక్తి విషయ ప్రపంచ వాసనను నిరోధించుట వలన కోరికలు కలుగనివ్వదు 

8 . నిరోధస్తు లోక వేదవ్యాపారన్యాసః
అనన్యభక్తిచే ఈ నిరోధస్థితి జనించునపుడు వేదవ్యాపారము లోకవ్యాపారమును పోగొట్టును .

9 . తస్మిన్ అనన్యతా తద్విరోధి షూదాసీనతా చ 
భగవంతుని యందు అనన్యభక్తి కలిగి , తద్విరోధ విషయములందు నిర్లిప్త వైఖరి నవలంబించుట నిరోధ లక్షణము .

10 . అన్యాశ్రయాణాం త్యాగో నన్యతా .
ఇతర ఆశ్రయములన్నింటిని త్యజించి భగవంతుని మాత్రమే సంపూర్ణముగా ఆశ్రయించుట .

11 . లోకవేదేషు తదనుకూలాచరణం తద్విరోధి షూదాసీనతా ,
లోకవ్యవహారమందును , వేదవ్యవహార మందును విహితమైన ఆచరణ ఎలా ప్రతిపాదించబడినదో దానిని తన పరాభక్తికి అవరోధము గాకుండా అనుకూలముగా ఆచరించవలెను . ఆచరణకు విరుద్ధములైన విషయములందు సంబంధము లేక తటస్థముగ ఉదాసీనతతో ఉండాలి .

12 . భవతు నిశ్చయదార్ధ్యా దూర్ద్వం శాస్త్ర రక్షణం .
పూర్తిగా భగవద్భక్తితో జీవించవలయునని నిశ్చయించి అలా జీవిస్తున్నను శాస్త్ర రక్షణము జరుపవలెను .

13 . అన్యధా పాతిత్యా శంకయా 
     లేక పాపభీతిచేత .

14 . లోకో పితావదేవ , కింతు భోజనాది వ్యాపారస్త్వా శరీర ధారణావధి .
భోజనాది వ్యాపారము శరీర మున్నంతవరకు ఉండును లోకవ్యవహారశాస్త్రము  అనన్యభక్తి కలుగునంత వరకు ఉండును .

15 . తల్లక్షణాని వాచ్యన్తే నానామతభేదాత్
అనేక మతభేదములవలన భక్తి లక్షణములు వివరించబడుచున్నవి .

16 . పూజాది ష్వనురాగ ఇతి పారాశర్యః
పరాశరసుతుడగు వ్యాసుడు పూజాదులయందు అనురాగమని చెప్పుచున్నాడు .

17 . కథాదిష్వితి గర్గః
గర్గాచార్యుల అభిప్రాయము భగవత్కథా విషయములందు అనురాగమని .

18 . ఆత్మరత్యవిరోధేనేతి శాండిల్యః
శాండిల్య మహర్షి ఉద్దేశ్యంలో ఆత్మ క్రీడకు విరోధములేని భగవత్కార్యములు
మంచివని .

19 . నారదస్తు తదర్పి తాఖిలాచారతా , తద్విస్మరణే పరమ వ్యాకుల తేతి .
సర్వకర్మలను భగవంతునియందే సమర్పించి యుండుట , ఆ భక్తి విస్మరిస్తే మహాబాధకు గురియగుట అని నారదమహర్షి చెప్పెను .

20 . అస్త్వేవ మేవమ్ |
ఇట్టి నిదర్శనమే పరాభక్తి యగును .

21 . యథా వ్రజ గోపికానాం
వ్రజభూమిలోని గోపికా స్త్రీల భక్తిలాగ .

22 . తత్రాపి న మహాత్య , జ్ఞాన విస్మృత్యపవాదః
అట్లుండినను భగవానుని దేహసంబంధ ప్రభావాదులను మరచిరి అందుచేతనే ఆ గోపికలు అపవాదమును పొందలేదు .

23 . తద్విహీనం జారాణామివ
అట్టి జ్ఞానపరమైన భక్తి లేనివారిని జారులందురు .

24 . నాస్త్యేవ తస్మిం స్తత్సుఖసుఖిత్వమ్ .
భగవంతుని నుండి పొందెడి తన్మయసుఖము జారస్త్రీలు తమ ప్రియుల నుండి పొందే సుఖమువంటిది కాదు .


రెండవ అధ్యాయం



25 . సాతు కర్మజ్ఞానయోగేభ్యోష్యధికతరా .
ఆ భక్తి కర్మకన్నను జ్ఞానముకన్నను , , యోగముకన్నను ఉత్తమమైనది 
.
26 . ఫలరూపత్యాత్ ,
భక్తిఫలరూపమైనది కనుక .

27 . ఈశ్వరస్యాష్యభిమానద్వేషిత్వాత్ దైన్యప్రియత్వాచ్చ
ఈశ్వరుడు కూడా అహంకారులను ద్వేషించుటచేతను దీనులను ప్రేమించుటచేతను .

28 . తస్యాః జ్ఞానమేవ సాధన మిత్యకే
ఆ భగవద్భక్తికి జ్ఞాన మొక్కటియే సాధనమని కొందరు ఆచార్యుల అభిమతము .

29 . అన్యోన్యాశ్రయత్వ మిత్యన్యే .
పరస్పరాధారమై యున్నవని మరికొందరి అభిప్రాయము .

30 . స్వయంఫలరూపతేతి బ్రహ్మకుమారాః
ఆ భక్తి స్వయముగానే ఫలరూపమైనదని బ్రహ్మకుమారులైన సనత్కుమారాదుల అభిప్రాయము .

31 . రాజగృహభోజనాదిషు తధైవ దృష్టత్వాత్ .
రాజగృహము , రాజభోజన పదార్థములు చూసినంత మాత్రంచేత వాటిని పొందినట్లుకాదు కదా !

32 . నతేన రాజపరితోషః క్షుధాశాన్తి ర్వా .
రాజు మంచివాడనే జ్ఞానముచేత రాజప్రీతి కలుగదు . భోజనపదార్ధములు రుచిగా నుండునని తెలిసినంత మాత్రమున ఆకలి నివారింపబడదు .

33 . తస్మా త్సైవ గ్రాహ్యా ముముక్షుభి :
కనుక ఆ దైవభక్తియే ముముక్షువులు ఆచరింపదగినది . 

మూడవ అధ్యాయం



34 . తస్యాః సాధనాని గాయన్త్యాచార్యాః
ఆ దైవభక్తికి ఋషులు అనేక సాధన మార్గములను గానము చేయుచున్నారు .

35 . తత్తు విషయత్యాగా త్సంగత్యాగా చ్చ
ఇంద్రియ విషయవైరాగ్యము , దుష్ట జనసాంగత్యమును విడుచుటవలన దైవభక్తి లభించును .

36 . అవ్యావృతభజనాత్ .
నిరంతర భజనవలన

37 . లోకేపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్ .
లోకవ్యవహారములందు నిమగ్నమైయున్నను భగవంతుని అనంతగుణములను శ్రవణం చేయటంచేత , కీర్తించుటచేత భగవద్ద్యానము కలుగుచున్నది .

38 . ముఖ్యతస్తు మహత్కృపయైవ భగవత్కృపా లేశా ద్వా
ముఖ్యముగా మహాత్ముల కృపాకటాక్షముచేత , ఈశ్వరానుగ్రహము చేత ఈ దైవభక్తి సంభవించుచున్నది .

39 . మహత్సంగ స్తు దుర్లభోగమ్యో మోఘశ్చ
మహాత్ముల సాంగత్యము లభించుట దుర్లభము . వారిని సంపూర్ణముగా తెలిసికొనుట చాలకష్టము . ఒకవేళ మహాత్ముల సాంగత్యము లభ్యమైనచో అమోఘము .

40 . లభ్యతేపి తత్కృపయైవ .
మహాత్ముల సాంగత్యము లభించుట కూడా భగవత్కృపయే .

41 . తస్మిం స్తజ్జనే భేదాభావాత్
భగవంతునికి భగవద్బక్తులకు మధ్య భేదభావము లేకపోవుట చేత ,

42 . తదేవ సాధ్యతాం తదేవ సాధ్యతాం
ఆ భక్తి యే సాధింపదగినది . ఆ భక్తియే సాధింపదగినది .

43 . దుస్సంగ స్సర్వధైవ త్యాజ్య :
దుష్టుని స్నేహము అన్నివిధముల వదిలివేయ తగినది . 

44 . కామ , క్రోధ , మోహ , స్మృతిభ్రంశ , బుద్దినాశ , సర్వనాశ కారణత్వాత్ .
కామము , క్రోధము , మోహము , స్మృతిభ్రంశము , బుద్ది నాశనము  సర్వనాశ
నమునకు కారణమగుటచే దుష్ట సహవాసము విడువదగినది .

45 . తరంగాయితా అపీమే సంగా త్సముద్రాయంతి
ఆదిలో ఈ కామాదులు తరంగములవలె కనపడినను దుష్టజనసంపర్గముచే సముద్రమువలె అగుచున్నవి .

46 . కస్తరతి కసరతి మాయాం ? యః సంగం త్యజతి యో మహానుభావం సేవతే నిర్మమో భవతి .
మాయను ఎవడు దాటును ? ఎవడు దాటును ? ఎవడు దుష్టసహవాసముల
వదిలివేయునో , ఎవడు మహాత్ములను సేవించునో వాడు మాయను దాటును 

47 . యో వినిక్తస్థానం సేవత , యో లోకబన్ద మున్మూలయతి ( యో ) నిస్త్రైగుణ్యో భవతి , ( యో ) యోగక్షేమంత జతి
ఎవడు ఏకాంత ప్రదేశమునందుండునో , ఎవడు లోకబంధమును త్యజించునో  ఎవడు త్రిగుణాతీతుడగునో , ఎవడు యోగక్షేమములను విడిచిపెట్టునో .

48 . యః కర్మఫలం త్యజతి , కర్మాణి సన్న్య స్యతి తతోనిర్ద్వన్ల్వో భవతి ,
ఎవడు కర్మఫలమును వదులుచున్నాడో , అహంకారపూరితకర్మలను విడిచిపెట్టుచున్నాడో , అతడు ద్వంద్వాతీతుడు .

49 . యో వేదా నపి సన్న్యస్యతి , కేవల మవిచ్చిన్నాను రాగం లభతే | |
ఎవడైతే వేదములను కూడా వదులుచున్నాడో వాడు అవిచ్చిన్నమైన ప్రేమను పొందుచున్నాడు .

50 . స తరతి స తరతి స లోకాం స్తారయతి
వాడు తరించును . వాడే తరించును . లోకములను తరింపచేయును .


నాల్గవ అధ్యాయం



51 . అనిర్వచనీయం ప్రేమస్వరూపం
భక్తి స్వరూపము నిర్వచించుటకు సాధ్యముకాదు .

52 . మూకాస్వాదనవత్ 
మూగవాడు రుచి చూచినవిధంగా ,

53 . ప్రకాశతే క్వాపి పాత్రే
ఒకానొక అరుదైన వ్యక్తియందు ప్రకాశింపబడుచున్నది .

54 . గుణరహితం కామనారహితం ప్రతిక్షణ వర్ధమానం అవిచ్ఛిన్నం సూక్ష్మతరం అనుభవరూపం .
అట్టి పరాభక్తి గుణరహితమైనది . కామనారహితమైనది ప్రతిక్షణము వృద్ధి
నొందునది . ఎడతెగనిది . మిక్కిలి సూక్ష్మమైనది . అనుభవమే స్వరూపముగా కల్గినది .

55 . తాత్ప్రాప్య తదేవావలోకయతి , తదేవ శృణోతి తదేవ భాషయతి ,తదేవ చిన్తయతి .
అట్టి పరాభక్తిని పొందిన పిమ్మట భగవంతునే చూస్తూ , భక్తి విషయములనే ఆలకిస్తూ భక్తి ప్రసంగములే చేయుచు , భగవద్భక్తినే చింతించుచుండును .

56 . గౌణీత్రిథా గుణభేదా దార్తాదిభేదా ద్వా
సత్వాదిగుణ భేదము వల్ల , ఆ మొదలైనవిషయ భేదమువల్ల గౌణీభక్తి మూడు విధములుగా నున్నది .

57 . ఉత్తరస్మా దుత్తరస్మాత్ పూర్వాపూర్వా , శ్రేయాయ భవతి .
ముందు ముందువచ్చే తామసభక్తి కన్న రాజసభక్తియు , రాజసభక్తి కన్న సాత్త్విక భక్తియు మోక్షముకొరకు ఉపకరించుచున్నది .

58 . అన్యస్మాత్ సౌలభ్యం భక్తౌ
అన్నిటికన్న భక్తి సులభము .

59 . ప్రమాణాంతర స్యానపేక్షత్వాత్ స్వయం ప్రమాణత్వాత్ ,
మోక్షవిషయమున ఇతర ప్రమాణముల నాశించక తానే ప్రమాణ మగుటవలన .

60 . శాస్త్రరూపా త్పరమానందరూపా చ్చ .
పరమశాంతరూపమై , పరమానందరూప మగుట వల్ల .

61 . లోకహానౌ చిన్తా న కార్యా , నివేదితాత్మ లోకవేద శీలత్వాత్ . 
ఆత్మ , లోకము , వేదము ఈ మూడింటిని భగవదర్పితము చేసి యుండుటచే లోకనాశము గురించి చింతించకూడదు .

62 . న తత్సిద్ధౌ లోకవ్యవహారో హేయః కిం తు ఫలత్యాగః , తత్సాధనం చ కార్యమేవ .
ఒకవేళ అనన్యభక్తి కల్గినను లోకవ్యవహారములను త్యజించరాదు . అయితే
ఫలాపేక్షను వదలి వేయవలెను . భగవదనుగ్రహపాత్రమగు సాధనములు ఆచరించదగినవే .


63 . స్త్రీ , ధన , నాస్తిక , వైరిచరిత్రం న శ్రవణీయం

స్త్రీల యొక్క ధనము యొక్క, నాస్తికుల యొక్క శత్రువుల యొక్క చరిత్రలను భగవద్భక్తులు వినకూడదు .

64 . అభిమాన దంభాదికం త్యాజ్యమ్ .
అభిమానము , డాంభికము మొదలగువానిని త్యజించవలెను .

65 . తదర్పితాఖిలాచారఃస కామక్రోధాభిమానాదికం తస్మిన్నేవ కరణీయమ్ .
భక్తుడు సమస్తకర్మలను భగవంతునియందు అర్పించి కామము , క్రోధము ,
అభిమానము మొదలగు దుర్గుణములను ఆ భగవంతునియందు లయింప జేయవలెను .

66 . త్రిరూపభంగపూర్వకం నిత్యాదాస్య నిత్యకాన్తా భజనాత్మకం ప్రేమ కార్యం ప్రేమైవకార్యం .
భక్తుడు , భక్తి , భగవంతుడు అను త్రిపుటి నతిక్రమించి భగవంతుని నిత్యసేవ చేయుచు , పతివ్రతా స్త్రీ సదా భర్తనే సేవించునట్లు భక్తి మార్గమును ఆచరించవలెను . అట్టి ప్రేమనే అనుసరించవలెను .


ఐదవ అధ్యాయం



67 . భక్తా ఏకాన్తినో ముఖ్యాః
ఏకాంతవాసులగు భగవద్భక్తులు శ్రేష్ఠులు .

68 . కంఠావరోధరోమాంశాశ్రుభిః పరస్పరం లపమానాః పావయంతి కులాని ,
పృథివీం చ .
పరమభక్తులు పరస్పరము గద్గదస్వరముతో , పులకాంకిత గాత్రులై , ఆనంద బాష్పములు రాలుచుండ భగవద్భక్తిని గూర్చి సంభాషించుకొనుచు వంశములను  లోకమును పావనము చేయుచున్నారు . 


69 . తీర్థీకుర్వన్తి తీర్థాని సుకర్మీకుర్వన్తి కర్మాణి సచ్ఛాస్త్రీ కుర్వన్తి శాస్త్రాణి . 
భక్తి శ్రేష్ఠులు తీర్థములను పుణ్యతీర్థములుగ , కర్మములను సత్కర్మలుగా , సామాన్య గ్రంథములను సచ్ఛాస్త్ర ములుగా చేయుచున్నారు . 

70 . తన్మయాః 
భగవద్భక్తులు భగవత్స్వరూపులగుచున్నారు . 

71 . మోదన్తే పితరౌ నృత్యన్తి , దేవతాః సనాధా చేయం భూర్బవతి
పరమభక్తుల జీవనసరళివల్ల పితృదేవతలు సంతోషించుచున్నారు . దేవతలు నృత్యము చేయుచున్నారు ఈ భూమి నాథునితో కూడినది యగుచున్నది .

72 . నాస్తి తేషు జాతి విద్యా రూప కుల ధన క్రియాది భేదః . 
ఆ భగవద్భక్తులయందు జాతి , విద్యా , రూప , కుల , ధన , ఉద్యోగాది భేదములు లేవు . 

73 . యత స్త దీయాః 
భగవత్సంబంధమైన వారగుటవలన . 

74 . వాదో నావలమ్బ్యః 
భగవధ్యక్తులు వాదములోనికి దిగరాదు .

75 . బాహుల్యావకాశత్వా దనియతత్వాచ్చ . 
వాదమును పెంచిన కొద్ది పెరుగుట కవకాశముండుట వల్ల , ఇట్టిదని నిర్ణయించుటకు నిర్దిష్టమైన అవధిలేనిదగుట వల్ల , వాదములకు దూరంగా ఉండాలి . 

76 . భక్తి శాస్త్రాణి మననీయాని తదుద్బోధక కర్మాణి కరణీయాని . 
పరమభక్తులు భక్తి శాస్త్రములను మననము చేయాలి ఆ శాస్త్రములు  సూచించిన మేరకు నడచుకోవాలి . 

77 . సుఖదుఃఖేచ్ఛాలాభాది త్యక్తే కాలే ప్రతీక్ష్య మాణేక్షణార్థమపి వ్యర్థం న నేయమ్ . 
భక్తులు సుఖ దుఃఖ ఇచ్ఛా లాభాదులచేత విడిచిపెట్టబడిన కాలము నిరీక్షించు చుండగా అర్ధక్షణమయిననూ వ్యర్థముగా పోనీయకూడదు . 

78 . అహింసా సత్య శౌచ దయాస్తిక్యాది చారిత్ర్యాణి పరిపాలనీయాని . 
భగవద్భక్తులు అహింస , సత్యము , శౌచము , దయ , అస్తికత్వము మున్నగు ఆచరణలు అనుసరించాలి . 

79 . సర్వదా సర్వభావేన నిశ్చింతితై ర్బగవానేన భజనీయః 
సర్వకాల సర్వావస్థలయందును అన్నిభావములచేత ఇతర చింతలు లేక భజన చేయదగినవాడు భగవంతుడు . 

80 . సః కీర్త్యమానః శ్రీఘ్రమే  వావిర్బవతి అనుభావయతి చ భక్తాన్ . 
ఆ భగవంతుడు భగవద్భక్తులచే స్తుతింపబడుచున్నవాడై త్వరితముగానే ప్రత్యక్షమగుచున్నాడు . భక్తులకు తన స్వరూపము అవగతము గలవారినిగ చేయుచున్నాడు . 

81 . త్రిసత్యస్య భక్తి రేవ గరీయసీ , భక్తి రేవ గరీయసీ . 
త్రికాలములందును మార్పులేని భగవంతుని గూర్చిన భక్తియే అతిశ్రేష్టమైనది 

82 . గుణమాహాత్మ్యా సక్తి , రూపాసక్తి , పూజాసక్తి ,
 స్మరణాసక్తి , దాస్యాసక్తి , సఖ్యాసక్తి , వాత్సల్యాసక్తి , 
కాన్తాసక్తి , ఆత్మ నివేదనాసక్తి , తన్మయతాసక్తి 
 పరమవిరహాసక్తి , రూపై కధామ్యేకాదశధా భవతి . 

భగవద్భక్తి ఒకే విధమైన జీవుల సంస్కారాభి రుచులను బట్టి పదనొకొండు 
విధములుగా ఉంటుంది . 
1 . గుణమహాత్మ్యా సక్తి , 2 . రూపాసక్తి , 3 . పూజాసక్తి 
4 . స్మరణాసక్తి 5 దాస్యాసక్తి . 6 . సఖ్యాసక్తి 
7 . వాత్సల్యాసక్తి 8 . కాంతాసక్తి 9 . ఆత్మనివేదనాసక్తి 
10 . తన్మయతాసక్తి , 11 . పరమవిరహాసక్తి 



ఇత్యేవం వదని జనజల్ప నిర్ణయా ఏకమతాః
 కుమార వ్యాసశుక శాడ్జిల్య గర్గ విష్ణు కౌడ్డిన్య
 శేషోద్ధవారుణి బలి హనుమ ద్విభీషణాదయో భక్త్యాచార్యాః 

సనత్కుమారుడు , వ్యాసుడు , శుకుడు , శాండిల్యుడు , గర్గుడు , విష్ణువనుఋషి , కౌండిల్యుడు , ఆదిశేషుడు , ఉద్ధవుడు , అరుణి , బలిచక్రవర్తి , హనుమంతుడు , విభీషణుడు మొదలగు భక్త్యాచార్యులు . పామరజనుల నిందాదూషణములకు జంకని వారై భక్తి యొక్కటియే ముక్తిని గలుగజేయునని ఏకాభిప్రాయముతో నున్నారు . 





All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

Sri venkateshwara suprabatam with Telugu lyrics and meaning శ్రీవేంకటేశ్వర సుప్రభాతం విత్ మీనీంగ్

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics