చాణుక్య నీతి సూత్రాలు మొదటి అధ్యాయం తాత్పర్యము తోChanukhya neethi sutralu pradhama adhyayam with in Telugu lyrics and meaning
చాణక్య నీతి సూత్రాలు
ప్రథమాధ్యాయము
1. సుఖస్య మూలం ధర్మఃఅ. ధర్మం సుఖానికి మూలం.
2. ధర్మస్య మూలమర్థః
అ. ధర్మానికి మూలం అర్థం; అనగా ధనం.
3. అర్థస్య మూలం రాజ్యమ్.
అ. అర్థానికి మూలం రాజ్యం .
4. రాజ్యస్య మూలమిన్ద్రియ జయః.
అ. రాజ్యానికి (అధికారానికి) మూలం ఇంద్రియాల్ని వశంలో ఉంచుకోవడం.
5. ఇన్ద్రియ జయస్య మూలం వినయః.
అ. ఇంద్రియాలను జయించడానికి మూలకారణం వినయం.
6. వినయస్య మూలం వృద్దోప సేవా
అ. పెద్ద వాళ్ళను, విద్యావంతులను సేవించడంవల్ల వినయం అలవడుతుంది.
7. వృద్దోప సేవయా విజ్ఞానమ్.
అ. వృద్ధుల సేవవలన విజ్ఞానం కలుగుతుంది.
8. విజ్ఞానేనాత్మానం సంపాదయేత్ .
అ. పెద్దల సహవాసం చేసి సంపాదించుకొన్న విజ్ఞానం చేత తనను సంపాదించుకోవాలి. వినయం, విజ్ఞానం ఈ రెండూ లేనివాడు తనను తాను కోల్పోయినట్లే. ఆ రెండూ ఉన్న వాడు తనను తాను చక్కబరచుకొన్నవాడవుతాడు. ఆత్మసంపాదనం అంటే అదే.
9. సంపాదితాత్మా జీతాత్మా భవతి.
అ. ఆత్మను సంపాదించుకొన్న వారు తనను తాను జయించినవాడు అనగావశంలో ఉంచుకొన్న వాడు అవుతాడు .
10 జీతాత్మా సర్వార్దైః సంయుజ్యతే.
అ. ఆత్మను జయించినవాడు అన్ని లాభాలు. పొందగలుగుతాడు అర్థం అనగా సంపద, దానిని పొందుతాడు.
11. అర్థ సంపత్ ప్రకృతిసంపదం కరోతి
అ. ఆర్థసంపద ప్రకృతిసంపదను ఇస్తుంది. అమాత్యులు, మిత్రులు, ధనాగారం, రాష్ట్రం , దుర్గం. సైన్యం. ఈఆరింటికి ప్రకృతులని పేరు. రాజ్య పరిపాలనకు కావలసినవి ఈ ఆరే. అర్థ సంపద బాగుంటే ఇవన్నీ బాగుంటాయి.
12. ప్రకృతిసంపదా హ్యనాయకమపి రాజ్యం నీయతే.
అ. ప్రకృతిసంపద చేత రాజ్యవ్యవహారం నాయకుడు (పరిపాలకుడు) లేకపోయినా నడచిపోతుంది. ఉదాహరణకి. అప్పుడప్పుడు ప్రభుత్వాలు పడిపోయినా ఐ.ఏ.యస్ అధికారులు, భద్రతా సైన్యాదుల అధికారులు తమ తమ కార్యాలు సక్రమంగా నిర్వర్తిస్తే లోక వ్యవహారం నడిచిపోతూనే ఉన్నది కదా
13. ప్రకృతికోపః సర్వకోపేభ్యో గరీయాన్.
అ. ప్రకృతుల విప్లవం అన్ని విప్లవాలకంటే (తిరుగుబాటుల కంటే) చాల గొప్పది ప్రమాదకర మైనది.
14. అవినీతస్వామిలాఖాత్ అస్వామిలాభః శ్రేయాన్.
ఆ. వినీతుడు , అనగా విద్యా వినయసంపన్నుడు కాని, ప్రభువు దొరకడం
కంటె ప్రభువే లేక పోవడం మంచిది.
15. సంపాద్యాత్మానమన్విచ్ఛేత్ సహాయాన్ .
అ. ముందు ఆత్మను సంపాదించుకొన్న తరవాత, ఆనగా తనను తాను చక్కబరచుకొన్న తరవాత, సహాయుల్ని సంపాదించడం కోసం ప్రయత్నించాలి.
16. నాసహాయస్య మన్త్ర నిశ్చయః
అ. సహాయులు లేనివాడు ఏ విషయంలోను ఒక నిర్ణయం తీసుకొనజాలడు.
17. నైకం చక్రం పరిభ్రమతి.
అ. ఒక చక్రంతో బండి నడవదు కదా
18. సహాయః సమదు:ఖసుఖః
అ. సుఖదుఃఖాలను సమంగా పంచుకోగలిగినవాడే సహాయుడు.
19. మానీ ప్రతిమానినమాత్మని ద్వితీయం మన్త్రముత్పాదయేత్
అ. దురభిమానం కలవాణ్ణి సహాయుణ్ణిగా తీసుకుంటే అతడు ప్రభువు ఆలోచనకు విరుద్ధంగా మరొక ఆలోచన చేస్తాడు.
20. అవినీతం స్నేహమాత్రేణ న మన్త్రీ కుర్వీత .
అ. స్నేహితుడు కదా అని విద్యా వినయాలు లేనివాణ్ణి మంత్రిగా చేసుకోకూడదు.
21. శ్రుతవన్త ముపదాశుద్ధం మన్త్రిణం కుర్వీత.
అ. శాస్త్ర జ్ఞానం ఉన్న వాణ్ణి , ఏ ప్రలోభనాలకి లొంగనివాణ్ణి మంత్రిగా చేసు,కోవాలి. ధనం, శ్రీ మొద లైనవాటిని ఎరచూపి రహస్యంగా పరీక్షించడం (ఉపద) అలాంటి పరీక్షలలో పరిశుద్దుడుగా తేలినవాడు “ఉపధాశుద్దుడు"
22. మన్త్ర మూలాః సర్వారమ్బాః
ఆ. అన్ని పనులకీ మూలం మంత్రం (మంచి ఆలోచన).
28. మన్త్ర రక్షణే కార్యసిద్ధిర్భవతి.
అ. మంత్రాన్ని రక్షిస్తేనే కార్యాలు సిద్ధిస్తాయి.
24. మన్త్రనిసావీః సర్వమపి కార్యం నాశయతి.
అ. ఆలోచనలు బైట పెట్టినవాడు అన్ని పనులూ చెడ గొట్టుకుంటాడు.
25. ప్రమాదాత్ ద్విషతాం వశముపయాస్యతి.
అ. మంత్రం విషయంలో ఏమాత్రం పొర బడినా శత్రువులకి లొంగిపోతాడు.
26. సర్వద్వారేభ్యో మన్త్రో రక్షితవ్యః
అ. మంత్రాన్ని అన్ని వైపులనుండి రక్షించాలి.
27. మన్త్ర సంపదా రాజ్యం వర్దతే
అ. మంత్రశక్తి బాగుంటే రాజ్యం వృద్ధిలోనికి వస్తుంది.
28. శ్రేష్ఠతమాం మన్త్రగుప్తిమాహుః
అ. ఆలోచనలు రహస్యంగా ఉంచుకోవడం చాలా శ్రేష్టమైనది అని అంటారు.
29. కార్యాన్దస్య ప్రదీపో మన్త్రః
అ. పనుల విషయంలో గ్రుడ్డివాడికి (ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్న వాడికి) మంత్రమే దీపం.
30. మన్త్రచక్షుషా పరచ్చిద్రాణ్యవ లోక యన్తి
అ. మంత్రం అనే నేత్రంతో శత్రువుల లోపాన్ని చూస్తారు.
31. మన్త్ర కాలే న మత్సర: కర్తవ్యః
అ. ఆలోచన చేసేటప్పుడు మత్సరం (ఒకరు చెప్పినది నేను వినడమాఅన్న అహంకారం) పనికిరాదు.
32. కార్యాకార్యతత్త్వార్థ దర్శినో మన్త్రిణః
అ. ఏది చేయ్యాలి, ఏది చేయకూడదు అనే విషయాన్ని బాగా తెలుసుకోగలిగిన వాళ్ళే నిజమైన మంత్రులు
33. షట్కర్ణాద్భిద్యతే మన్త్రః
అ. ఇద్దరు చేసిన ఆలోచన మూడోవాడికి తెలిసిందా రహస్యం అంతా బట్టబైలైనట్టే
34. త్రయాణా మేకైక వాక్యే ఏవాసంప్రత్యయః.
అ. ముగ్గురు కలిస్తే వాళ్లు ఒకేమాటమీద ఉంటారనేదే నమ్మజాలని విషయం. అలాంటప్పుడు ఇద్దరు చేసిన మంతనాలు మూడోవాడికి తెలిస్తే దాగుతాయా?
35. అపత్సు స్నేహసంయుక్తం మిత్రమ్ .
అ. అవదలలో కూడా న్నేహంగా ఉన్న వాడే మిత్రుడు.
36. మిత్రసంగ్రహేణ బలం సంపద్యతే.
అ. మిత్రుల్ని సంపాదించడం చేత బలం చేకూరుతుంది.
37. బలవానలభ్ద లాభే ప్రయతతే.
ఆ. బలంకలవాడు. ఇంతకు ముండు లభించినదానిని పొందడం కోసం ప్రయత్నిస్తాడు.
38. ఆలబ్దలాభో నాలసస్య.
అ. సోమరికి ఆల్బం (ఇదివరలో లేనిది) లభించదు.
39. అల సేన లబ్దమపి రక్షితుం న శక్యతే.
అ. సోమరి దొరికినదాన్ని కూడా రక్షించుకోలేడు.
40. న చాలసస్య రక్షితం వివర్ధతే.
అ. సోమరి రక్షించుకొన్న ది కూడా వృద్ధి పొందదు.
41. నాసౌ భృత్యాస్ పోషయతి న తీర్థం ప్రతిపాదయతిచ.
అ. సోమరి పోష్యవర్గాన్ని పోషించడు, సత్పాత్రదానం చెయ్యడు.
42. అలబ్ద లాభాది చతుష్టయం రాజ్యతన్త్రమ్
అ. లేనిదాన్ని సంపాదించడం, సంపాదించినదాన్ని రక్షించుకోవడం, దాన్ని వృద్ధి పొందించుకోవడం, తగిన రీతిలో వినియోగించడం. ఈనాలుగే రాజ్యతంత్రం (రాజ్యవ్యవహారం) అంటే
43. తచ్చ రాజ్యతన్త్రమాయత్తం నీతిశాస్త్రేషు
అ. రాజ్యతంత్రం అంతా నీతిశాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది.
44. రాజ్యతన్త్రేష్వాయత్తా తన్త్రావాపౌ
అ. తంత్రవాపాలు రెండూ రాజ్యతంత్రంమీద ఆధారపడి ఉంటాయి. తన రాష్ట్రంలో జరిగే వ్యవహారం తంత్రం. పరరాష్ట్రంలో జరిగేది ఆవావం.
45. తన్త్రం స్వవిషయకృత్యేష్వాయత్త మ్.
అ. తన రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించినది తంత్రం.
46. ఆవాపో మణ్డడలనివిష్టటః
అ. ఇతర రాజ్యాలకు సంబంధించినది ఆవాపం.
47. సన్టివిగ్రహయోనిర్మణ్డలః
అ. సంధికి గాని విగ్రహానికి గాని కారణ మైనది "మండ లం".
48. నీతిశాస్త్రానుగో రాజా.
అ. నీతిశాస్త్రాన్ని అనుసరించేవాడే రాజు .
49. అనన్తరప్రకృతిః శత్రుః
అ. సరిహద్దు రాజ్యం రాజు శత్రువు.
50. ఏకాన్త రితం మిత్ర మిష్యతే.
ఆ. మధ్య ఒక రాజ్యం అడ్డున్న రాజ్యానికి రాజై నవాడు మిత్రుడు. ఈ ఇద్దరూ సహజ శత్రుమిత్రులు.
51. హేతుతః శత్రుమిత్రే భవిష్యత:.
ఆ. ఏదో ఒక కారణాన్ని బట్టి కూడా శత్రువులు, మిత్రులూ అవుతుంటారు
52. హీయమానః సంధిం కుర్వీత,
అ. బలం తగ్గిపోతున్న వాడు సంధి చేసుకోవాలి. బలం పూర్తిగా తగ్గిపోయిన తరవాత కాదు.
58. తేజో హి సంధాన హేతున దరానామ్. .
అ. సంధివల్ల ప్రయోజనం పొందాలనుకొనే వాళ్ళకి సంధి కుదరాలందటే రెండు పక్షాలవాళ్ళకి తేజస్సు (బలం) ఉండాలి.
54. నాతప్త లోహో లో హేన సంధీయతే.
అ. కాల్చకుండా లోహం లోహంతో అతకదు.
55.బలవాన్ హీనేన నిగృహ్ణీయాత్, న జ్యాయసా సమేనవా
అ. బలంగా ఉన్న వాడు తనకంటే తక్కువ బలం ఉన్న వాడితో విరోధం పెట్టుకోవాలి; తనకంటే ఎకువ బలం ఉన్న వాడితో గాని, సమునితో గాని విరోధం పెట్టుకోకూడదు.
56. గజేన పాదయుద్దమివ బలవద్విగ్రహః, అమపాత్రమప్యా మేన వినశ్యతి.
బలవంతునితో యుద్ధం పెట్టుకోవడం కాలిబంటు ఏనుగుతో యుద్ధం చేయడం వంటిది. పచ్చికుండ పచ్చికుండతో ఢీకొన్నా కూడా బ్రద్దలైపోతుంది. (గట్టి వస్తువుతో డికొంటే ఇంకా చెప్పాలా?)
57. అరిప్రయత్నమభిసమీ క్షేత.
అ. శత్రువు చేస్తున్న ప్రయత్నాలు ఒక కంట కనిపెడుతూ ఉండాలి.
58. సంధాయైకతో వా యాయాత్.
అ. చాలామంది శత్రువులున్నప్పుడు ఒకరితో సంధి చేసికొని 'రెండవవాని మీదికి యుద్ధానికి వెళ్ళాలి.
59. అమిత్రవిరోధాదాత్మరక్షామావ సేత్
ఆ. శత్రువులతో విరోధం వల్ల అనగా శత్రువులు విరోధం చూపుతున్నప్పుడు ఆత్మరక్షణ చేసుకోవాలి. లేదా శత్రువులతో విరోధంకంటే ఆత్మరక్షణకు ఏర్పాట్లు చేసుకోవడం మంచిది అని అర్థం.
60. శక్తిహీనో బలవన్త మాశ్రయేత్ .
ఆ. శక్తి లేనివాడు బలవంతుణ్ణి ఆశ్రయించాలి.
61. దుర్బలాశ్రయో దుఃఖమావహతి.
అ. దుర్బలుణ్ణి ఆశ్రయిస్తే లేని కష్టాలు తెచ్చి పెట్టుకున్నట్లు అవుతుంది.
62. అగ్నివద్రాజానమాశ్రయేత్ .
అ. రాజును అగ్నిని ఆశ్రయించినట్లు ఆశ్రయించాలి. అగ్నితో వ్యవహరించినట్లు వ్యవహరించాలి.
63. రాజ్ఞః ప్రతికూలం నాచరేత్ .
అ. ఆశ్రయించిన రాజుకు ప్రతికూలంగా ప్రవర్తించ కూడదు.
64. ఉద్దతవేషదరో న భవేత్.
అ. ఆ రాజు ఎదుట ఆడంబర పూర్వకమైన వేషం ధరించకూడదు .
65. న దేవచరితం చరితం చరేత్
అ. దేవతలు ప్రవర్తించినట్లు ప్రవర్తించకూడదు. శ్రీరామకృష్ణాదులూ రాజులే; నేనూ రాజునే అన్నట్లు ప్రవర్తించకూడదు.
66. ద్వయోరపీర్ష్యతోః ద్వైధీభావం కుర్వీత.
అ, ఇద్దరు తనతో విరోధం పెట్టుకొన్నప్పుడు ద్వైదీభావం చెయ్యాలి. అనగా ఒకరితో సంధి చేసుకొని రెండవవానితో విరోధం సాగించాలి.
67. న వ్యసనపరస్య కార్యావాప్తి :.
అ. దుర్వ్యసనాలకి లొంగిపోయినవారికి ఏ పనీ జరగదు.
68. ఇన్ద్రియ వశవర్తీ చతురంగ వానపి వినశ్యతి.
అ. ఇంద్రియాలకి లొంగిపోయినవాడు చతురంగబలం ఉన్నా నశిస్తాడు.
69. నాస్తి కార్యం ద్యూత ప్రవృత్తస్య.
అ. ద్యూత (జూదం) వ్యసనంలో పడ్డవారు ఏ పనీ సాధించ లేడు.
70. మృగయాపరస్య ధర్మార్దౌ నశ్యతః.
అ. వేట వ్యసనం ఉన్న వాని ధర్మం , అర్థం కూడా అన్నీ నశిస్తాయి.
71. న కామాసక్త స్య కార్యానుష్టానమ్.
అ. కానూసక్తుడు ఏ పనీ చేయ లేడు .
72. అర్దేషణా న వ్యసనేషు గణ్యతే.
అ. రాజుకు ధనాసక్తి ఉండడం వ్యసనంగా పరిగణించబడదు.
73. అర్థతోషిణం హి రాజానం శ్రీః పరిత్యజతి.
ఆ. ఉన్న ధనం చాలునులే అనుకొనే రాజును లక్ష్మి విడిచి వేస్తుంది.
74. అగ్ని దాహాదపి విశిష్టం పురుషవాక్యమ్.
ఆ. వాక్పారుష్యం నిప్పు వేడికంటే కూడా అధిక మైనది.
75. దణ్డపౌరుష్యాత్ సర్వజనద్వేష్యో భవతి.
అ. దండం (శిక్షించడం)లో పరుషంగా ఉందే అందరికీ ద్వేషపాత్రుడౌతాడు.
76. అమిత్రో దణ్డనిత్యామాయత్త :.
అ. శత్రువు దండ నీతికి లొంగుతాడు. దండం అనగా అపరాధుల్నిశిక్షించడం, రాజ్యాన్ని పాలించడం, (దండ నీతి అనగా 'రాజనీతి "పాలనారీతి అని అర్థం
77. దణ్ణనీతిమధితిష్ఠన్ ప్రజాః సంరక్షతి.
ఆ. దండనీతి అవలంబించినవాడే ప్రజల్ని రక్షించగలుగుతాడు.
78. దణ్డః సంపదా యోజయతి,
అ.దండం సంపదను సంపాదించి పెడుతుంది.
79. దణ్డభావే త్రివర్గాభావః,
ఆ. దండం అనేది లేకపోతే త్రివర్గమే (ధర్మ-అర్ద.కామాలే) లేదు.
80. న దణ్డాద కార్యాణి కుర్వన్తి
అ. దండం ఉంది కాబట్టే చెడ్డ పనులు చెయ్యరు.
81. దణ్డనీత్యామాయత్త మాత్మరక్షణమ్.
అ. ఆత్మరక్షణం దండనీతిమీద ఆధార పడి ఉంటుంది.
82. ఆత్మని రక్షితే సర్వం రక్షితం భవతి.
అ. తనని తాను రక్షించుకొందే అన్నీ రక్షించినట్లే.
83. ఆత్మాయత్తౌ వృద్ధివినాశౌ,
అ. అభివృద్దెనా వినాశనమైనా తన చేతుల్లో ఉంటుంది.
84. దణ్డోహి విజ్ఞానేన ప్రణీయతే.
అ. దండాన్ని వివేక పూర్వంగా ప్రయోగించాలి .
85. దుర్బలోపి రాజా నావమన్తవ్యః
ఆ. దుర్బలుడైనా రాజును అవమానించకూడదు..
86. నాస్త్యగ్నే ర్దౌర్భల్యమ్
అ. అగ్నికి దుర్బలత్వం అనేది ఉండదు
87. దణ్డే ప్రణీయతే వృత్తి :
అ. దండం ఉంటేనే వృత్తులు (జీవనోపాయాలు) సాగుతాయి.
88, వృత్తి మూలమర్ద లాభః
అ. వృత్తికి మూలం ధనలాభం. ధనలాభం ఉంటేనే ఎవరైనా ఆ వృత్తి చేపడతారు.
89. అర్థమూలౌ ధర్మకామౌ
అ. ధర్మ. కామాలకి మూలకారణం అర్థమే.
(ప్రథమాద్యాయం సమాప్తం.)
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment