దాశరథీ శతకం మొదటి భాగం dasaradhi satakam part one
దాశరథీ శతకం మొదటి భాగం
001
శ్రీ రఘురామ చారు తులసీదళ దామ శమక్షమాది శృం
గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ
భావం: రఘువంశమున బుట్టినవాడవు, సొంపైన తులసీదండలు గలవాడవు, శాంతి, ఓరిమి మొదలు గుణములచే నొప్పువాడవు, ముల్లోకముల బొగడదగిన పరాక్రమలక్ష్మికి ఆభరణమైనవాడా! వారింపనలవికాని కబంధుడను రాక్షసుని సంహరించినవాడా, జనుల పాపములను సముద్రమును దాటించు నామము గలవాడా! దయకు సముద్రమువంటివాడా! భద్రాచలమందుండు శ్రీరామా!
002
రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద
శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలో
ద్ధామ విరామ భద్రగిరి - దాశరథీ కరుణాపయోనిధీ!
భావం: జనులను సంతోషింపజేయువాడవు, పరశురాముని జయించినవాడవు, పరస్రీలయందాసక్తి లేనివాడవు, నల్లని మేఘమువంటి శరీర కాంతిగలవాడవు, కాకుత్ స్థ వంశమును సముద్రమునకు చంద్రునివంటి వాడవు, రాక్షసుల సంహరించిన వాడవునైన భద్రాచల రామా!
003
అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ
విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూతకృ
ద్గగన ధునీ మరంద పదకంజ విశేష మణిప్రభా ధగ
ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: సత్యము మాట్లాడువాఁడవు, శరణన్న వారిని రక్ష్మించువాడవు, దయచేతఁ బాపములఁ బోగొట్టువాడవు, బ్రాహ్మణుల సంతోషింపజేయువాడవు, గంగానది పుట్టిన పాదపద్మములు గలవాడవు, మణులచే నిగ నిగ మెఱయు సొమ్ములు గలవాడవు, భద్రాచల రామా!
004
రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స
త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా
తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ.
భావం: శత్రువుల సంహరించినవాడవు, గరుత్మంతుడు వాహనముగ గలవాడవు, ఆపదల బోగొట్టువాడవు, రంగనాధునిచే సేవింపబడిన వాడవు, దయతో నొప్పు మనస్సుగలవాడవు, సత్సంగుడవు, సీతాహృదయమును పద్మమునకు తుమ్మెదవంటివాడవు, రాక్షసులకు బీభత్స కరుడవు, శుభాంగుడవునైన భద్రాచల రామా!
005
శ్రీద సనందనాది మునిసేవిత పాద దిగంతకీర్తిసం
పాద సమస్తభూత పరిపాల వినోద విషాద వల్లి కా
చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: సంపదల నిచ్చువాడవు, మునులచే బూజింపబడినవాడవు, కీర్తిమంతుడవు, అన్ని భూతములను పాలించువాడవు, దుఖఃముల బోగొట్టువాడవు, క్షత్రియ కులమును సముద్రమునకు జంద్రుడవు, నృత్యము, గానము వేడుకగా గలవాడవు, భద్ర - నిధీ!
006
ఆర్యుల కెల్ల మ్రొక్కివిన తాంగుడనై రఘునాధ భట్టరా
రార్యుల కంజలెత్తి కవి సత్తములన్ వినుతించి కార్య సౌ
కర్య మెలర్పనొక్క శతకంబొన గూర్చి రచింతునేడుతా
త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: పెద్దల కందఱికి మ్రొక్కి, వంచిన శరీరము గలవాడనై గురువైన రఘునాధభట్టునకు నమస్కరించి, కవిశ్రేష్ఠులను పొగడి, కార్య లాభమునకై యొక శతకంబును వ్రాసెదను. దీని నిష్టముతో గైకొనుము దాశ - నిధీ!
007
మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లు దు
ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యె నా
రసనకుఁ బూతవృత్తి సుకరంబుగ జేకురునట్లు వాక్సుధా
రసములుచిల్క బద్యముఖ రంగమునందునటింప వయ్య సం
తసమును జెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: రేగుపండ్లను ముత్తెములుపోసి కొనినట్లు దురాశతో మోసపోయి నా కావ్యములను దుర్మార్గుల కిచ్చితిని; నా నాల్కకు పవిత్రత సులభముగ గల్గునట్లును, పలుకుదేనియలు చిల్కునట్లు నా పద్యము ముఖమును నాట్యరంగమునందు సంతోషముతో నీవు నటింపుము. భద్ర - నిధీ!
008
శ్రీరమణీయహార యతసీ కుసుమాభ శరీర, భక్త మం
దార, వికారదూర, పరతత్త్వవిహార త్రిలోక చేతనో
ద్ధార, దురంత పాతక వితాన విదూర, ఖరాది దైత్యకాం
తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: హారములు గలవాడవు, అవిసెపూవువంటి శరీరకాంతి గలవాడవు, భక్తులకు కల్పవృక్షమవు, వికారములు లేనివాడవు, దేవతాతత్త్వమందు విహరించువాడవు, మూడులోకముల గల ప్రాణులను బోషించువాడవు, పాపముల బోగొట్టువాడవు, ఖరాది రాక్షసారణ్యమునకు గొడ్డలివంటి వాడవు, భద్ర - నిధీ!
009
దురితలతాలవిత్ర, ఖర దూషణ కానన వీతిహోత్ర, భూ
భరణకళావిచిత్ర, భవ బంధ విమోచన సూత్ర, చారువి
స్ఫురదరవింద నేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం
ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: పాపమను తీగలకు కొడవలివంటివాడవు, ఖరదూషణాదుల నెడి యడవికి యగ్నివంటివాడవు, భూమిని రక్షించుటయందు విచిత్రుడవు, పుట్టుకయను ముడిని విడదీయుటయే విధిగాగలవాడవు, ప్రకాశించు పద్మములవంటి నేత్రములు గలవాడవు, పుణ్యచరిత్రుడవు, మేఘకాంతి వంటి శరీరకాంతి గలవాడవు.
010
కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స
జ్జనపరిపాలశీల! దివిజస్తుత సద్గుణ కాండ! కాండ సం
జనిత పరాక్రమ! క్రమ విశారద! శారద కందకుంద చం
దన ఘనసార! సారయశ దాశరథీ కరుణా పయోనిధీ.
భావం: బంగారు మయమైన వస్త్రములు గలవాడవు, సంసారమను నడవికి గొడ్డలి మొనవంటివాడవు, సజ్జనుల పరిపాలించెడివాడవు, దేవతలచే బొగడబడినవాడవు, మంచి గుణములు గలవాడవు, బాణవిద్యలో బండితుండవు, శరత్కాలపు మేఘము, మొల్లలు, గంధము పచ్చ కర్పూరము వంటి నిగ్గైన కీర్తిగలవాడవు.
011
శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి
త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాధురీ
పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ
తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ
భావం: రఘువంశమునకు జంద్రునివంటివాడవు, అట్టి నీ చరణముల నుత్పలము, చంపకము మొదలగు పద్యవృత్తములను పూలచే బూజించును. నా పూజలను గైకొనుము.
012
గురుతరమైన కావ్యరస గుంభనకబ్బుర మందిముష్కరుల్
సరసులమాడ్కి సంతసిల జాల రదెట్లు శశాంక చంద్రికాం
కురముల కిందు కాంతమణి కోటిస్రవించిన భంగివింధ్యభూ
ధరమున జాఱునే శిలలు దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: మూఢులు గ్రంధములలోని రసముయొక్క కూర్పునకు రసికుల వలె సంతోషింపజాలరు. ఎట్లన చంద్రుని వెన్నెలకు చంద్రకాంత శిలలు కఱగి జాఱునట్లు వింధ్యపర్వతమున నుండు ఱాళ్ళు జాఱవు.
013
తరణికులేశ నానుడుల దప్పులు గల్గిన నీదునామ స
ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం
బరగుచువంకయైన మలినాకృతి బాఱిన దన్మహత్వముం
దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నా మాటలలో దప్పులున్నను నీ పేరుతో వ్రాయబడు కావ్యము పవిత్రమైనదే, ఎట్లన గంగానది నీరు వంకరగ బాఱినను, ముఱికిగ మాఱినను దాని గొప్పతన మెక్కడ పోవును?
014
దారుణపాత కాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తివి
స్తారదవానలార్చికి సుధారసవృష్టి దురంత దుర్మతా
చారభయంక రాటవికి జండకఠోరకుఠారధార నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నీ పేరు పాపమను సముద్రమునకు బడబాగ్ని వంటిది, సంసారమను కార్చిచ్చునకు నమృతపు వాన, దుర్మతాచారములకు గొడ్డలి మొన వంటిది.
015
హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై
కరికి సహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నీ నామ మీశ్వరునకు, విభీషణునకు, పార్వతికిని శ్రేష్ఠమగు మంత్రమైనది. అట్టి పరమ పవిత్రమైన నీ నామము నా నాల్కయం దెప్పుడు నాడునట్లు చేయుము.
016
ముప్పున గాలకింకరులు ముంగిటవచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్
గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే
తప్పకచేతు మీభజన దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: ముసలితనమున యమభటులు వాకిట ముందునకు వచ్చి యుండగా, రోగ మెక్కువై కఫము గొంతులో నిండినప్పుడు, బంధువులు చుట్టుకొన్నప్పుడు మిమ్ము తలతునో తలపలేనో, భజింతునో భజింపలేనో కాబట్టి యిప్పుడే యా పని నెరవేర్చెదను.
017
పరమదయానిధే పతితపావననామ హరే యటంచు సు
స్ధిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా
శిరమునదాల్తుమీరటకు జేరకుడంచు యముండు కింకరో
త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: దయకు సముద్రమువంటివాడవు, పాపులనుద్ధరించు పేరుగలవాడవు. హరీ యని నిలుకడగల బుధ్ధితో గొలుచు మహాత్ముల కాళ్ళ దుమ్ము నా నెత్తిపై దాల్తును. అప్పుడు యముడు తన భటులను నా జోలికి పోవద్దని యాజ్ఞాపించును.
018
అజునకు తండ్రివయ్యు సనకాదులకున్ బరతత్త్వమయ్యుస
ద్ద్విజమునికోటికెల్లబర దేతవయ్యు దినేశవంశ భూ
భుజులకు మేటివయ్యుబరి పూర్ణుడవై వెలిగొందుపక్షిరా
డ్ధ్వజమిము బ్రస్తుతించెదను దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: బ్రహ్మకు దండ్రివి, సనకాదులకున్ బరతత్త్వమవు, బ్రాహ్మణులకు, ఋషులకు ముఖ్య దేవుడవు, సూర్యవంశపు రాజులలో నధికుడవు, అట్టి నిన్ను పొగడెదను.
019
పండిత రక్షకుం డఖిల పాపవిమొచను డబ్జసంభవా
ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండకాండకో
దండకళా ప్రవీణుడవు తావక కీర్తి వధూటి కిత్తుపూ
దండలు గాగ నా కవిత దాశరథీ కరుణాపయోనిధీ!
భావం: పండిత రక్షకుఁడు, పాపములఁ బోఁగొట్టువాఁడు, బ్రహ్మేంద్రాదులచే బూజింపఁబడినవాఁడు, రావణాసురిని సంహరించినవాడను నీ కీర్తి కన్యకు నా కవిత్వమును బూదండవలెనిత్తును.
020
శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
చార జవంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: లక్ష్మీదేవి సీత, సేవకులు వైష్ణవజనులు, విరజానది, గోదావరి, వైకుంఠము, భద్రాచలము కాగా ప్రాణుల నుధ్ధరించునట్టి విష్ణువుడ నీవు దా - నిధీ!
021
కంటి నదీతటంబుబొడగంటిని భద్రనగాధివాసమున్
గంటి నిలాతనూజనురు కార్ముక మార్గణశంఖచక్రముల్
గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్ధుడ నైతి నో జగ
త్కంటక దైత్యనిర్ధళన దాశరథీ కరుణాపయోనిధీ!
భావం: ఏటిదరిని భద్రాచలమునం దుండుట జూచితిని, సీతను జూచితిని, గొప్పవైన ధనువును, బాణములను, శంఖచక్రముల జూచితిని, మిమ్ము, లక్ష్మణుని జూచి కృతార్ధుడనైతి
022
హలికునకున్ హలాగ్రమున నర్ధము సేకురుభంగి దప్పిచే
నలమట జెందువానికి సురాపగలో జల మబ్బినట్లు దు
ర్మలిన మనోవికారియగు మర్త్యుని నన్నొడగూర్చి నీపయిన్
దలవు ఘటింపజేసితివి దాశరథీ కరుణాపయోనిధీ!
భావం: రైతునకు నాగేటి చివర ధనమిచ్చినట్లును, దప్పితో బాధ పడువానికి గంగానదీజల మబ్బినట్లును, చెడు మనస్సు గల నాకు నీపై భక్తి కలుగునట్లు చేసితివి.
023
కొంజకతర్క వాదమను గుద్దలిచే బరతత్త్వ భూస్ధలిన్
రంజిల ద్రవ్వి కన్గొనని రామ నిధానము నేడు భక్తి సి
ద్ధాంజనమందు హస్తగత మయ్యె భళీ యనగా మదీయహృ
త్కంజమునన్ వసింపుమిక దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: తర్కవాదముచేనైన గన్గొనరాని రాముడను నిధి, భక్తియను బైరాగుల కాటుకతో నందఱు సెబాసనగా జేజిక్కిన దయ్యెను. ఇంక నా మనస్సునందు స్థావరముగా నిలువుము.
024
రాముఁడు ఘోర పాతక విరాముడు సద్గుణకల్పవల్లికా
రాముడుషడ్వికారజయ రాముడు సాధుజనావనవ్రతో
ద్దాముఁడు రాముడే పరమ దైవము మాకని మీ యడుంగు గెం
దామరలే భుజించెదను దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: పాపములను పోగొట్టువాడు, మంచిగుణములను కల్పవృక్షపు తీగెలకు దోటవంటివాడు, వికారములను జయించినవాడు, మంచివారిని రక్షించువాడు నైన రాముడే ముఖ్య దేవుడుగా నీ యడుగు లను పద్మముల గొలుతును.
025
చక్కెరమానివేముదిన జాలినకైవడి మానవాధముల్
పెక్కురు బక్క దైవముల వేమఱుగొల్చెదరట్లు కాదయా
మ్రొక్కిననీకు మ్రొక్కవలె మోక్ష మొసంగిన నీవయీవలెం
దక్కినమాట లేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: హీనులనేకులు నిన్ను విడిచి ఇంకొకరిని గొలిచెదరు. అనగా తియ్యని చక్కెరను తినలేక వేప వస్తువగు చేదును తినుటకు నేర్చినట్లున్నది.మ్రొక్క దగినవాడవు నీవే , మోక్షదాయకుడవు నీవే !
026
'రా' కలుషంబులెల్ల బయలంబడద్రోచిన 'మా'క వాటమై
డీకొనిప్రోవుచునిక్క మనిధీయుతులెన్నఁదదీయ వర్ణముల్
గైకొని భక్తి చే నుడువఁగానరు గాక విపత్పరంపరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: 'రా' యను నక్షరము పాపముల బారద్రోలగా, 'మా' యను నక్షరము వాకిలియై పాపముల జొరనీయకుండును అని పెద్దలైనవారు పై 'రామ' యను నక్షరముల బుద్ధిమంతులు భక్తితో బలుకకుందురే గాని, పలికినట్లైన యాపదలు ప్రపంచ జనుల గ్రమ్ముకొనవు.
027
రామహరే కకుత్ధ్సకుల రామహరే రఘురామరామశ్రీ
రామహరేయటంచు మది రంజిల భేకగళంబులీల నీ
నామము సంస్మరించిన జనంబు భవంబెడబాసి తత్పరం
ధామ నివాసులౌదురట దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: రామ హరే యని నీ పేరును గప్ప గొంతుకవలె దలఁచిన జనులు జన్మరహితులై మోక్షము జెందుదురట.
028
చక్కెర లప్పకున్ మిగుల జవ్వని కెంజిగురాకు మోవికిం
జొక్కపుజుంటి తేనియకు జొక్కులుచుం గనలేరు గాక నే
డక్కట రామనామమధు రామృతమానుటకంటె సౌఖ్యామా
తక్కినమాధురీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: అయ్యో! ఈ కాలమువారు చక్కెరరాశికిని, యువతి యొక్క పెదవికిని, తేనెటీగలు పెట్టిన తేనెకు నాసపడుచున్నారు. రాముని పేరులో గల తీపిని నెఱుంగలేరు. రాముని పేరులో గల తీయదనము కంటే వానిలో గల తీయదన మంత సుఖమా!
029
అండజవాహ నిన్ను హృదయంబుననమ్మిన వారి పాపముల్
కొండలవంటివైన వెసగూలి నశింపక యున్నె సంత తా
ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్ష లక్ష్మికై
దండయొసంగకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నిన్ను నమ్మి కొలిచినవారి పాపములు కొండలంతటివైనను నశించిపోవును. ఇంద్రవైభవములు కల్గును. మోక్షలక్ష్మి చేయూతనొసంగును.
030
చిక్కనిపాలపై మిసిమి జెందిన మీగడ పంచదారతో
మెక్కినభంగి మీవిమల మేచకరూప సుధారసంబు నా
మక్కువ పళ్లేరంబున సమాహిత దాస్యము నేటిదో యిటన్
దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: చిక్కని పాలిమీద నిగనిగలాడు మీగడతో జక్కెర గలిపికొని తిన్నట్లుగ నీ రూప మనియెడు నమృతము నా ప్రేమ పాత్రలో దగిన దాస్యమును దోసిలియందు లభించిందని చెప్పి జుఱ్ఱుకొందును.
031
సిరులిడసీత పీడలెగ జిమ్ముటకున్ హనుమంతుడార్తిసో
దరుడు సుమిత్రసూతి దురితంబులుమానుప రామ నామముం
గరుణదలిర్ప మానవులగావగ బన్నిన వజ్రపంజరో
త్కరముగదా భవన్మహిమ దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: సంపద లిచ్చుటకు సీత, పీడల పోగొట్టుటకు హనుమంతుడు, ధుఃఖముబాప లక్ష్మణుడు పాపము హరించుటకు రామనామములను గరుణతో మానవుల రక్షిచుటకై యేర్పరుపబడినవి.
032
హలికులిశాంకుశధ్వజ శరాసన శంఖరథాంగ కల్పకో
జ్వలజలజాత రేఖలను సాంశములై కనుపట్టుచున్న మీ
కలితపదాంబుజ ద్వయము గౌతమపత్ని కొసంగినట్లు నా
తలపున జేర్చికావగదె దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: శంకచక్రాదులతో బ్రకాశించు పద్మరేఖల వలె చిహ్నములు గలవైన మీ పాదముల నహల్య కొసగినట్లు నా భామునందు గూడ నిలుచునట్లు చేయును.
033
జలనిధిలోనదూఱి కుల శైలముమీటి ధరిత్రిగొమ్మునం
దలవడమాటిరక్కసుని యంగముగీటిబలీంద్రునిన్ రసా
తలమునమాటి పార్ధివక దంబముగూల్చిన మేటిరామ నా
తలపుననాటి రాగదవె దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామాద్యవతారముల నెత్తినట్టి రామా! నా భావమునందు నిలువగా రమ్ము.
034
భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండకళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
దాండద దాండ దాండ నిన దంబులజాండము నిండమత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: యుద్ధమునందు భయంకరుడు, దుఃఖితులకు జుట్టము, ధనుర్విద్యయందును, భుజబలము నందును పేరు గన్న రాముని వంటి దేవుడింకొకడు లేడు. ఈ విషయము నేను లోకమునకు జాటెదను.
035
అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగెడు సోమ, జానకీ
కువలయనేత్ర గబ్బిచనుకొండల నుండు ఘనంబ మైధిలీ
నవనవ యౌవనంబను వనంబుకున్ మదదంతి వీవెకా
దవిలి భజింతు నెల్లపుడు దాశరథీ కరుణాపయోనిధీ!
భావం: సీత కన్నులను కలువలకు జంద్రుడవు, సీత యొక్క యుబ్బిన స్తనములను కొండల నుండెడి మేఘమవు. సీత యొక్క కొంగ్రొత్త యౌవన మను వనమునకు మదించిన యేనుగువంటివాడవు నీవని యిష్టముతో గొలుతును.
036
ఖరకరవంశజా విను మఖండిత భూతపిశాచఢాకినీ
జ్వర పరితాపసర్పభయ వారకమైన భవత్పదాబ్జ ని
స్పుర దురువజ్రపంజరముజొచ్చితి, నీయెడ దీన మానవో
ధ్ధర బిరుదంక మేమఱుకు దాశరథీ కరుణాపయోనిధీ!
భావం: భూత పిశాచాది భయముల బోగొట్టునవైన నీ పాదముల బ్రవేశించితిని. ఇపుడు దీనుల నుద్ధరించువాడవను నీ బిరుదు యొక్క చిహ్నము మఱవకుము.
037
జుఱ్ఱెదమీక థామృతము జుఱ్ఱెదమీపదకంజతో యమున్
జుఱ్ఱెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే
జుఱ్ఱెద జుఱ్ఱుజుఱ్ఱుఁన రుచుల్ గనువారిపదంబు గూర్పవే
తుఱ్ఱులతోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: మీ కధామృతమును మీ పాదపద్మములను జుఱ్ఱుకొందును. రామనామములో గారుచున్న యమృతరసమును జుఱ్ఱెదను. అందలి రుచుల నెఱిగినవారి స్థానమిమ్ము. దుర్మార్గుల స్నేహ మొసగకుము.
038
ఘోరకృతాంత వీరభట కోటికి గుండెదిగుల్ దరిద్రతా
కారపిశాచ సంహరణ కార్యవినోది వికుంఠ మందిర
ద్వార కవాట భేది నిజదాస జనావళికెల్ల ప్రొద్దు నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నీ నామము యమభటులకు గుండె దిగులు కలిగించునది, దరిద్ర పిశాచమును నాశనము చేయునది. నీ భక్తుల కెప్పటికిని వైకుంఠ ద్వారమున గల తలుపులను బ్రద్దలు గొట్టునటువంటిది.
039
విన్నపమాలకించు రఘువీర నహిప్రతిలోకమందు నా
కన్నదురాత్ముడున్ బరమ కారుణికోత్తమ వేల్పులందు నీ
కన్న మహాత్ముడుం బతిత కల్మషదూరుడు లేడునాకువి
ద్వన్నుత నీవెనాకు గతి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నాకన్న దురాత్ముడు ప్రపంచమున లేడు. నీకన్న మహాత్ముడు దేవతలలో లేడు. కావున నాకు నీవె దిక్కు. మరియొకరు కాదు.
040
పెంపునఁదల్లివై కలుష బృందసమాగమ మొందుకుండు ర
క్షింపనుదండ్రివై మెయు వసించు దశేంద్రియ రోగముల్ నివా
రింపను వెజ్జవై కృప గుఱించి పరంబు దిరబుగాఁగ స
త్సంపదలీయ నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: పోషించుటలో దల్లివి, పాపముల బొందకుండ రక్షించుటలో దండ్రివి, రోగమును వారించుటలో వైద్యుడవై, దయతో శాశ్వతమోక్ష మొసగి రక్షింపుము.
Comments
Post a Comment