దాశరథీ శతకం మూడవ భాగం dasaradhi satakam part three

దాశరథీ శతకం మూడవ భాగం


081
దురిత లతానుసార భయ దుఃఖ కదంబము రామనామభీ

కరతర హేతిచేఁ దెగి కకావికలై చనకుండ నేర్చునే

దరికొని మండుచుండు శిఖ దార్కొనినన్ శలబాది కీట కో

త్కరము విలీనమై చనవె దాశరథీ కరుణాపయోనిధీ.


082
హరిపదభక్తినింద్రియజ యాన్వితుడుత్తముఁడింద్రిమంబులన్

మరుగక నిల్పనూదినను మధ్యముఁడింద్రియపారశ్యుడై

పరగినచో నికృష్టుడని పల్కగ దుర్మతినైన నన్ను నా

దరమున నెట్లుకాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ.


083
వనకరిచిక్కు మైనసకు పాచవికిం జెడిపోయె మీనుతా

వినికికిఁజిక్కెఁజిల్వగను వేఁదుఱుఁ జెందెను లేళ్ళు తావిలో

మనికినశించె దేటితర మాయిరుమూఁటిని గెల్వనై దుసా

ధనములనీ వె కావనగు దాశరథీ కరుణాపయోనిధీ.


084
కరములుమీకుమ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ

స్మరణదనర్పవీనులుభ వత్కథలన్ వినుచుండనాస మీ

యఱుతును బెట్టుపూసరుల కాసగొనం బరమార్థ సాధనో

త్కరమిది చేయవేకృపను దాశరథీ కరుణాపయోనిధీ.


085
చిరతరభక్తి నొక్కతుళసీదళ మర్పణ చేయువాడు ఖే

చరగరు డోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సధా భవత్

సురుచిర ధీంద పాదముల బూజలొనర్చిన వారికెల్లద

త్పర మరచేతిధాత్రిగద దాశరథీ కరుణాపయోనిధీ!


086
భానుడు తూర్పునందు గనుపట్టినఁ బావక చంద్ర తేజముల్

హీనత జెందినట్లు జగదేక విరాజితమైన నీ పద

ధ్యానము చేయుచున్నఁ బర దైవమరీచు లడంగకుండునే

దానవ గర్వ నిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ.


087
నీమహనీయతత్త్వ రస నిర్ణయ బోధ కథామృతాబ్ధిలో

దామును గ్రుంకులాడక వృథా తను కష్టము జెంది మానవుం

డీ మహిలోక తీర్థముల నెల్ల మునింగిన దుర్వికార హృ

త్తామసపంకముల్ విడునె దాశరథీ కరుణాపయోనిధీ.


088
నీమహనీయతత్త్వ రస నిర్ణ యబోధ కథామృతాబ్ధిలో

దామునుగ్రుంకులాడకవృ థాతనుకష్టముజెంది మానవుం

డీ మహిలోకతీర్థముల నెల్ల మునింగిన దుర్వికార హృ

తామసపంకముల్ విదునె దాశరథీ కరుణాపయోనిధీ.


089
కాంచన వస్తుసంకలిత కల్మష మగ్ని పుటంబు బెట్టివా

రించినరీతి నాత్మనిగిడించిన దుష్కర దుర్మలత్రయం

బంచిత భ క్తియోగ దహనార్చిఁదగుల్పక పాయునే కన

త్కాంచనకుండలాభరణ దాశరథీ కరుణాపయోనిధీ.


090
నీసతి పెక్కు గల్ములిడనేర్పిరి, లోక మకల్మషంబుగా

నీసుత సేయు పావనము నిర్మిత కార్యధురీణ దక్షుడై

నీసుతుడిచ్చు నాయువులు నిన్న భుజించినఁ గల్గకుండునే

దాసులకీప్సి తార్థములు దాశరథీ కరుణాపయోనిధీ.


091
వారిజపత్రమందిడిన వారి విధంబున వర్తనీయ మం

దారయ రొంపిలోన దను వంటని కుమ్మరపుర్వురీతి సం

సారమునన్ మెలంగుచు విచారగుడైపరమొందుగాదె స

త్కార మెఱింగి మానవుడు దాశరథీ కరుణాపయోనిధీ.

092
ఎక్కడి తల్లిదండ్రి సుతులెక్కడి వారు కళత్ర బాంధవం

బెక్కడ జీవుఁడెట్టి తను వెత్తిన బుట్టును బోవుచున్న వా

డొక్కడెపాప పుణ్య ఫల మొందిన నొక్కడె కానరాడు వే

ఱొక్కడు వెంటనంటిభవ మొల్లనయాకృప జూడవయ్య నీ

టక్కరి మాయలందిడక దాశరథీ కరుణా పయోనిధీ.

093
దొరసినకాయముల్ముదిమి తోచినఁజూచిప్రభుత్వముల్సిరు

ల్మెఱపులుగాగజూచిమఱి మేదినిలోఁదమతోడివారుముం

దరుగుటజూచిచూచి తెగు నాయువెఱుంగక మోహపాశము

ల్దరుగనివారికేమిగతి దాశరథీ కరుణాపయోనిధీ.


094
సిరిగలనాఁడు మైమఱచి చిక్కిననాఁడుదలంచి పుణ్యముల్

పొరిఁబొరి సేయనైతినని పొక్కినఁ గల్గు నెగాలిచిచ్చుపైఁ

గెరలిన వేళఁదప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త

త్తరమునఁ ద్రవ్వినం గలదె దాశరథీ కరుణాపయోనిధీ.

095
జీవనమింకఁ బంకమున జిక్కిన మీను చలింపకెంతయున్

దావున నిల్చి జీవనమె దద్దయుఁ గోరువిధంబు చొప్పడం

దావలమైనఁగాని గుఱి తప్పనివాఁడు తరించువాఁడయా

తావకభక్తి యోగమున దాశరథీ కరుణాపయోనిధీ.

096
సరసునిమానసంబు సరసజ్ఞుడెరుంగును ముష్కరాధముం

డెఱిఁగి గ్రహించువాడె కొల నేకనివాసము గాగ దర్దురం

బరయఁగ నేర్చునెట్లు వికచాబ్జ మరందరసైక సౌరభో

త్కరముమిళింద మొందుక్రియ దాశరథీ కరుణాపయోనిధీ.


097
నోఁచినతల్లిదండ్రికిఁ దనూభవుఁడొక్కడెచాలు మేటిచే

చాఁచనివాడు వేఱొకఁడు చాచిన లేదన కిచ్చువాఁడునో

రాఁచినిజంబకాని పలు కాడనివాఁడు రణంబులోన మేన్

దాచనివాఁడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

098
శ్రీయుతజానకీరమణ చిన్మయరూప రమేశరామ నా

రాయణ పాహిపాహియని బ్రస్తుతిఁ జేసితి నా మనంబునం

బాయక కిల్బిషవ్రజ విపాటనమందఁగ జేసి సత్కళా

దాయి ఫలంబు నాకియవె దాశరథీ కరుణాపయోనిధీ.


099
ఎంతటిపుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ

మంతన మెట్టిదో యుడుత మైనిక రాగ్ర నఖాంకురంబులన్

సంతసమందఁ జేసితివి సత్కులజన్మము లేమి లెక్క వే

దాంతముగాదె నీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ.


100
బొంకనివాఁడెయోగ్యుడరి బృందము లెత్తిన చోటజివ్వకుం

జంకనివాఁడెజోదు రభసంబున నర్థి కరంబుసాఁచినం

గొంకనివాఁడెదాత మిముఁ గొల్చిభజించిన వాఁడె పోనిరా

తంక మనస్కుఁ డెన్న గను దాశరథీ కరుణాపయోనిధీ


101
భ్రమరముగీటకంబుఁ గొని పాల్పడి ఝాంకరణో కారియై

భ్రమరముగానొనర్చునని పల్కుటఁ జేసి భవాది దుఃఖసం

తమసమెడల్చి భక్తిసహి తంబుగ జీవుని విశ్వరూప త

త్త్వమునధరించు టేమరుదు దాశరథీ కరుణాపయోనిధీ.


102
తరువులు పూచికాయలగు దక్కుసుమంబులు పూజగాభవ

చ్చరణము సోకిదాసులకు సారములో ధనధాన్యరాశులై

కరిభట ఘోటకాంబర నకాయములై విరజా సము

త్తరణ మొనర్చుజిత్రమిది దాశరథీ కరుణాపయోనిధీ!


103
పట్టితిభట్టరార్యగురు పాదములిమ్మెయినూర్ధ్వ పుండ్రముల్

వెట్టితిమంత్రరాజ మొడి బెట్టితి నయ్యమకింక రాలికిం

గట్టితిబొమ్మమీచరణ కంజలందుఁ దలంపుపెట్టి బో

దట్టితిఁ బాపపుంజముల దాశరథీ కరుణాపయోనిధీ.

104
అల్లన లింగమంత్రి సుతుడత్రిజ గోత్రజుడాదిశాఖ కం

చెర్ల కులోద్బవుండనప్రసిద్ధుడనై భవదంకితంబుగా

నెల్లకవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ

ద్వల్లభ నీకు దాసుడను దాశరథీ కరుణాపయోనిధీ!


Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics