దాశరథీ శతకం రెండవ భాగం dasaradhi satakam part two

దాశరథీ శతకం రెండవ భాగం


041
కుక్షినజాండపం క్తులొన గూర్చి చరాచరజంతుకోటి సం

రక్షణసేయు తండ్రివి పరంపర నీ తనయుండనైన నా

పక్షము నీవుగావలదె పాపము లెన్ని యొనర్చినన్ జగ

ద్రక్షక కర్తవీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: కడుపులో బ్రహ్మాండముల నుంచుకొని చేతనా చేతన జంతువుల బాలించు నీవే నాకు దిక్కు. పాపములెన్ని చేసినను రక్షించు వాడవు నీవే సుమా!

042
గద్దరి యోగి హృత్కమల గంధర సానుభవంబుఁజెందు పె

న్నిద్దవు గండుఁ దేఁటి థరణీసుత కౌఁగిలిపంజరంబునన్

ముద్దులుగుల్కు రాచిలుక ముక్తినిధానమురామరాఁగదే

తద్దయు నేఁడు నాకడకు దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: మహాత్ముల హృదయ పద్మములనుండు మకరందమును గ్రోలుదుమ్మెదవంటివాడవు, ముక్తికి నిక్షేపమువంటివాడవు నైన, రామ! నేడు దయతో నా కడకు రమ్ము.

043
కలియుగ మర్త్యకోటినిను గన్గొన రానివిధంబో భక్తవ

త్సలతవహింపవో చటుల సాంద్రవిపద్దశ వార్ధి గ్రుంకుచో

బిలిచిన బల్క వింతమఱపే నరులిట్లనరాదు గాక నీ

తలపున లేదె సీత చెఱ దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: ఈ కలియుగములోని మనుష్యులు నిన్ను గనలేకున్నారో లేక నీకు భక్తులపై దయలేదో యెఱుంగను. మిక్కిలి విశేషమైన యాపద లను సముద్రములో బడుచు బిలిచినను బలుకకున్నావు. మే మిట్లనగూడదు, సీత పడిన బాధ నప్పుడే మఱచితివా? (మమ్ములను మఱువకు మనుట.)

044
జనవర మీ కథాళి వినసైఁపక కర్ణములందు ఘంటికా

నినద వినోదముల్ సులుపునీచునకున్ వరమిచ్చినావు ని

న్ననయమునమ్మి కొల్చిన మహాత్మునకేమి యొసంగెదో సనం

దననుత మాకొసంగుమయ దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: నీ కధలు చెవులతో విన నిష్టపడక గంటలమ్రోఁతల నానందపడు ఘంటాకర్ణాదులకు వరము లిచ్చితివి. నిన్నెప్పుడుఁ గొల్చువారి కే మోసంగితివి. మాకు మోక్ష మిమ్ము.

045
పాపము లొందువేళ రణపన్నగ భూత భయజ్వారాదులన్

దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్

బ్రాపుగ నీవుదమ్ము డిరుపక్కియలన్ జని తద్విపత్తి సం

తాపము మాన్పి కాతురట దాశరథీ కరుణాపయోనిధి!



046
అగణిత జన్మకర్మదురి తాంబుధిలో బహుదుఃఖవీచికల్

దెగిపడ నీదలేక జగతీధర నీపదభక్తి నావచే

దగిలి తరింపగోరితి బదంపబడి నదు భయంభు మాన్పవే

తగదని చిత్తమం దిడక దాశరథీ కరుణాపయోనిధీ!



047
నేనొనరించు పాపముల నేకములైనను నాదుజిహ్వకుం

బానకమయ్యెమీపరమ పావననామముదొంటి చిల్కరా

మాననుగావుమన్న తుది మాటకు సద్గతి జెందెగావునన్

దాని ధరింపగోరెదను దాశరథీ కరుణాపయోనిధీ.



048
పరధనముల్ హరించి పరభామలనం5టి పరాన్న మబ్బినన్

మురిపమ కానిమీఁదనగు మోసమెఱుంగదు మానసంబు, దు

స్తర మిదికాలకింకర గదాహతి పాల్పడనీక మమ్ము నే

తఱి దిరజేర్చి కాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ.



049
చేసితి ఘోరకృత్యములు చేసితి భాగవతాపచారముల్

చేసితి నన్యదైవములఁ జేరి భజించిన వారిపొందు నేఁ

జేసిన నేరముల్ దలఁచి చిక్కులఁబెట్టకుమయ్యయయ్య నీ

దాసుఁడనయ్య భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.


050
పరుల ధనంబుఁజూచిపర భామలజూచి హరింపగోరు మ

ద్గురుతరమానసం బనెడు దొంగనుబట్టినిరూఢదాస్య వి

స్ఫురితవివేక పాశములఁ జుట్టి భవచ్చరణంబనే మరు

త్తరువునగట్టివేయగ దె దాశరథీ కరుణాపయోనిధీ.


051
సలలిత రామనామ జపసార మెఱుంగను గాశికాపురీ

నిలయుడగానుమీచరణ నీరజరేణు మహాప్రభావముం

దెలియనహల్యగాను జగతీవర నీదగు సత్యవాక్యముం

దలపగ రావణాసురుని తమ్ముడగాను భవద్విలాసముల్

దలచినుతింప నాతరమె దాశరథీ కరుణాపయోనిధీ.


052
పాతకులైన మీకృపకు బాత్రులు కారెతలంచిచూడ జ

ట్రాతికిగల్గె భావన మరాతికి రాజ్యసుఖంబుగల్గె దు

ర్జాతికి బుణ్యమబ్బెగపి జాతిమహత్త్వమునొందెగావునం

దాతవ యెట్టివారలకు దాశరథీ కరుణాపయోనిధీ.


053
మామక పాతక వజ్రము మ్రాన్పనగణ్యము చిత్రగుప్తు లే

యేమని వ్రాతురో? శమనుడేమి విధించునొ? కాలకింకర

స్తోమ మొనర్చిటేమొ? వినజొప్పడ దింతకమున్నె దీన చిం

తామణి యొట్లు గాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ!


054
దీక్షవహించి నాకొలది దీనుల నెందఱి గాచితో జగ

ద్రక్షక తొల్లియా ద్రుపద రాజతనూజ తలంచినంతనే

యక్షయమైన వల్వలిడి తక్కట నామొఱజిత్తగించి

ప్రత్యక్షము గావవేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ.


055
నీలఘనాభమూర్తివగు నిన్ను గనుంగొనికోరి వేడినన్

జాలముసేసి డాగెదవు సంస్తుతి కెక్కిన రామనామ మే

మూలను దాచుకోగలవు ముక్తికి బ్రాపది పాపమూలకు

ద్దాలముగాదె మాయెడల దాశరథీ కరుణాపయోనిధీ.


056
వలదు పరాకు భక్తజనవత్సల నీ చరితంబు వమ్ముగా

వలదు పరాకు నీబిరుదు వజ్రమువంటిది గాన కూరకే

వలదు పరాకు నాదురిత వార్ధికి దెప్పవుగా మనంబులో

దలతుమెకా నిరంతరము దాశరథీ కరునాపయోనిధీ.



057
తప్పులెఱుంగ లేక దురితంబులు సేసితినంటి నీవుమా

యప్పవుగావు మంటి నికనన్యులకున్ నుదురంటనంటినీ

కొప్పిదమైన దాసజను లొప్పిన బంటుకు బటవంటి నా

తప్పుల కెల్ల నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ.


058
ఇతడు దురాత్ముడంచుజను లెన్నఁగ నాఱడిఁగొంటినేనెపో

పతితుఁడ నంటినో పతిత పావనమూర్తివి నీవుగల్ల నే

నితరుల వేఁడనంటి నిహ మిచ్చిననిమ్ముపరంబొసంగుమీ

యతులిత రామనామ మధు రాక్షర పాళినిరంతరంబు హృ

ద్గతమని నమ్మికొల్చెదను దాశరథీ కరుణాపయోనిధీ.


059
అంచితమైననీదు కరుణామృతసారము నాదుపైని బ్రో

క్షించిన జాలు; దాన నిర సించెదనాదురితంబు లెల్లదూ

లించెద వైరివర్గ మెడలించెద గోర్కుల నీదుబంటనై

దంచెద, గాలకింకరుల దాశరథీ కరుణాపయోనిధీ.


060
జలనిధు లేడునొక్క మొగిఁ జక్కికి దెచ్చె శరంబు, ఱాతినిం

పలరఁగ జేసెనాతిగఁ బదాబ్జ పరాగము, నీ చరిత్రముం

జలజభవాది నిర్జరులు సన్నుతి సేయఁగ లేరు గావునం

దలప నగణ్య మయ్య యిది దాశరథీ కరుణాపయోనిధీ.


061
కోతికిశక్యమా యసురకోటుల గెల్వను గాల్చెబో నిజం

బాతనిమేన శీతకరుడౌట దవానలు డెట్టివింత? మా

సీతపతివ్రతా మహిమ సేవకు భాగ్యము మీ కటాక్షమున్

ధాతకు శక్యమా పొగడ దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: రాక్షసులను గెలవటం కోతికి(హనుమంతునికి) సాధ్యమా? అగ్నిదేవుడు హనుమ వంటికి చల్లదనం చేకూర్చుట ఎంత వింత? యిది అంతయు పతివ్రత అయిన సీతమ్మ తల్లిని సేవించి హనుమ పొందిన కటాక్ష భాగ్యము వలన సాధ్యమైనది, అట్టి సీతమ్మను పొగడ బ్రహ్మకు కూడా శక్యము కాదయ్య ఓ కరుణ అనె నీటితో నిండిన సముద్రమంతటి వాడా, దశరధుని కుమారుడా (ఓ రామా).

062
భూపలలామ రామరఘుపుంగవరామ త్రిలోక రాజ్య సం

స్ధాపనరామ మోక్షఫల దాయక రామ మదీయ పాపముల్

పాపగదయ్యరామ నిను బ్రస్తుతి చేసెదనయ్యరామ సీ

తాపతిరామ భద్రగిరి దాసరథీ కరుణాపయోనిధీ.


063
నీసహజంబు సాత్వికము నీవిడిపట్టు సుధాపయోధి, ప

ద్మాసనుడాత్మజుండు, గమలాలయనీ ప్రియురాలు నీకు సిం

హాసనమిద్ధరిత్రి; గొడుగాక సమక్షులు చంద్రభాస్కరుల్

నీ సుమ తల్ప మాదిఫణి నీవె సమస్తము గొల్చినట్టి నీ

దాసుల భాగ్యమెట్టిదయ దాశరథీ కరుణాపయోనిధీ.


064
చరణము సోకినట్టి శిలజవ్వనిరూపగు టొక్కవింత, సు

స్ధిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ

స్మరణ దనర్చుమానవులు సద్గతి జెందిన దెంతవింత? యీ

ధరను ధరాత్మజారమణ దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: నీ పాద స్పర్శ మాత్రమున శిల స్త్రీ రూపు దాల్చి అహల్య అయినది. శిలా పర్వతములు సముద్రముపై స్టిరముగ తేలినవె. ఇట్టి వింతలు జరుగగా నీ స్మరణ చేయు భక్తులు మోక్ష్మము పొందట వింత ఏమియుగాదు.

065
దైవము తల్లిదండ్రితగు దాత గురుండు సఖుండు నిన్నె కా

భావన సేయుచున్నతఱి పాపములెల్ల మనోవికార దు

ర్భావితుజేయుచున్నవికృపామతివైనను కావుమీ జగ

త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.



066
వాసవ రాజ్యభోగ సుఖ వార్ధిని దేలు ప్రభుత్వమబ్బినా

యాసకుమేర లేదు కనకాద్రిసమాన ధనంబుగూర్చినం

గాసును వెంటరాదు కని కానక చేసిన పుణ్యపాపముల్

వీసరబోవ నీవు పదివేలకు జాలు భవంబునొల్ల నీ

దాసునిగాగ నేలుకొను దాశరథీ కరుణాపయోనిధీ.

067
సూరిజనుల్ దయాపరులు సూనృతవాదు లలుబ్ధమానవుల్

వేరపతిప్రతాంగనలు విప్రులు గోవులు వేదముల్ మహా

భారముదాల్పగా జనులు పావనమైన పరోపకార స

త్కార మెఱుంగులే రకట దాశరథీ కరుణాపయోనిధీ!



068
వారిచరావతారము వారిధిలో జొఱబాఱి క్రోధ వి

స్తారగుడైన యా నిగమతస్కరవీర నిశాచరేంద్రునిం

జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికి మహో

దారతనిచ్చితీవెగద దాశరథీ కరుణాపయోనిధీ.



069
కరమనుర క్తిమందరము గవ్వముగా నహిరాజుద్రాడుగా

దొరకొన దేవదానవులు దుగ్ధపయోధిమథించుచున్నచో

ధరణిచలింపలోకములు తల్లడమందగ గూర్మమై ధరా

ధరము ధరించితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.

070
ధారుణి జాపజుట్టిన విధంబునగైకొని హేమనేత్రుడ

వ్వారిధిలోనదాగినను వానివధించి వరాహమూర్తివై

ధారుణిదొంటికై వడిని దక్షిణశృంగమునన్ ధరించి వి

స్తార మొనర్చితీవే కద దాశరథీ కరుణాపయోనిధీ.


071
పెటపెట నుక్కు కంబమున భీకరదంత నఖాంతర ప్రభా

పటలము గప్ప నుప్పతిలి భండనవీధి నృసింహ భీకర

స్ఫుటపటు శక్తి హేమకశిపున్ విదళించి సురారిపట్టి నం

తట గృప జూచి తీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.


072
పదయుగళంబు భూగగన భాగములన్ వెసనూని విక్రమా

స్పద మగు నబ్బలీంద్రు నొక పాదమునందల క్రిందనొత్తి మే

లొదవ జగత్త్రయంబు బురు హూతునికియ్య వటుండవైన చి

త్సదమలమూర్తి వీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.


073
ఇరువదియొక్కమాఱు ధరణీశుల నెల్ల వధించి తత్కళే

బర రుధిర ప్రవాహమున బైతృకతర్పణ మొప్పజేసి భూ

సురవర కోటికిన్ ముదము సొప్పడ భార్గవరామమూర్తివై

ధరణి నొసంగి తీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.

074
దురమున దాటకందునిమి ధూర్జటివిల్ దునుమాడిసీతనుం

బరిణయమంది తండ్రిపనుపన్ ఘన కాననభూమి కేగి దు

స్తరపటుచండ కాండకులిశాహతి రావణకుంభకర్ణ భూ

ధరముల గూల్చి తీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.


075
అనుపమ యాదవాన్వయ సుధాబ్ధి సుధానిధి కృష్ణమూర్తి నీ

కనుజుడుగా జనించి కుజనావళి నెల్ల నడంచి రోహిణీ

తనయుడనంగ బాహుబల దర్పమునన్ బలరామ మూర్తివై

తనరిన వేల్ప వీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.


076
సురలు నుతింపగా ద్రిపుర సుందరులన్ వరియింప బుద్ధ రూ

పరయగ దాల్చితీవు త్రిపురాసురకోటి దహించునప్పుడా

హరునకు దోడుగా వర శరాసన బాణ ముఖోగ్రసాధనో

త్కర మొనరించితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ.


077
సంకరదుర్గమై దురిత సంకులమైన జగంబుజూచి స

ర్వంకషలీల ను త్తమ తురంగమునెక్కి కరాసిబూని వీ

రాంకవిలాస మొప్ప గలి కాకృత సజ్జనకోటికి నిరా

తంక మొనర్చితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ.


078
మనమున నూహపోషణలు మర్వకమున్నె కఫాది రోగముల్

దనువుననంటి మేనిబిగి దప్పకమున్నె నరుండు మోక్ష సా

ధన మొనరింపఁగావలయుఁ దత్త్వవిచారము మానియుండుట

ల్తనువునకున్ విరోధమిది దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:"దశరథరామా! మనస్సునకు ఆలోచించే శక్తి నశించడానికి పూర్వమే, శ్లేష్మ కఫాది వ్యాధులు దేహములో వ్యాపించి దాని బలమును హరించడానికి ముందే, మనుష్యుడు పరమాత్మను గురించి విచారము చేసి, మోక్షసాధనకు తగిన ఉపాయములను అన్వేషించవలెను. తర్వాత ఇటువంటి ప్రయత్నం చేయుట సాధ్యం కాదు" అంటున్నాడు రామదాసు.

079
ముదమున కాటపట్టుభవ మోహమద్వ దిరదాంకుశంబు సం

పదల కొటారు కోరికల పంట పరంబున కాది వైరుల

న్నదల జయించుత్రోవ విపదబ్ధికినావగదా సదాభవ

త్సదమలనామసంస్మరణ దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:"దశరథరామా! మనస్సునకు ఆలోచించే శక్తి నశించడానికి పూర్వమే, శ్లేష్మ కఫాది వ్యాధులు దేహములో వ్యాపించి దాని బలమును హరించడానికి ముందే, మనుష్యుడు పరమాత్మను గురించి విచారము చేసి, మోక్షసాధనకు తగిన ఉపాయములను అన్వేషించవలెను. తర్వాత ఇటువంటి ప్రయత్నం చేయుట సాధ్యం కాదు" అంటున్నాడు రామదాసు.





Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics