జ్ఞాన కర్మ సన్యాస యోగం తాత్పర్యం తో jnana yogam with Telugu lyrics and meaning

అథ చతుర్థోऽధ్యాయః - జ్ఞానకర్మసంన్యాసయోగః

జ్ఞాన యోగం తాత్పర్యం తో jnana yogam with Telugu lyrics and meaning

శ్రీభగవానువాచ|
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్|
వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేऽబ్రవీత్|| 4-1 ||

శ్రీ కృష్ణభగవానుడు పలికినది:- అవ్యయమైన ఈ కర్మయోగాన్ని నేను సూర్యుడికి భోదించాను.సూర్యుడు మనువుకి చెప్పాడు.మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు

ఏవం పరమ్పరాప్రాప్తమిమం రాజర్షయో విదుః|
స కాలేనేహ మహతా యోగో నష్టః పరన్తప|| 4-2 ||

ఇలా పరంపరగా ప్రాప్తమైన కర్మయోగాన్ని రాజర్షులుఎరుగుదురు.ఓ పరంతపా కాలగతిలో ఈ గొప్పయోగం ఈ లోకంలో నశించి పోయింది

స ఏవాయం మయా తేऽద్య యోగః ప్రోక్తః పురాతనః|
భక్తోऽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్|| 4-3 ||

ఆ సనాతనమైన యోగాన్నే నా భక్తుడవు,స్నేహితుడవు ఐన నీకు భోధించాను.ఇది ఉత్తమమైనదీ రహస్యమైనదీ కూడా.

అర్జున ఉవాచ|
అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః|
కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి|| 4-4 ||

అర్జునుడు ఇలా అడిగాడు:- నీ జన్మ ఇటీవలది.సూర్యుని జన్మ ఎంతో ముందున్నది.నీవు సూర్యునికి ఉపదేశించావని అన్నావు.దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి?

శ్రీభగవానువాచ|
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున|
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరన్తప|| 4-5 ||

శ్రీ కృష్ణభగవానుడు ఇలా పలికాడు:- అర్జునా! నాకూ నీకూ కూడా ఎన్నో జన్మలు గడిచిపోయాయి.నేను వాటన్నిటిని ఎరుగుదును.నీవు ఎరుగవు

అజోऽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోऽపి సన్|
ప్రకృతిం స్వామధిష్ఠాయ సమ్భవామ్యాత్మమాయయా|| 4-6 ||

జన్మ లేనివాడినీ,అవ్యయుడినీ,జీవులందరికి అధిపతినైనా,నాప్రకృతిని అధిరోహించి నామాయవలన జన్మిస్తుంటాను.

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత|
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్|| 4-7 ||

అర్జునా! ఎప్పుడు ధర్మము క్షీణించి అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను.

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్|
ధర్మసంస్థాపనార్థాయ సమ్భవామి యుగే యుగే|| 4-8 ||

సాధువులను రక్షించడానికి,దుష్టులను నాశనం చేయడానికీ,ధర్మాన్ని నెలకొల్పడానికి యుగ యుగంలోను నేను జన్మిస్తాను.

జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్త్వతః|
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోऽర్జున|| 4-9 ||

అర్జునా! దివ్యమైన నా జన్మ కర్మల తత్వాన్ని ఎవరు యధార్ధంగా తెలుసుకుంటారో,అతడు ఈ శరీరాన్ని వదలిన తరవాత తిరిగి పుట్టడు.

వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః|
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః|| 4-10 ||

రాగ భయ క్రోధాలను విడిచి నన్ను గురించిన ఆలోచనలతో నిండి నన్ను ఆశ్రయించిన వారు ఎందరో జ్ఞానతపస్సు వలన నన్ను అందుకున్నారు

యే యథా మాం ప్రపద్యన్తే తాంస్తథైవ భజామ్యహమ్|
మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః|| 4-11 ||

అర్జునా నన్ను ఎవరు ఎలా కొలిస్తే నేను వారిని అలాగే అనుగ్రహిస్తాను.మనుష్యులెప్పుడూ నాజాడలోనే సంచరిస్తారు.

కాఙ్క్షన్తః కర్మణాం సిద్ధిం యజన్త ఇహ దేవతాః|
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా|| 4-12 ||

కర్మల ఫలితాన్ని కోరుకునే వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు,మానవ లోకంలో కర్మల వలన కలిగే ఫలం త్వరగా లభిస్తుంది కదా!

చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః|
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్|| 4-13 ||

నాలుగు విదాలైన వర్ణాలు గుణ కర్మల విభజనలను అనుసరించి నా వలన సృష్టించ బడ్డాయి.వాటిని సృష్టించిన వాడినైనా,నేను కర్తను కాననీ,మార్పులేని వాడిననీ తెలుసుకో.

న మాం కర్మాణి లిమ్పన్తి న మే కర్మఫలే స్పృహా|
ఇతి మాం యోऽభిజానాతి కర్మభిర్న స బధ్యతే|| 4-14 ||

నన్ను కర్మలంటవనీ నాకు కర్మ ఫలంలో కోరిక లేదనీ ఎరిగినవాడు కర్మలచేత కట్టుబడడు.

ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః|
కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్|| 4-15 ||

ఇది తెలుసుకొనియే పూర్వం ముముక్షువుల చేత కర్మ చేయబడినది.అందువలన పూర్వీకుల చేత పూర్వం చేయబడినట్లే నీవు కూడా నిష్కామ కర్మనే చేయి.

కిం కర్మ కిమకర్మేతి కవయోऽప్యత్ర మోహితాః|
తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్జ్ఞాత్వా మోక్ష్యసేऽశుభాత్|| 4-16 ||

కర్మ ఏది అకర్మ ఏది అనే విషయంలో ఋషులు సైతం భ్రాంతిలో పడతారు.దేనిని తెలుసుకుంటే నీవు అశుభం నుండి విముక్తి పొందుతావో ఆ కర్మ విషయం నీకు చెబుతాను.

కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః|
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః|| 4-17 ||

కర్మల గురించి తెలుసుకోవాలి.వికర్మల అకర్మల గురించి కూడా తెలుసుకోవాలి.కర్మల యొక్క స్వభావం చాలా నిగూఢమైనది.

కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః|
స బుద్ధిమాన్మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్|| 4-18 ||

కర్మలో అకర్మనీ అకర్మలో కర్మనీ ఎవరు దర్శిస్తారో అతడు మనుష్యులలో అందరికంటే బుద్ధిమంతుడు.అతడే యోగి యావత్తు కర్మని పూర్తిగా చేసిన వాడవుతాడు

యస్య సర్వే సమారమ్భాః కామసఙ్కల్పవర్జితాః|
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పణ్డితం బుధాః|| 4-19 ||

ఎవరు కామసంకల్పం లేకుండా అన్ని కర్మలను చక్కగా ప్రారంభిస్తారో,జ్ఞానాగ్నిలో కర్మలన్నిటినీ కాల్చివేసిన అతణ్ణి వివేకి అని విద్వాంసులంటారు.

త్యక్త్వా కర్మఫలాసఙ్గం నిత్యతృప్తో నిరాశ్రయః|
కర్మణ్యభిప్రవృత్తోऽపి నైవ కిఞ్చిత్కరోతి సః|| 4-20 ||

కర్మ ఫలంతో సంగాన్ని వదిలి నిత్యతృప్తుడై దేనిమీద ఆధారపడని వాడై,కర్మలలో నిమగ్నుడై ఉండేవాడు ఏకర్మనీ చేయని వాడే అవుతాడు.

నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః|
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్|| 4-21 ||

ఆశలేక,మనశరీరాలను నిగ్రహించి,అన్నిటియందు పరిగ్రహ భావాన్ని వదిలి,కేవలం శరీరంతో కర్మ చేసేవాడు ఏ పాపాన్నీ పొందడు.

యదృచ్ఛాలాభసన్తుష్టో ద్వన్ద్వాతీతో విమత్సరః|
సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే|| 4-22 ||

యాదృచ్చికంగా లభించిన దానితో సంతృప్తుడై,ద్వందాలకు అతీతుడై,మాత్సర్యం లేకుండా,ఫలం లభించినపుడు కూడా సమంగా ఉండేవాడు కర్మ చేసినా బద్ధుడు కాడు.

గతసఙ్గస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః|
యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే|| 4-23 ||

సంగభావం పోయి ముక్తుడై,జ్ఞానంలో నిలిచిన మనస్సుతో యజ్ఞం కోసం ఆచరించే వాని కర్మ పూర్తిగా నశిస్తుంది.

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్|
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా|| 4-24 ||

కర్మనే బ్రహ్మమని స్థిరంగా భావించే వారకి బ్రహ్మమే హవిస్సు,బ్రహ్మమనే అగ్నిలో బ్రహ్మం చేత అర్పించ బడుతుంది.అతనిచే అందుకో బడిన గమ్యం కూడా బ్రహ్మమే

దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే|
బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి|| 4-25 ||

కొందరు యోగులు దైవ యజ్ఞాన్నే చక్కగా చేస్తారు.కొందరు బ్రహ్మమనే అగ్నిలో యజ్ఞం ద్వారా యజ్ఞాన్ని (తనలోని జీవభావాన్ని)అర్పిస్తారు.

శ్రోత్రాదీనీన్ద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి|
శబ్దాదీన్విషయానన్య ఇన్ద్రియాగ్నిషు జుహ్వతి|| 4-26 ||

శ్రవణం మొదలైన ఇంద్రియాలను కొందరూ నిగ్రహమనే అగ్నిలో వేల్చుతారు.మరి కొందరు ఇంద్రియము అనే అగ్నిలో శబ్ధాది విషయాలను వేల్చుతారు.

సర్వాణీన్ద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే|
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే|| 4-27 ||

మరికొందరు జ్ఞానేంద్రియ,కర్మేంద్రియ కర్మలన్నింటిని జ్ఞానంతో వెలిగింపబడిన మనస్సంయమనమనే అగ్నిలో వేల్చుతారు.

ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే|
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః|| 4-28 ||

మరికొందరు కఠినమైన నియమాలతో ప్రయత్నం చేస్తూ ద్రవ్య,తపో,యోగ,స్వాధాయ,జ్ఞాన యజ్ఞాలుగా కలిగి ఉన్నారు.

అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేऽపానం తథాపరే|
ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామపరాయణాః|| 4-29 ||

అలాగే ప్రాణాయామ పరాయణులైన మరి కొందరు ఉచ్వాస నిచ్వాసములను నిరోధించి ఆపానానికి ప్రాణాన్ని ప్రాణాన్ని ఆపానానికి ఆహుతులుగా అర్పిస్తారు.

అపరే నియతాహారాః ప్రాణాన్ప్రాణేషు జుహ్వతి|
సర్వేऽప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః|| 4-30 ||

మరికొందరు నియమితమైన ఆహారాన్ని స్వీకరిస్తూ,ప్రాణాన్ని ప్రాణానికి ఆహుతులుగా అర్పిస్తారు.వీరందరూ యజ్ఞానాలను ఎరిగినవారే.యజ్ఞం వలన కల్మషాలను హరింప చేసుకుంటారు.

యజ్ఞశిష్టామృతభుజో యాన్తి బ్రహ్మ సనాతనమ్|
నాయం లోకోऽస్త్యయజ్ఞస్య కుతోऽన్యః కురుసత్తమ|| 4-31 ||

అర్జునా! యజ్ఞములో సమర్పించగా మిగిలిన ఆహారం అమృతము.యజ్ఞము చేయని వారికి ఈ లోకమేలేదు,పరలోకమెక్కడ?

ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే|
కర్మజాన్విద్ధి తాన్సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే|| 4-32 ||

ఈ విధంగా అనేక విధాల యజ్ఞాలు వేదాలలో విస్తరించబడి ఉన్నాయి.అవి అన్నీ కర్మల వలన జనిస్తాయని తెలుసుకో.ఇలా తెలుసుకుంటే విముక్తుడవు అవుతావు.

శ్రేయాన్ద్రవ్యమయాద్యజ్ఞాజ్జ్ఞానయజ్ఞః పరన్తప|
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే|| 4-33 ||

అర్జునా! పరంతపా! ద్రవ్యంతో చేసేయజ్ఞంకంటే జ్ఞాన యజ్ఞం శ్రేష్టమైనది.అన్ని రకాల కర్మలూ జ్ఞానంలో లీనమౌతాయి.

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా|
ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః|| 4-34 ||

జ్ఞానాన్ని ఆత్మార్పణభావం,సేవ,ప్రశ్నించడం ద్వారా తెలుసుకో,జ్ఞానులు,తత్వవేత్తలూ ఐనవారు నీకు ఉపదేశిస్తారు.

యజ్జ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాణ్డవ|
యేన భూతాన్యశేషాణి ద్రక్ష్యస్యాత్మన్యథో మయి|| 4-35 ||

అర్జునా! దేనిని పొందాక తిరిగి ఇలా మోహంలో పడవో దేనిచేత అశేషమైన జీవరాశుల్ని నీలోను,నాలోను చూడగలుగుతావో ఆ జ్ఞానాన్ని పొందు.

అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః|
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సన్తరిష్యసి|| 4-36 ||

పాపులందరిలోకి ఎక్కువ పాపం చేసిన వాడివైనా పాపాన్నంతటినీ జ్ఞానమనే పడవతో దాటగలవు.

యథైధాంసి సమిద్ధోऽగ్నిర్భస్మసాత్కురుతేऽర్జున|
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా|| 4-37 ||

అర్జునా జ్వలించే అగ్ని కట్టెలను కాల్చినట్లుగా,జ్ఞానమనే అగ్ని కర్మలను కాచివేస్తుంది.

న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే|
తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విన్దతి|| 4-38 ||

జ్ఞానంలాగ పవిత్రమైనది ఇంకొకటి లేదు.యోగ సంసిద్దిని పొందినవాడు దానిని కాలక్రమేణా తనలోనే పొందుతాడు.

శ్రద్ధావాఁల్లభతే జ్ఞానం తత్పరః సంయతేన్ద్రియః|
జ్ఞానం లబ్ధ్వా పరాం శాన్తిమచిరేణాధిగచ్ఛతి|| 4-39 ||

శ్రద్ధతో కూడిన ఇంద్రియ నిగ్రహాన్ని కలిగివుండి,జ్ఞానానుభవాన్ని లక్ష్యంగా పెట్టుకున్న సాధకుడు ఈ అనుభవాన్ని పొందుతాడు.జ్ఞానానుభవాన్ని పొంది త్వరలోనే పరమైన శాంతిని పొందుతాడు.

అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి|
నాయం లోకోऽస్తి న పరో న సుఖం సంశయాత్మనః|| 4-40 ||

జ్ఞానం,శ్రద్ధలేని సంశయాత్ముడు నశించిపోతాడు.సంశయంలో పడ్డవాడికి ఈ లోకంలేదు పరలోకమూ లేదు.సుఖం కూడా లేదు.

యోగసంన్యస్తకర్మాణం జ్ఞానసఞ్ఛిన్నసంశయమ్|
ఆత్మవన్తం న కర్మాణి నిబధ్నన్తి ధనఞ్జయ|| 4-41 ||

అర్జునా యోగం వలన కర్మలను వదిలించుకొని,జ్ఞానం వలన సంశయాలను నివృత్తి చేసుకున్న ఆత్మ నిస్టుడిని కర్మలు బంధించలేవు.

తస్మాదజ్ఞానసమ్భూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః|
ఛిత్త్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత|| 4-42 ||

అందుచేత అజ్ఞానం వలన జనించి నీహృదయంలో ఉన్న సంశయాన్ని ఆత్మజ్ఞానమనే ఖడ్గంతో ఛేదించి,యోగాన్ని అవలంబించు.అర్జునా! లేచి నిలబడు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
జ్ఞానకర్మసంన్యాసయోగో నామ చతుర్థోऽధ్యాయః|| 4 ||




Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics