కుమారీ శతకం రెండవ భాగం kumaree satakam part two
కుమారీ శతకం రెండవ భాగం
51. బంతులను బక్షపాత మొ
కింతైనను జేయరాదు హీన దశుల సా
మంతుల నొక భంగి నిరీ
క్షింతురు బుధులెల్ల సంత సిల్లం గుమారీ!
ఓ సుగుణవతి! వడ్డనయందు పక్షపాతము ఛూపరాదు.(అందరినీ సమానంగా చూడాలి) భాగ్యవంతులు, పండితులు, ఎల్లరు సంతోషించునట్లు ఒకే విధముగా మసలుకొనుము.
52. మాసిన తల మాసిన యిల్లు
మాసిన వలువలు దరిద్ర మార్గంబులు నెం
తేసి ధనవంతులైనను
గాసిల్లుదు రల్పదశల గ్రాంగి కుమారీ!
ఓ చినదానా! మాసిన ఇల్లు, మాసిన గుడ్డలు, మాసిన తల దరిద్రమునకు కారణములని తెలుసుకో! ఎంతటి ధనవంతుల వారైనను నీచముగా బ్రతికినచో కష్టనష్టములు బొందుదురు.
53. సన్నెకలుం బొత్రమ్మును
తన్నుకపోరాదు కాలఁ దగిలిన యెడలన్
గన్నుల నద్దుకొన న్వలె
గ్రన్నన సిరి యందు నిలుచు గాదె కుమారీ!
ఓ చినదానా! సన్నెకల్లును , రోకళ్ళు పొత్రములను, ఆకులును కాలికి తగిలినచో తన్నుకుంటూ పోరాదు. అవి లక్ష్మీవాసములు కావున వాటిని కన్నుకద్దుకుని ప్రక్కన పెట్టాలి.
54. దీపము వెలిగింత చెడిచోఁ
జీపురుపుడ కుంచవలయుఁ జేతుల నేతం
బాపము పాలౌదువు మది
లోపల నిది తలఁపవలయు రూఢిం గుమారీ!
ఓ సుకుమారీ! దీపమును వెలిగించునపుడు చీపురుపుల్లను ఉపయోగింపుము. చేతులతో వెలిగించినచో ఎంత నూనె చేతికి అంటుకున్నదో అంత పాపమును మూట కట్టుకుంటావు. ఈ సంగతి మనస్సులో నుంచుకొని మసలుకొనుము
55. సరకులయెడ జాగ్రత్తయుఁ
జుఱుకు పనులయందు భక్తి సుజనులయందున్
గరుణ యనాధుల యెడలం
దరుణికిఁ జెలువారవలయు ధరణిఁ గుమారీ!
ఓ సుకుమారీ! వస్తువులయందు జాగ్రత్త వహింపుము. పనులలో చురుకుదనము వహింపుము. మంచివారిని ఆదరించు. వారియెడల భక్తిభావముతో నుండవలెను. దిక్కులేనివారికి నీవే దిక్కువై మసలుకొనుము.
56. చెప్పినఁ జెప్పక యుండినఁ
దప్పక సేయంగవలయుఁ దనపనులెల్లన్
మెప్పొదవఁగాను లేదా
ముప్పొదవును గాదె యెందు ముద్దు కుమారీ!
ఓ సుకుమారీ! చేయవలసిన పనులను చెప్పినను, చెప్పకపోయిననూ పరిశుభ్రముగా జనులు మెచ్చుకొనునట్లు చేయుమమ్మా. అట్లు నడుచుకొనకపోతే నష్టము వాటిల్లును.
57. ఎంగిలి పరులకుఁ బెట్టకు
క్రంగున మ్రోయంగనీకు కాల్మెట్టియలన్
బంగరు లాభముండిన
దొంగతనము సేయబుద్ధి దొలఁచు కుమారీ!
ఓ కుమారీ! ఇతరులకు ఎంగిలి పెట్టరాదు. నీ కాలి మట్టెలు కంగుమని శబ్దము వచ్చునట్లు చరించరాదు. బంగారము దొరుకుతున్నను దొంగతనము చేయరాదు.అటువంటి బుద్ధి మానుకొనుము.
58. ఆపదల కోర్చి సంపద
లాపయి భోగించు ననెడి హర్షోక్తుల నీ
లోపల దలచుచు లాంతరు
దీపము చందమున వెలుఁగ దివురు కుమారీ!
ఓ సుకుమారీ! కష్టసుఖాలన్నారుగాని సుఖకష్టాలనలేదమ్మా! కావున మొదట కష్టాములనుభవించిన తర్వాతే సుఖము, ఐశ్వర్యము ప్రాప్తించునని తెలియుము. లాంతరు దీపము మాదిరిగా ప్రకాశింపుము. (లాంతరు తనలోని నూనెను ఖర్చు చేస్తూ లోకానికి అంతటికి వెలుగును ప్రసాదించుటలేదా?) అట్లే నీవు గూడ మసలుకొని మహిలో మహోన్నతురాలివై మసలుకొనుమమ్మా!
59. తనకడుపు కట్టుకొని యై
నను జుట్టమ్మునకు బెట్టి నను గీర్తి వహిం
చును భుక్తి ముక్లులబ్బును
దన కెవ్వరు సాటిరారు ధరణి గుమారీ!
ఓ సుకుమారీ! తను పస్తులున్నను ( తను తినకుండా ఉండుట) బంధువులకు పెట్టవలెను. అపుడే నీకు కీర్తి కలుగును .భోగమోక్షములు సిద్ధించును. అట్లు చేసిన యెడల నీకెవ్వరును సరిరారు.
60. వడి దనిపించుకొనుటకున్
గడె యైనను బట్టకుండుఁ గాంతలలో నె
క్కుడు గుణవతి యనిపించెడి
నడవడి నేర్చుటయె కడు ఘనంబు కుమారీ!
ఓ సుకుమారీ! శౌర్యవంతురాలనిపించు కొనుటకు నిమిషమైనను పట్టదు. కాని సాధు సద్గుణవతి స్త్రీలలో మిక్కిలి గుణవంతురాలనెడు గుణములను అలవరుచుకొనుటయే మిక్కిలి గొప్పది.
61. చెప్పకు చేసినమేలు నొ
కప్పుడుయినఁ గాని దాని హర్షింపరుగా
గొప్పలు చెప్పిన నదియును
దప్పే యని చిత్తమందు దలఁపు కుమారీ!
ఓ సుకుమారీ! నీవు చేసిన మేలు ఎన్నడైననూ పరులకు జెప్పకు. అట్లు చెప్పిన నెవ్వరునూ సంతోషింపరు. గొప్పలు చెపుకొనుట కూడా మంచిదికదు. దానివల్ల సంపాదించిన పుణ్యము ఖర్చగును.
62. ఎంతటి యాఁకలి కలిగిన
బంతిని గూర్చుండి ముందు భక్షింపకు స
మంతులు బంధుబులును నిసు
మంతైనను జెల్ల దందు రమ్మ కుమారీ!
ఓ శీలవతీ! బంతిలో కూర్చున్నపుడు ఎంతటి ఆకలితో నున్నను ముందు తినగూడదు. అందరితో సమానముగా దినుట నలవర్చుకొనుము. పెద్దలందరూ అట్లు చేయుట తప్పని నిందింతురు. కాదని ఎదిరించి తిన్నచో మూర్ఖురాలివగుదువు.
63. అధికారము లేని పనుల
కధికారము సేయఁబోకు మందునఁ గోపం
బధికం బగు నీవారికి
బుధు లది విని హర్ష మొంద బోరు కుమారీ!
ఓ సుకుమారీ! కాని పనులలో తల దూర్చకుము. దానివలన ఎల్లరునూ నీపై కోపగింతురు. పెద్దలు కూడా సంతోషించరు సుమీ!
64. తా నమ్ముడువడి యైనం
దీనుండగు ధవుని యార్తిఁ దీర్చుగ సతికిన్
మానము చంద్రమతీ జల
జాననఁ దలపోయవలయు నాత్మ గుమారీ!
ఓ కుమారీ! మగడు భాగ్యహీనుడైనచో(డబ్బులేనివాడు) తానమ్ముడు బోయియైననూ యాతని కష్టాముల బాపుట పతివ్రతా శిరోమణుల లక్షణము. దానివలన మర్యాద గౌరవము హెచ్చును.హరిష్చంద్రుని భార్యయైన చంద్రమతి శీలమును మదినందిడుకొని మసలుకొనుము.
65. తనకంటె బేదరాండ్రం
గని యంతకుఁ దనకు మేలుగ్ గా యనవలయున్
దనకంటె భాగ్యవంతులఁ
గని గుటకలు మ్రింగ మేలు గాదె కుమారీ!
ఓ సుకుమారీ! తన కంటే క్రిందనున్నవారిని జూచి తృప్తి పడవలెనుగాని, తనకన్న ఐశ్వర్యవంతులను జూచి ఈర్ష్యపడరాదు..
66. విఱుగఁబడి నడువఁ గూడదు
పరుల నడక లెన్ని తప్పు బట్టాఁజనదు ని
ష్టురములు వచింపంగూడదు
కఱపఁగవలె మేలు మేలు గలదు కుమారీ!
ఓ సుకుమారీ! ఒద్దికగా నడవటం మంచిదిగాని, నిటారుగా మగానివలె నడుచుట మగువకు చేతు. ఇతరులను దప్పు బట్టరాదు. ఇతరూల్ మనస్సును నొప్పించే మాటలాడరాదు. మంచితనము నలవరచుకొనుము. మూర్ఖత్వమును విడనాడాలి. దీనివలన మేలు కలుగును.
67. కోపమును నప్పుడాద ని
రూపించిన మాత గొన్ని రోజులు చనినం
జూపెట్టుదు నని శాంతము
లోపలఁ గొనవలయు ధర్మ లోల కుమారీ!
ఓ కుమారీ! కోపము వచ్చినప్పుడు నిగ్రహము చూపవలెను. కోపములో అనబోవు మాట తర్వాత తెలియజెప్పుదునని మనస్సును శాంతపరచుకొనవలెను.
68. కలహపడునింట నిలువదు
కలుముల జవరాలు కానఁ గలకాలం భే
కలహములు లేక సమ్మతి
మెలఁగంగా నేర్చెనేని మేలు కుమారీ!
ఓ కుమారీ! కలహించు చోట కలిమి నిలువదు. కావున కొట్లాటలు లేని ఇంట నివశించుట శ్రేయస్కరము. ఎల్లప్పుడు ఎవరితోనూ కలహించక సామరస్యభావముతో నడచుకొనుమమ్మా కుమారీ!
69. గురుశుక్రవరముల మం
దిర గేహళులందు లక్ష్మీ తిరముగ నిలుచుం
గరగరిక నలకి మ్రుగ్గిడి
గురుభక్తి మెలంగఁ బాయు గొదువ కుమారీ!
ఓ సుకుమారీ! గురు, శుక్రవారములందు లక్ష్మీదేవీ, ఇంటి గడపలయందు స్థిరముగ నిల్చును గాన గడపల నెప్పటికప్పుడు పసుపు కుంకుమలతో అలికి ముగ్గులు పెట్టి శోభాయమానముగా నుంచుము. పెద్దలయెడ మర్యాద భక్తిభావముతో మెలగినచో ఆ ఇంట సిరిసంపదలు తులతూగుతాయి.
70. అపకీర్తి బొందుట క
ష్టపుఁబని దొక్క గడియ చాలును గీర్తిన్
నిపుణత వహింపవలయును
జపగుణములెల్లఁ బాసి చనఁగఁ గుమారీ!
ఓ కుమారీ! అపకీర్తి బొందుట కష్టము కాదు. దానికొక్క నిమిషము చాలును. కాని కీర్తిని సంపాదించవలెనన్న చెడ్డ బుద్ధులను వదలి సుగుణములతో భాసిల్ల వలెను.
71. సరకులు బట్టలు వన్నెల
కెరపులు తేదగదు తెచ్చె నేని సరకు ల
క్కఱఁ దీర్చుకొనుచు వెంటానె
మరలింపకయున్న దప్పు మాట కుమారీ!
ఓ సుకుమారీ! సరకులనుగాని, సామాగ్రినిగాని, చేబదుళ్ళుగాని, పైన వస్త్రమును కప్పి తీసుకొని రావలయును. అంతేగాని అందరకు కనబడు విధముగ దీసికొనరాగూడదు. అప్పులు చేయదగదు. అరువు సరకును ఉపయోగించిన తర్వాత మన అవసరము దీరిన వెంటనే ఇచ్చివేయవలెను. ఏమియు అనుకోరులే యను భావమును విడనాడవలెను.
72. గొప్పదశ వచ్చెననుచు నొ
కప్పుడయిన గర్వపడకు మదిఁ దొలఁగినచో
జప్పట్లు చరతు రందఱు
దప్పని దండించు దణ్డధరుఁడు కుమారీ!
ఓ సుకుమారీ! దశ తిరిగిందని, మంచి స్థితి వచ్చిందని విర్రవీగకుము. గర్వపడకుము. ఎపుడేలా ఉంటుందో ఎవరికెరుక? అది తొలగిన నాడు అందరు నిన్ను జూచి తప్పట్లు కొట్టి ఎగతాళి చేస్తారు. యముడు కూడా నిన్నే తప్పు బట్టి శిక్షిస్తాడు.
73. సుమతియును జంద్రమతియును
దమయంతియు జానకియును ద్రౌఅప్దియును బ
న్నములం బడి పతిభక్తిం
గ్రమమున నడుపుటలు తలఁప గాదె కుమారీ!
ఓ సుశీలాకుమారీ! సుమతి, చంద్రమతి, దమయంతి, సీత,ద్రౌపది మొదలగువారందరు పలు కష్టములు పడిననూ పతిభక్తి విడువలేదని మరువకుము. వారి నెల్లపుడు మనస్సున తలంచుకొనుము.
74. సుమతి అను రమణి పతికై
శ్రమనొందుట నీచసేవ సలు పుటయు వియ
ద్గమననిరోధము భానున
కమరించుటయుం దలంపు మాత్మఁ గుమారీ!
ఓ సుకుమారీ! సుమతి తన భర్త కొఱకు పడరాని పాట్లు పడి నీచులను గొలిచి, చివరకు తన భర్త ప్రాణము కాపాడుటకై గగన మార్గమున పోవుచున్న సూర్యభగవానుని గమనమును గూడ తన పాత్రివ్రత్య మహిమతో నిరోధించిన విషయం విడువకుమమ్మా!
75. వాణియు శర్వాణియు హరి
రాణియు వాక్కునను మైను రంబున నుంటల్
రాణఁ దిలకించి మదిలో
బాణీగ్రాహియెడ నిల్పు భక్తి గుమారీ!
ఓ చినదానా! సరస్వతీ,పార్వతి,లక్ష్మిదేవులు తమదమ భర్తల నశ్రయించుకొనియుండుట తెలుసుకొని నీ భర్తయందు గూడా అంతే భీతితో మెలగుము. (సరస్వతీదేవి తన భర్తయైన బ్రహ్మముఖమునందు,పార్వతీదేవి తన భర్త ఈశ్వరుని శరీరమందునూ(అర్ధనారీశ్వరుడు),లక్ష్మీదేవి తన భర్తయైన విష్ణుమూర్తి వక్షస్థలమందునూ స్థిరనివాసమేర్పర్చుకొనుట ఎల్లరకూ విదితమే గదా!
76. వడ్డించునపుడు తాఁ గను
బిడ్డనికిం దల్లి భంగిం బ్రేమ దలిర్పన్
వడ్డింపవలయు భర్తకు
నెడ్డెతనము మానవలయు నెందు కుమారీ!
ఓ సౌశీల్యవతీ! కన్నతల్లి తన బిడ్డకు ప్రేమతో నెట్లు వడ్డించునో అట్లే నీవు నీ భర్తకు గూడా ప్రీతితో వడ్డింపవలెను. ఎచ్చటనైననూ రోత పుట్టునట్లు నడుచుకొనరాదు.(భోజ్యేషు మాతాః భర్తకు వడ్డించేటపుడు తల్లిగా)
77. పవళించునపుడు రంభా
కువలయదళనేత్రభంగి గోరిన రీతిన్
ధవుని కొనఁగూర్పవలయును
దివి భువి నుతి బొందునట్టి తెఱవ కుమారీ!
ఓ కుమారీ! మగని కోరిక దీర్చుటే మగువకు పుణ్యమని ఎరిగి అతని మనస్సును దెలుసుకొని రంభవలె నలంకరించుకొని, ఆతడి కోరికను ప్రియముతో నెరవేర్చవలెను. అట్లు చేసిన ఆడది ఇహపరలోకములందు ముక్తిని పొందును (శయనేషు రంభ)
78. ఆలోచన యొనరించెడి
వేళలలో మంత్రిభంగి వివరింపవలెన్
కాలోచిత కృత్యంబుల
భూలోకమునందు గీర్తిఁ బొందు కుమారీ!
ఓ సుకుమారీ! మంత్రివలె మగనికి మంచి స్పూర్థినిచ్చెడి ఆలోచనా తోడ్పాటు నందివ్వవలెను. మంచిపనులను మగనికి దెల్పి, మంచి ఆలోచనలను అందివ్వవలెను. అట్లు చేసిన యాడుది లోకమునందు కీర్తిని బొందును.(కరణేషు మంత్రి)
79. పనిసేయునపుడు దాసీ
వనితవిధంబునను మేను వంపగవలయున్
ధనవంతుల సుత యైనను
ఘనత గలుగు దానివలన గాదె కుమారీ!
ఓ సుకుమారీ! తన ఇంట దాసీదానివలె శరీరమును వంచి పనిచేయవలెను. ఎంతటి ధనవంతుల కూతురైనను భర్తకిట్టి సపర్యలు జేసినచో మహితాత్మురాలగును.(కార్యేషు దాసి)
80. దానములు ధర్మకార్యము
లూనంగాఁ గలిగినంత యుక్తక్రియలన్
మానవతుల కిది ధర్మము
గా నెఱిఁగి యొనర్పవలయు గాదె కుమారీ!
ఓ కుమారీ! దానధర్మములు కలిగినంతమేరకే తగిన విధముగా జేయవలెను. అదియే స్త్రీలకు పరమధర్మమని తెలుసుకొనవలెను.
81. శ్రమ యెంత సంభవించిన
క్షమ మఱువగ రాదు ధరణి చందంబున స
త్యమున బ్రవర్తించిన యా
రమణియే లోకంబునందు రమణి కుమారీ!
ఓ సుకుమారీ! స్త్రీలు భూదేవి వలె ఓర్పును కలిగి ఉండాలి. ఎంత కష్టము కలిగిననూ ఓర్పు వీడరాదు. సత్యప్రవర్తనగల ఆడుది లోకమున కీర్తింపబడును .ఆమెయే అసలైన ఆడుది.
82. ఈ రీతి దిరుగ నేర్చిన
నారీమణి కీర్తిఁ బొందు నరలోకమునన్
దూఱులు తొలంగి పోవును
ఘోరదురితసంఘ మెల్ల గుందు గుమారీ!
ఓ సుకుమారీ! ఈ విధముగా ఉండనేర్చునట్టి స్త్రీ ఎల్లెడల గౌరవ మర్యాదలనందు కొనును. కీర్తిని బొందును. నిందలు నాశనమగును. ఆమె పాపములన్నియు హరించును.
83. కామము సంకల్పంబున
బామొందెడు దొలంగు దేహ భావము దెలియన్
వేమఱు నిది పరికించుట
క్షేమం బగు ముక్తి గని సు ఖింపు కుమారీ!
ఓ సుకుమారీ! తలంచినంతనే కోరికలు పుట్టుచున్నవి. దానివలన పాపము పుడుతుంది. శరీరము అశాశ్వతమని ఎఱింగి మసలుకొనుము.మంచి మోక్షము సిద్ధించును. మంచిమార్గమున నడచుకొని మోక్షమునంది సుఖింపుము.
84. పరజనము లాచరించెడి
దురితంబునఁ గ్రోధగుణము దోచెడి నధిక
స్ఫురణన్ క్షమ గైకొనినం
దఱుగు నది యెఱింగి మెలంగ దగును గుమారీ!
ఓ కుమారీ! ఇతరుల చెడ్డగుణములు కోపమును కలుగజేయును,కాని జ్ఞానమెరిగి శాంతమును అలవర్చుకొనుము. శాంతమువలన కోపము నశించును. ఇది తెలిసికొని ప్రవర్తించుము.
85. దృశ్యపదార్ధము లెల్లను
నశ్యము లని తలపకుండి నను లోపంబౌ
దృశ్యంబున నస్థిరత న
వశ్యము చిత్తమున దలప వలదె కుమారీ!
ఓ సుకుమారీ! కనిపించే ప్రతీ వస్తువూ నశించేదని తెలుసుకొనినచో వాని పట్ల వ్యామోహం తగ్గును. కనిపించునవి నిలకడలేనివని (అశాశ్వతములని) మనస్సునందు తెలుసుకొనుము.
86. జనియించెడు నజ్ఞానం
బున మోహగుణంబు, ధర్మమున బరికింపం
దునుమాడ బడును దీనిం
గనుఁగొని మెలఁగంగ వలయుఁ గాదె కుమారీ!
ఓ సుకుమారీ! అజ్ఞానంధకారములో పుట్టే కామగుణము, ధర్మ గుణముచే నశింపబడును. ఈ సంగతి నెఱింగి మెలగవలయును. ధర్మము నాచరింపుము.
87. కులమున విత్తంవున వి
ద్యలను మదం బుద్భవించు నాయా పెంపుల్
తలపోయ మరలు నిది హృ
జ్జలజంబునఁ దలఁపవలయు సతము గుమారీ!
ఓ కుమారీ! కులమువల్లను, ధనమువల్లను, చదువువల్లను, గర్వము జనిచును. కుల,ధన,విద్యల గొప్పతనమును తెలిసికొన్న ఆ గర్వము నశించును. కుల,ధన,విద్యలెప్పుడూ గర్వమును నేర్పవు. ఇది మనసునందు దెలిసికొని మసలుకొనుము.
88. మాత్సర్య మొదవు సత్యము
హృత్సరసీజమున లేమి నెల్లప్పుడుఁ దా
సత్సేవయందుఁ దిరిగి
మాత్సర్య మణంగు దెలిసి మనుము కుమారీ!
ఓ సుకుమారీ! సత్యగుణము లేకపోవుటచే మనస్సునందు ద్వేషభావము పుట్టుతున్నది. ఎల్లపుడు మంచి గుణములయందు మసలుకున్నచో ద్వేషభావము నశించునని తెలిసికొని జీవింపుము.
89. బహుకష్టములం బొందక
మహిలో సమకూడబోదు మానవజన్మం
బహహా! యీ జన్మబున
నిహపరములఁ గొనెడుజాడ లెఱుగు కుమారీ!
ఓ సుకుమారీ! ఈ మానవజన్మ సర్వోత్కృష్టమైనది. దీనికై పలుకష్టములు బడయవలెను. ఎన్నో కష్టనష్టములు తర్వాతగాని ఈ మానవజన్మ ప్రాప్తించదు. కావున ఇహలోక, పరలోక సౌఖ్యములను ఈ జన్మమందు బొందు మార్గమన్వేషింపుము.
90. ఎన్నాళ్ళు బ్రతుకఁ బోదురు
కొన్నాళ్ళకు మరణదశలఁ గ్రుంగుట జగమం
దున్నట్టివారి కందఱి
కిన్నిహితము సతము మంచి కీర్తి కుమారీ!
ఓ సుకుమారీ! చావు పుట్టుకలు సహజములని ఎఱుగుము. లోకమందలి ప్రజలందరూ ఎన్నాళ్ళో బ్రతకరు. పుట్టిన ప్రతిజీవి గిట్టుట తప్పదు. ఈ సత్యమునెఱిగి శాశ్వతమైన కీర్తిని బొందు సద్గుణముల నలవర్చుకొని చరింపుము.
91. పెనిమిటికన్న బతివ్రత
మునుపే మృతి బొందెనేని బురుషాగమనం
బున కెదురు చూచు వచ్చిన
గనుగొని యనురాగ మేనయ గలయు కుమారీ!
ఓ చినదానా! పతివ్రతయైన స్త్రీ, పుణ్యస్త్రిగా మరణీంచును. అనగా భర్తకంటే తానే ముందు మరణించి, ఆ తరువాత తన భర్తరాకకై స్వర్గలోకమున వేచియుండి అతనిని ప్రీతితో స్వర్గలోకమున కాహ్వానించును.
92. మును నాధుడు దరలినచో
వెనువెంటనె పోయి యెల్ల వేల్పులు పొగడం
గని యెందు నిందు నందును
ఘనకీర్తుల బొందుచుండు గాదె కుమారీ!
ఓ సుకుమారీ! ఒక వేళ తన మగడె ముందు మరణించినచో దేవతలెల్లరు పొగడగా వెంటనే బోయి అతనిని కలుసుకొనును. ఇది పతివ్రతా లక్షణము. ఇటువంటి ఆడుది (పతివ్రత) భూలోకములోనూ,స్వర్గలోకములోనూ కీర్తిని బొందును.
93. మఱవవలె గీడు నెన్నడు
మఱవంగారాదు మేలు మర్యాదలలో
దిరుగవలె సర్వజనములు
దరిఁ బ్రేమ మెలంగవలయు దరుణి కుమారీ!
ఓ సుకుమారీ! మేలును (మంచిని) మఱువరాదు. కీడు(చెడుని) విడువవలెను. ఆడవారందరితో మర్యాదగా నడుచుకొనవలెను. వారందరిపట్ల ప్రేమపూర్వకముగా నుండవలయును.
94. ఆకు లొకిన్నియు జేకొని
పోఁక నమిలి సున్న మడుగఁ బోయిన గని యీ
లోకులు నవ్వుదురు సుమీ!
కైకొనవలె మంచి నడత ఘనత గుమారీ!
ఓ సుకుమారీ! ఆడువారు సద్గుణముల నలవర్చుకొనవలెను. మంచి పద్ధతులను, నడవడికలను అలవర్చుకొనాలి. ఆకు,వక్క,నమలుతూ సున్నమడుగుట అజ్ఞానము. అట్టివారిని జూచి జనులు నవ్వుదురు.(ఆకులకు సున్నం రాసుకొని వక్కలను జోడించి నమలుట మంచి పద్ధతి) కావున స్త్రీలు మంచి పద్ధతులను అవలంభించవలెను.
95. నేలన్ వ్రాలిన పత్రము
లోలిం జోడించి, మడచు చుండిన యవియున్
బోలఁగ సున్నపుటాకులు
దూలించు దరిద్రదశల దోఁచ గుమారీ!
ఓ చినదానా! నేలపై పడిన ఆకులనేరుకొని, మూడు నాలుగు ఆకులను క్రమముగ జోడించి మడతబెట్టి, సున్నమునుంచి తినునట్టి ఆకులును ,దరిద్రమనుభవించు విధమున కదలును.
96. ఇద్దఱు గూడుక యొక చో
నొద్దిక మాటాడుచుండ నొదిగి యొదిగి యా
యొద్దకు జనగూడదు తన
పెద్దతనంబెల్ల నణఁగ బెట్టు గుమారీ!
ఓ కుమారీ! ఇద్దరు మాట్లాడుకొనునపుడు మధ్యలో దూరి కల్పించుకొనరాదు. అట్టి స్థలమునకు బోగూడదు. వెళ్ళినచో తన గొప్పదమనెల్ల జెడిపోవును.
97. తుడుపుదుమారమ్మును జెరు
గుడుధూళియు మేషరజముఁ గూడ దెపుడు మైఁ
బడ నెఱిఁగి తిరుగ నేర్చిన
బడఁతుల మర్యాద లెఱింగి బ్రతుకు కుమారీ!
ఓ సుకుమారీ! తుడిచిన దుమ్ము, చేటదుమ్ము,మెకల దుమ్ము శరీరముపై పడరాదు. అట్లు పడినచో అది అనర్ధహేతువు. ఆడువారు ఈ పద్ధతులనెఱింగి నడుచుకొనవలెను.
98. దీపములనీడ మానవ
రూపంబులనీడ శని తరులనీడ సుఖ
ట్వాపాదిత మగు నీడ
నేపట్టున నిలువగూడ దెపుడు కుమారీ!
ఓ సుకుమారీ! దీపముల యొక్క నీడలందును, మనిషి యొక్క నీడలందును, తాటి చెట్లయొక్క నీడలయందును, మంచము నీడల యందును, ఎన్నడును చరింపరాదు. ఆ నీడలు పడకుండ చూసుకొనవలెను. లేనిచో దరిద్రమబ్బును.
99. కొనగోళ్ళ వ్రేలు వెండ్రుక
లను జాఱెడు నీళ్ళు కుండ లన్ ముంతల వా
డిన వెన్క మిగులునీళ్ళును
జన దండ్రు దరిద్ర మొందు జగతి గుమారీ!
ఓ సుకుమారీ! కొనగోళ్ళనుండి జాలువారిన నీరును, వెంట్రుక చివరలనుండి జారిపడే నీరును, కుండలలోనూ, ముంతలలోనూ ఉపయోగింపగా మిగిలిన నీరును పనికిరావని పెద్దలు చెప్పుదురు. వాని వలన మన అదృష్టము చేజారును. శని పడుతుంది.
100. ధరఁ బక్కికులుఁడు వేంకట
నరసింహకవీంద్రు డిట్టి నడతలు ధరపైఁ
దెఱవల తెరువు లటంచును
జిరతర సత్కీర్తి వెలయఁ జెప్పె గుమారీ!
ఓ సుకుమారీ! ఇటువంటి సద్గుణములు భూమియందు ఆడవారికి ధర్మమార్గములనియు, శాశ్వత కీర్తిని సంపాదించి పెట్టుననియు పక్కి వేంకట నరశింహ కవీంద్రుడు చెప్పుచున్నాడు.
Comments
Post a Comment