నరసింహ శతకము మొదటి భాగం Narasimha satakam part one
నరసింహ శతకము మొదటి భాగం
001
సీ. శ్రీమనోహర! సురా - ర్చిత సింధుగంభీర!
భక్తవత్సల! కోటి - భానుతేజ!
కంజనేత్ర! హిరణ్య - కశ్యపాంతక! శూర!
సాధురక్షణ! శంఖ - చక్రహస్త!
ప్రహ్లాద వరద! పా - పధ్వంస! సర్వేశ!
క్షీరసాగరశాయి! - కృష్ణవర్ణ!
పక్షివాహన! నీల - భ్రమరకుంతలజాల!
పల్లవారుణపాద - పద్మయుగళ!
తే. చారుశ్రీచందనాగరు - చర్చితాంగ!
కుందకుట్మలదంత! వై - కుంఠధామ!
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
002
సీ. పద్మలోచన! సీస - పద్యముల్ నీ మీద
జెప్పబూనితినయ్య! - చిత్తగింపు
గణ యతి ప్రాస ల - క్షణము జూడగలేదు
పంచకావ్య శ్లోక - పఠన లేదు
అమరకాండత్రయం - బరసి చూడగలేదు
శాస్త్రీయ గ్రంథముల్ - చదువలేదు
నీ కటాక్షంబున - నే రచించెద గాని
ప్రజ్ఞ నాయది గాదు - ప్రస్తుతింప
తే. దప్పుగలిగిన సద్భక్తి - తక్కువౌనె
చెఱకునకు వంకపోయిన - చెడునె తీపు?
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
003
సీ. నరసింహ! నీ దివ్య - నామమంత్రముచేత
దురితజాలము లన్ని - దోలవచ్చు
నరసింహ! నీ దివ్య - నామమంత్రముచేత
బలువైన రోగముల్ - పాపవచ్చు
నరసింహ! నీ దివ్య - నామమంత్రముచేత
రిపుసంఘముల సంహ - రింపవచ్చు
నరసింహ! నీ దివ్య - నామమంత్రముచేత
దండహస్తుని బంట్ల - దరమవచ్చు
తే. భళిర! నే నీ మహామంత్ర - బలముచేత
దివ్య వైకుంఠ పదవి సా - ధింపవచ్చు
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
004
సీ. ఆదినారాయణా! - యనుచు నాలుకతోడ
బలుక నేర్చినవారి - పాదములకు
సాష్టాంగముగ నమ - స్కార మర్పణ జేసి
ప్రస్తుతించెదనయ్య - బహువిధముల
ధరణిలో నరులెంత - దండివారైనను
నిన్ను గాననివారి - నే స్మరింప
మేము శ్రేష్ఠుల మంచు - మిడుకుచుంచెడివారి
చెంత జేరగబోను - శేషశయన
తే. పరమ సాత్వికులైన నీ - భక్తవరుల
దాసులకు దాసుడను సుమీ - ధాత్రిలోన
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
005
సీ. ఐశ్వర్యమునకు ని - న్ననుసరింపగలేదు
ద్రవ్య మిమ్మని వెంట - దగులలేదు
కనక మిమ్మని చాల - కష్టపెట్టగలేదు
పరుస మిమ్మని నోట - బలకలేదు
సొమ్ము లిమ్మని నిన్ను - నమ్మి కొల్వగలేదు
భూము లిమ్మని పేరు - బొగడలేదు
బలము నిమ్మని నిన్ను - బ్రతిమాలగాలేదు
పసుల నిమ్మని పట్టు - పట్టలేదు
తే. నేను కోరిన దొక్కటే - నీలవర్ణ
చయ్యనను మోక్షమిచ్చిన - జాలు నాకు
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
006
సీ. మందుడనని నన్ను - నింద జేసిననేమి?
నా దీనతను జూచి - నవ్వ నేమి?
దూరభారములేక - తూలనాడిన నేమి?
ప్రీతిసేయక వంక - బెట్ట నేమి?
కక్కసంబులు పల్కి - వెక్కిరించిన నేమి?
తీవ్రకోపముచేత - దిట్ట నేమి?
హెచ్చుమాటలచేత - నెమ్మె లాడిన నేమి?
చేరి దాపట గేలి - చేయనేమి?
తే. కల్పవృక్షంబువలె నీవు - గల్గ నింక
బ్రజల లక్ష్యంబు నాకేల? - పద్మనాభ!
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
007
సీ. చిత్తశుద్ధిగ నీకు - సేవజేసెదగాని
పుడమిలో జనుల మె - ప్పులకు గాదు
జన్మపావనతకై - స్మరణజేసెద గాని
సరివారిలో బ్రతి - ష్ఠలకు గాదు
ముక్తికోసము నేను - మ్రొక్కి వేడెదగాని
దండిభాగ్యము నిమి - త్తంబు గాదు
నిన్ను బొగడను విద్య - నేర్చితినేకాని
కుక్షినిండెడు కూటి - కొఱకు గాదు
తే. పారమార్థికమునకు నే బాటుపడితి
గీర్తికి నపేక్షపడలేదు - కృష్ణవర్ణ!
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
008
సీ. శ్రవణ రంధ్రముల నీ - సత్కథల్ పొగడంగ
లేశ మానందంబు - లేనివాడు
పుణ్యవంతులు నిన్ను - బూజసేయగ జూచి
భావమందుత్సాహ - పడనివాడు
భక్తవర్యులు నీ ప్ర - భావముల్ పొగడంగ
దత్పరత్వములేక - తలగువాడు
తనచిత్తమందు నీ - ధ్యాన మెన్నడు లేక
కాలమంతయు వృథా - గడపువాడు
తే. వసుధలోపల వ్యర్థుండు - వాడె యగును
మఱియు జెడుగాక యెప్పుడు - మమతనొంది.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
009
సీ. గౌతమీస్నానాన - గడతేఱుద మటన్న
మొనసి చన్నీళ్లలో - మునుగలేను
తీర్థయాత్రలచే గృ - తార్థు డౌదమటన్న
బడలి నేమంబు లే - నడపలేను
దానధర్మముల స - ద్గతిని జెందుదమన్న
ఘనముగా నాయొద్ద - ధనములేదు
తపమాచరించి సా - ర్థకము నొందుదమన్న
నిమిషమైన మనస్సు - నిలుపలేను
తే. కష్టములకోర్వ నాచేత - గాదు నిన్ను
స్మరణచేసెద నా యథా - శక్తి కొలది.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
010
సీ. అర్థివాండ్రకు నీకు - హాని జేయుట కంటె
దెంపుతో వసనాభి - దినుట మేలు
ఆడుబిడ్డలసొమ్ము - లపహరించుట కంటె
బండ గట్టుక నూత - బడుట మేలు
పరులకాంతల బట్టి - బల్మి గూడుట కంటె
బడబాగ్ని కీలల - బడుట మేలు
బ్రతుకజాలక దొంగ - పనులు చేయుట కంటె
గొంగుతో ముష్టెత్తు - కొనుట మేలు
తే. జలజదళనేత్ర నీ భక్త - జనులతోడి
జగడమాడెడు పనికంటె - జావు మేలు
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
011
సీ. గార్దభంబున కేల - కస్తూరి తిలకంబు?
మర్కటంబున కేల - మలయజంబు?
శార్ధూలమునక కేల - శర్కరాపూపంబు?
సూకరంబున కేల - చూతఫలము?
మార్జాలమున కేల - మల్లెపువ్వులబంతి?
గుడ్లగూబల కేల - కుండలములు?
మహిషంబునకు యేల ని - ర్మలమైన వస్త్రముల్?
బక సంతతికి నేల - పంజరంబు?
తే. ద్రోహచింతన జేసెడి - దుర్జనులకు
మధురమైనట్టి నీనామ - మంత్రమేల?
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
012
సీ. పసరంబు పందైన - బసులకాపరి తప్పు
ప్రజలు దుర్జనులైన - ప్రభుని తప్పు
భార్య గయ్యాళైన - బ్రాణనాధుని తప్పు
తనయుండు దుష్టైన - తండ్రి తప్పు
సైన్యంబు చెదిరిన - సైన్యనాధుని తప్పు
కూతురు చెడుగైన - మాత తప్పు
అశ్వంబు చెడుగైన - నారోహకుని తప్పు
దంతి దుష్టయిన మా - వంతు తప్పు
తే. ఇట్టి తప్పులెఱుంగక - యిచ్చవచ్చి
నటుల మెలగుదు రిప్పు డీ - యవని జనులు.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
013
సీ. కోతికి జలతారు - కుళ్లాయి యేటికి?
విరజాజి పూదండ - విధవ కేల?
ముక్కిడితొత్తుకు - ముత్తెంపు నత్తేల?
నద్ద మేమిటికి జా - త్యంధునకును?
మాచకమ్మకు నేల - మౌక్తికహారముల్?
క్రూరచిత్తునకు స - ద్గోష్ఠు లేల?
ఱంకుబోతుకు నేల - బింకంపు నిష్ఠలు?
వావి యేటికి దుష్ట - వర్తనునకు?
తే. మాట నిలుకడ సుంకరి - మోటు కేల?
చెవిటివానికి సత్కథా - శ్రవణ మేల?
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
014
సీ. మాన్యంబులీయ స - మర్ధుడొక్కడు లేడు
మాన్యముల్ జెఱుప స - మర్ధు లంత
యెండినయూళ్ల గో - డెఱిగింప డెవ్వడు
బండిన యూళ్లకు - బ్రభువు లంత
యితడు పేద యటంచు - నెఱిగింప డెవ్వడు
కలవారి సిరు లెన్న - గలరు చాల
దనయాలి చేష్టల - తప్పెన్న డెవ్వడు
పరకాంత ఱంకెన్న - బెద్ద లంత
తే. యిట్టి దుష్టుల కధికార - మిచ్చినట్టి
ప్రభువు తప్పు లటంచును - బలుకవలెను.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
015
సీ. తల్లిగర్భమునుండి - ధనము తే డెవ్వడు
వెళ్లిపోయిననాడు - వెంటరాదు
లక్షాధికారైన - లవణ మన్నమె కాని
మెఱుగు బంగారంబు - మ్రింగబోడు
విత్త మార్జనజేసి - విఱ్ఱవీగుటె కాని
కూడబెట్టిన సొమ్ము - కుడువ బోడు
పొందుగా మఱుగైన - భూమిలోపల బెట్టి
దానధర్మము లేక - దాచి దాచి
తే. తుదకు దొంగల కిత్తురో - దొరల కవునొ
తేనె జుంటీగ లియ్యవా - తెరువరులకు?
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
016
సీ. లోకమం దెవడైన - లోభిమానవు డున్న
భిక్ష మర్థికి జేత - బెట్టలేడు
తాను బెట్టకయున్న - తగవు పుట్టదు గాని
యొరులు పెట్టగ జూచి - యోర్వ లేడు
దాతదగ్గఱ జేరి - తన ముల్లె పోయినట్లు
జిహ్వతో జాడీలు - చెప్పుచుండు
ఫలము విఘ్నంబైన - బలు సంతసము నొందు
మేలు కల్గిన జాల - మిడుకు చుండు
తే. శ్రీరమానాథ! యిటువంటి - క్రూరునకును
భిక్షుకుల శత్రువని - పేరు బెట్టవచ్చు.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
017
సీ. తనువులో బ్రాణముల్ - తరలిపోయెడు వేళ
నీ స్వరూపమును ధ్యా - నించునతడు
నిమిషమాత్రములోన - నిన్ను జేరును గాని
యముని చేతికి జిక్కి - శ్రమలబడడు
పరమసంతోషాన - భజన జేసెడివాని
పుణ్య మేమనవచ్చు - భోగిశయన
మోక్షము నీ దాస - ముఖ్యుల కగు గాని
నరక మెక్కడిదయ్య - నళిననేత్ర
తే. కమలనాభ నీ మహిమలు - గానలేని
తుచ్ఛులకు ముక్తిదొరకుట - దుర్లభంబు.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
018
సీ. నీలమేఘశ్యామ! - నీవె తండ్రివి మాకు
కమలవాసిని మమ్ము - గన్నతల్లి
నీ భక్తవరులంత - నిజమైన బాంధవుల్
నీ కటాక్షము మా క - నేకధనము
నీ కీర్తనలు మాకు - లోక ప్రపంచంబు
నీ సహాయము మాకు - నిత్యసుఖము
నీ మంత్రమే మాకు - నిష్కళంకపు విద్య
నీ పద ధ్యానంబు - నిత్యజపము
తే. తోయజాతాక్ష నీ పాద - తులసిదళము
రోగముల కౌషధము బ్రహ్మ - రుద్రవినుత.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
019
సీ. బ్రతికినన్నాళ్లు నీ - భజన తప్పను గాని
మరణకాలమునందు - మఱతునేమొ
యావేళ యమదూత - లాగ్రహంబున వచ్చి
ప్రాణముల్ పెకలించి - పట్టునపుడు
కఫ వాత పైత్యముల్ - గప్పగా భ్రమచేత
గంప ముద్భవమంది - కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను - నారాయణా యంచు
బిలుతునో శ్రమచేత - బిలువలేనొ
తే. నాటి కిప్పుడె చేసెద - నామభజన
తలచెదను, జెవి వినవయ్య! - ధైర్యముగను.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
020
సీ. పాంచభౌతికము దు - ర్బరమైన కాయం బి
దెప్పుడో విడుచుట - యెఱుక లేదు
శతవర్షములదాక - మితము జెప్పిరి గాని
నమ్మరా దామాట - నెమ్మనమున
బాల్యమందో మంచి - ప్రాయమందో లేక
ముదిమియందో లేక - ముసలియందొ
యూరనో యడవినో - యుదకమధ్యముననో
యెప్పుడో విడుచుట - యేక్షణంబొ
తే. మరణమే నిశ్చయము బుద్ధి - మంతుడైన
దేహమున్నంతలో మిమ్ము - దెలియవలయు.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
021
సీ. తల్లిదండ్రులు భార్య - తనయు లాప్తులు బావ
మఱదు లన్నలు మేన - మామగారు
ఘనముగా బంధువుల్ - గల్గినప్పటికైన
దాను దర్లగ వెంట - దగిలి రారు
యముని దూతలు ప్రాణ - మపహరించుక పోగ
మమతతో బోరాడి - మాన్పలేరు
బలగ మందఱు దుఃఖ - పడుట మాత్రమె కాని
యించుక యాయుష్య - మియ్యలేరు
తే. చుట్టములమీది భ్రమదీసి - చూర జెక్కి
సంతతము మిమ్ము నమ్ముట - సార్థకంబు.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
022
సీ. ఇభరాజవరద! ని - న్నెంత బిల్చినగాని
మాఱు పల్క వదేమి - మౌనితనమొ?
మునిజనార్చిత! నిన్ను - మ్రొక్కి వేడినగాని
కనుల జూడ వదేమి - గడుసుదనమొ?
చాల దైన్యమునొంది - చాటు చొచ్చినగాని
భాగ్య మియ్య వదేమి - ప్రౌఢతనమొ?
స్థిరముగా నీపాద - సేవ జేసెద నన్న
దొరకజాల వదేమి - ధూర్తతనమొ?
తే. మోక్షదాయక! యిటువంటి - మూర్ఖజనుని
కష్టపెట్టిన నీకేమి - కడుపునిండు.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
023
సీ. నీమీద కీర్తనల్ - నిత్యగానము జేసి
రమ్యమొందింప నా - రదుడగాను
సావధానముగ నీ - చరణ పంకజ సేవ
సలిపి మెప్పంపంగ - శబరిగాను
బాల్యమప్పటినుండి - భక్తి నీయందున
గలుగను బ్రహ్లాద - ఘనుడగాను
ఘనముగా నీమీది - గ్రంథముల్ గల్పించి
వినుతిసేయను వ్యాస - మునినిగాను
తే. సాధుడను మూర్ఖమతి మను - ష్యాధముడను
హీనుడను జుమ్మి నీవు - న న్నేలుకొనుము.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
024
సీ. అతిశయంబుగ గల్ల - లాడనేర్చితిగాని
పాటిగా సత్యముల్ - పలుకనేర
సత్కార్య విఘ్నముల్ - సలుప నేర్చితిగాని
యిష్ట మొందగ నిర్వ - హింపనేర
నొకరి సొమ్ముకు దోసి - లొగ్గ నేర్చితిగాని
చెలువుగా ధర్మంబు - సేయనేర
ధనము లియ్యంగ వ - ద్దనగ నేర్చితిగాని
శీఘ్ర మిచ్చెడునట్లు - చెప్పనేర
తే. బంకజాతాక్ష! నే నతి - పాతకుడను
దప్పులన్నియు క్షమియింప - దండ్రి వీవె!
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
025
సీ. ఉర్విలో నాయుష్య - మున్న పర్యంతంబు
మాయ సంసారంబు - మరగి నరుడు
సకల పాపములైన - సంగ్రహించును గాని
నిన్ను జేరెడి యుక్తి - నేర్వలేడు
తుదకు గాలునియొద్ది - దూత లిద్దఱు వచ్చి
గుంజుక చని వారు - గ్రుద్దుచుండ
హింస కోర్వగ లేక - యేడ్చి గంతులువేసి
దిక్కు లేదని నాల్గు - దిశలు చూడ
తే. దన్ను విడిపింప వచ్చెడి - ధన్యు డేడి
ముందు నీదాసుడై యున్న - ముక్తి గలుగు.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
026
సీ. అధిక విద్యావంతు - లప్రయోజకులైరి
పూర్ణశుంఠలు సభా - పూజ్యులైరి
సత్యవంతులమాట - జన విరోధంబాయె
వదరుబోతులమాట - వాసికెక్కె
ధర్మవాదనపరుల్ - దారిద్ర్యమొందిరి
పరమలోభులు ధన - ప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగ - భూత పీడితులైరి
దుష్టమానవులు వ - ర్ధిష్ణులైరి
తే. పక్షివాహన! మావంటి - భిక్షుకులకు
శక్తిలేదాయె నిక నీవె - చాటు మాకు.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
027
సీ. భుజబలంబున బెద్ద - పులుల జంపగవచ్చు
పాముకంఠము జేత - బట్టవచ్చు
బ్రహ్మ రాక్షసకోట్ల - బాఱద్రోలగవచ్చు
మనుజుల రోగముల్ - మాన్పవచ్చు
జిహ్వ కిష్టముగాని - చేదు మ్రింగగవచ్చు
బదను ఖడ్గము చేత - నదమవచ్చు
గష్టమొందుచు ముండ్ల - కంపలో జొరవచ్చు
దిట్టుబోతుల నోళ్లు - కట్టవచ్చు
తే. బుడమిలో దుష్టులకు జ్ఞాన - బోధ తెలిపి
సజ్జనుల జేయలే డెంత - చతురుదైన.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
028
సీ. అవనిలోగల యాత్ర - లన్ని చేయగవచ్చు
ముఖ్యుడై నదులందు - మునుగవచ్చు
ముక్కుపట్టుక సంధ్య - మొనసి వార్వగవచ్చు
దిన్నగా జపమాల - ద్రిప్పవచ్చు
వేదాల కర్థంబు - విఱిచి చెప్పగవచ్చు
శ్రేష్ఠ్ క్రతువు లెల్ల - జేయవచ్చు
ధనము లక్షలు కోట్లు - దానమియ్యగవచ్చు
నైష్ఠికాచారముల్ - నడుపవచ్చు
తే. జిత్త మన్యస్థలంబున - జేరకుండ
నీ పదాంభోజములయందు - నిలపరాదు.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
029
సీ. కర్ణయుగ్మమున నీ - కథలు సోకినజాలు
పెద్ద పోగుల జోళ్లు - పెట్టినట్లు
చేతు లెత్తుచు బూజ - సేయగల్గినజాలు
తోరంపు కడియాలు - దొడిగినట్లు
మొనసి మస్తకముతో - మ్రొక్క గల్గినజాలు
చెలువమైన తురాయి - చెక్కినట్లు
గళము నొవ్వగ నిన్ను - బలుక గల్గినజాలు
వింతగా గంఠీలు - వేసినట్లు
తే. పూని నిను గొల్చుటే సర్వ - భూషణంబు
లితర భూషణముల నిచ్చ - గింపనేల.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
030
సీ. భువనరక్షక! నిన్ను - బొగడనేరని నోరు
వ్రజ కగోచరమైన - పాడుబొంద
సురవరార్చిత! నిన్ను - జూడగోరని కనుల్
జలములోపల నెల్లి - సరపుగుండ్లు
శ్రీరమాధిమ! నీకు - సేవజేయని మేను
కూలి కమ్ముడువోని - కొలిమితిత్తి
వేడ్కతో నీకథల్ - వినని కర్ణములైన
గఠినశిలాదుల - గలుగు తొలలు
తే. పద్మలోచన నీమీద - భక్తిలేని
మానవుడు రెండుపాదాల - మహిషమయ్య.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
031
సీ. అతివిద్యనేర్చుట - అన్నవస్త్రములకే
పసుల నార్జించుట - పాలకొఱకె
సతిని బెండ్లాడుట - సంసార సుఖముకే
సుతుల బోషించుట - గతులకొఱకె
సైన్యముల్ గూర్చుట - శత్రుజయమునకే
సాము నేర్చుటలెల్ల - చావుకొఱకె
దానమిచ్చుటయు ముం - దటి సంచితమునకే
ఘనముగా జదువుట - కడుపు కొఱకె
తే. యితర కామంబు గోరక - సతతముగను
భక్తి నీయందు నిలుపుట - ముక్తి కొఱకె
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
032
సీ. ధరణిలో వేయేండ్లు - తనువు నిల్వగబోదు
ధన మెప్పటికి శాశ్వ - తంబు గాదు
దారసుతాదులు - తనవెంట రాలేరు
భృత్యులు మృతిని ద - ప్పింపలేరు
బంధుజాలము తన్ను - బ్రతికించుకోలేరు
బలపరాక్రమ మేమి - పనికి రాదు
ఘనమైన సకల భా - గ్యం బెంత గల్గిన
గోచిమాత్రంబైన - గొనుచుబోడు
తే. వెఱ్ఱి కుక్కల భ్రమలన్ని - విడిచి నిన్ను
భజన జేసెడివారికి - బరమసుఖము.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
033
సీ. నరసింహ ! నాకు దు - ర్ణయములే మెండాయె
సుగుణ మొక్కటిలేదు - చూడ జనిన
నన్యకాంతల మీద - నాశ మానగలేను
నొరుల క్షేమము చూచి - యోర్వలేను
ఇటువంటి దుర్బుద్ధు - లిన్ని నా కున్నవి
నేను జేసెడివన్ని - నీచకృతులు
నావంటి పాపిష్ఠి - నరుని భూలోకాన
బుట్టజేసితి వేల - భోగిశయన !
తే. అబ్జదళనేత్ర! నాతండ్రి - వైన ఫలము
నేరములు గాచి రక్షింపు - నీవె దిక్కు.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
034
సీ. ధీరత బరుల నిం - దింప నేర్చితి గాని
తిన్నగా నిను బ్రస్తు - తింపనైతి
బొరుగు కామినులందు - బుద్ధి నిల్పితి గాని
నిన్ను సంతతము ధ్యా - నింపనైతి
బెరికిముచ్చట లైన - మురిసి వింటినిగాని
యెంచి నీకథ లాల - కించనైతి
గౌతుకంబున బాత - కము గడించితిగాని
హెచ్చు పుణ్యము సంగ్ర - హింపనైతి
తే. నవనిలో నేను జన్మించి - నందు కేమి
సార్థకము గానరాదాయె - స్వల్పమైన.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
035
సీ. అంత్యకాలమునందు - నాయాసమున నిన్ను
దలతునో తలపనో - తలతు నిపుడె
నరసింహ! నరసింహ! - నరసింహ! లక్ష్మీశ!
దానవాంతక! కోటి - భానుతేజ!
గోవింద! గోవింద! - గోవింద! సర్వేశ!
పన్నగాధిపశాయి! - పద్మనాభ!
మధువైరి! మధువైరి! - మధువైరి! లోకేశ!
నీలమేఘశరీర! నిగమవినుత!
తే. ఈ విధంబున నీనామ - మిష్టముగను
భజనసేయుచు నుందు నా - భావమందు.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
036
సీ. ఆయురారోగ్య పు - త్రార్థ సంపదలన్ని
కలుగజేసెడి భార - కర్త వీవె
చదువు లెస్సగ నేర్పి - సభలో గరిష్ఠాధి
కార మొందించెడి - ఘనుడ వీవె
నడక మంచిది పెట్టి - నరులు మెచ్చేడునట్టి
పేరు రప్పించెడి - పెద్ద వీవె
బలువైన వైరాగ్య - భక్తిజ్ఞానములిచ్చి
ముక్తి బొందించెడు - మూర్తి వీవె
తే. అవనిలో మానవుల కన్ని - యాసలిచ్చి
వ్యర్థులను జేసి తెలిపెడి - వాడ వీవె.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
037
సీ. కాయ మెంత భయాన - గాపాడిననుగాని
ధాత్రిలో నది చూడ - దక్క బోదు
ఏవేళ నేరోగ - మేమరించునొ? సత్త్వ
మొందంగ జేయు నే - చందమునను
ఔషధంబులు మంచి - వనుభవించిన గాని
కర్మ క్షీణంబైన గాని - విడదు;
కోటివైద్యులు గుంపు - గూడివచ్చిన గాని
మరణ మయ్యెడు వ్యాధి - మాన్పలేరు
తే. జీవుని ప్రయాణకాలంబు - సిద్ధమైన
నిలుచునా దేహ మిందొక్క - నిమిషమైన?
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
038
సీ. జందె మింపుగ వేసి - సంధ్య వార్చిన నేమి
బ్రహ్మ మందక కాడు - బ్రాహ్మణుండు
తిరుమణి శ్రీచూర్ణ - గురురేఖ లిడినను
విష్ణు నొందక కాడు - వైష్ణవుండు
బూదిని నుదుటను - బూసికొనిన నేమి
శంభు నొందక కాడు - శైవజనుడు
కాషాయ వస్త్రాలు - గట్టి కప్పిన నేమి
యాశ పోవక కాడు - యతివరుండు
తే. ఎన్ని లౌకికవేషాలు - గట్టుకొనిన
గురుని జెందక సన్ముక్తి - దొరకబోదు.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
039
సీ. నరసింహ ! నే నిన్ను - నమ్మినందుకు జాల
నెనరు నాయందుంచు - నెమ్మనమున
నన్ని వస్తువులు ని - న్నడిగి వేసటపుట్టె
నింకనైన గటాక్ష - మియ్యవయ్య
సంతసంబున నన్ను - స్వర్గమందే యుంచు
భూమియందే యుంచు - భోగశయన!
నయముగా వైకుంఠ - నగరమందే యుంచు
నరకమందే యుంచు - నళిననాభ!
తే. ఎచట నన్నుంచిననుగాని - యెపుడు నిన్ను
మఱచి పోకుండ నీనామ - స్మరణనొసగు.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
040
సీ. దేహ మున్నవఱకు - మోహసాగరమందు
మునుగుచుందురు శుద్ధ - మూఢజనులు
సలలితైశ్వర్యముల్ - శాశ్వతం బనుకొని
షడ్భ్రమలను మాన - జాల రెవరు
సర్వకాలము మాయ - సంసార బద్ధులై
గురుని కారుణ్యంబు గోరుకొనరు
జ్ఞాన భక్తి విరక్తు - లైన పెద్దల జూచి
నింద జేయక - తాము నిలువలేరు
తే. మత్తులైనట్టి దుర్జాతి - మనుజులెల్ల
నిన్ను గనలేరు మొదటికే - నీరజాక్ష.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
Comments
Post a Comment