నరసింహ శతకం మూడవ భాగం Narasimha satakam part three

నరసింహ శతకం మూడవ భాగం

నరసింహ శతకం మూడవ భాగం Narasimha satakam part three

081

సీ. వదనంబు నీనామ - భజన గోరుచునుండు

జిహ్వ నీకీర్తనల్ - సేయ గోరు

హస్తయుగ్మంబు ని - న్నర్చింప గోరును

గర్ణముల్ నీ మీది - కథలు గోరు

తనువు నీసేవయే - ఘనముగా గోరును

నయనముల్ నీదర్శ - నంబు గోరు

మూర్ధమ్ము నీపద - మ్ముల మ్రొక్కగా గోరు

నాత్మ నీదై యుండు - నరసి చూడ


తే. స్వప్నమున నైన నేవేళ - సంతతమును

బుద్ధి నీ పాదములయందు - బూనియుండు.

భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!

దుష్టసంహార! నరసింహ - దురితదూర!



082

సీ. పద్మాక్ష! మమతచే - బరము నందెద మంచు

విఱ్ఱవీగుదుమయ్య - వెఱ్ఱిపట్టి

మాస్వతంత్రంబైన - మదము గండ్లకు గప్పి

మొగము పట్టదు కామ - మోహమునను

బ్రహ్మదేవుండైన - బైడిదేహము గల్గ

జేసివేయక మమ్ము - జెఱిచె నతడు

తుచ్ఛమైనటువంటి - తో లెమ్ముకలతోడి

ముఱికి చెత్తలు చేర్చి - మూట కట్టె


తే. నీ శరీరాలు పడిపోవు - టెఱుగ కేము

కాముకుల మైతి మిక మిమ్ము - గానలేము.

భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!

దుష్టసంహార! నరసింహ - దురితదూర!



083

సీ. గరుడవాహన! దివ్య - కౌస్తుభాలంకార!

రవికోటితేజ! సా - రంగవదన!

మణిగణాన్విత! హేమ - మకుటాభరణ! చారు

మకరకుండల! లస - న్మందహాస!

కాంచనాంబర! రత్న - కాంచివిభూషిత!

సురవరార్చిత! చంద్ర - సూర్యనయన!

కమలనాభ! ముకుంద! - గంగాధరస్తుత!

రాక్షసాంతక! నాగ - రాజశయన!


తే. పతితపావన! లక్షీశ! - బ్రహ్మజనక!

భక్తవత్సల! సర్వేశ! - పరమపురుష!

భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!

దుష్టసంహార! నరసింహ - దురితదూర!



084

సీ. పలుమాఱు దశరూప - ములు దరించితి వేల?

యేకరూపము బొంద - వేల నీవు?

నయమున క్షీరాబ్ధి - నడుమ జేరితి వేల?

రత్నకాంచన మంది - రములు లేవె?

పన్నగేంద్రునిమీద - బవ్వళించితి వేల?

జలతారుపట్టెమం - చములు లేవె?

ఱెక్కలు గలపక్షి - నెక్కసాగితి వేల?

గజతురంగాందోళి - కములు లేవె?


తే. వనజలోచన! యిటువంటి - వైభవములు

సొగసుగా నీకు దోచెనో - సుందరాంగ?

భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!

దుష్టసంహార! నరసింహ - దురితదూర!



085

సీ. తిరుపతి స్థలమందు - దిన్నగా నే నున్న

వేంకటేశుడు మేత - వేయలేడొ?

పురుషోత్తమమున కే - బోయినజాలు జ

గన్నాథు డన్నంబు - గడపలేడొ?

శ్రీరంగమునకు నే - జేర బోయిన జాలు

స్వామి గ్రాసము బెట్టి - సాకలేడొ?

కాంచీపురములోన - గదిసి నే గొలువున్న

గరివరదుడు పొట్ట - గడపలేడొ?


తే. యెందు బోవక నేను నీ - మందిరమున

నిలిచితిని నీకు నామీద - నెనరు లేదు.

భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!

దుష్టసంహార! నరసింహ - దురితదూర!

086

సీ. తార్క్ష్యవాహన! నీవు - దండిదాత వటంచు

గోరి వేడుక నిన్ను - గొల్వవచ్చి

యర్థిమార్గమును నే - ననుసరించితినయ్య

లావైన బదునాల్గు - లక్ష లైన

వేషముల్ వేసి నా - విద్యాప్రగల్భత

జూపసాగితి నీకు - సుందరాంగ!

యానంద మైన నే - నడుగ వచ్చిన దిచ్చి

వాంఛ దీర్పుము - నీలవర్ణ! వేగ


తే. నీకు నావిద్య హర్షంబు - గాక యున్న

తేపతేపకు వేషముల్ - దేను సుమ్మి.

భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!

దుష్టసంహార! నరసింహ - దురితదూర!



087

సీ. అమరేంద్రవినుత! నే - నతిదురాత్ముడ నంచు

గలలోన నైనను - గనుల బడవు

నీవు ప్రత్యక్షమై - నిలువకుండిన మానె

దొడ్డగా నొక యుక్తి - దొరకెనయ్య!

గట్టికొయ్యను దెచ్చి - ఘనముగా ఖండించి

నీస్వరూపము చేసి - నిలుపుకొంచు

ధూప దీపము లిచ్చి - తులసితో బూజించి

నిత్యనైవేద్యముల్ - నేమముగను


తే. నడుపుచును నిన్ను గొలిచెద - నమ్మి బుద్ధి

నీ ప్రపంచంబు గలుగు నా - కింతె చాలు.

భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!

దుష్టసంహార! నరసింహ - దురితదూర!

088

సీ. భువనేశ! గోవింద! - రవికోటిసంకాశ!

పక్షివాహన! భక్త - పారిజాత!

యంభోజభవ రుద్ర - జంభారిసన్నుత!

సామగానవిలోల! - సారసాక్ష!

వనధిగంభీర! శ్రీ - వత్సకౌస్తుభవక్ష!

శంఖచక్రగదాసి - శార్జ్ఞహస్త!

దీనరక్షక! వాసు - దేవ! దైత్యవినాశ!

నారదార్చిత! దివ్య - నాగశయన!


తే. చారు నవరత్నకుండల - శ్రవణయుగళ!

విబుధవందిత పాదబ్జ! - విశ్వరూప!

భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!

దుష్టసంహార! నరసింహ - దురితదూర!



089

సీ. నాగేంద్రశయన! నీ - నామమాధుర్యంబు

మూడుకన్నుల సాంబ - మూర్తి కెఱుక

పంకజాతాక్ష! నీ - బలపరాక్రమ మెల్ల

భారతీపతి యైన - బ్రహ్మ కెఱుక

మధుకైటభారి! నీ - మాయాసమర్థత

వసుధలో బలిచక్ర - వర్తి కెఱుక

పరమాత్మ! నీ దగు - పక్షపాతిత్వంబు

దశశతాక్షుల పురం - దరుని కెఱుక


తే. వీరి కెఱుకగు నీకథల్ - వింత లెల్ల

నరుల కెఱు కన్న నెవరైన - నవ్విపోరె?

భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!

దుష్టసంహార! నరసింహ - దురితదూర!



090

సీ. అర్థు లేమైన ని - న్నడుగవచ్చెద రంచు

క్షీరసాగరమందు - జేరినావు

నీచుట్టు సేవకుల్ - నిలువకుండుటకునై

భయదసర్పముమీద - బండినావు

భక్తబృందము వెంట - బడి చరించెద రంచు

నెగసి పోయెడిపక్షి - నెక్కినావు

దాసులు నీద్వార - మాసింపకుంటకు

మంచి యోధుల కావ - లుంచినావు


తే. లావు గలవాడ వైతి వే - లాగు నేను

నిన్ను జూతును నాతండ్రి! - నీరజాక్ష!

భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!

దుష్టసంహార! నరసింహ - దురితదూర!



091

సీ. నీకథల్ చెవులలో - సోకుట మొదలుగా

బులకాంకురము మెన - బుట్టువాడు

నయమైన నీ దివ్య - నామకీర్తనలోన

మగ్నుడై దేహంబు - మఱచువాడు

ఫాలంబుతో నీదు - పాదయుగ్మమునకు

బ్రేమతో దండ మ - ర్పించువాడు

హా పుండరీకాక్ష! - హా రామ! హరి! యంచు

వేడ్కతో గేకలు - వేయువాడు


తే. చిత్తకమలంబునను నిన్ను - జేర్చువాడు

నీదులోకంబునం దుండు - నీరజాక్ష!

భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!

దుష్టసంహార! నరసింహ - దురితదూర!



092

సీ. నిగమగోచర నేను నీకు మెప్పగునట్లు

లెస్సగాఁ బూజింపలేను సుమ్మి

నాకుఁ దోఁచిన భూషణములు పెట్టెదనన్నఁ

గౌస్తుభమణి నీకుఁ గలదు ముందె

భక్ష్యభోజ్యముల నర్పణముఁ జేసెద నన్న

నీవు పెట్టితి సుధ నిర్జరులకుఁ

గలిమికొలదిగఁ గానుకల నొసంగెద నన్న

భార్గవీదేవి నీ భార్యయయ్యె

తే. నన్ని గలవాఁడ వఖిల లోకాధిపతివి!

నీకు సొమ్ములు పెట్ట నేనెంతవాఁడ!

భూషణవికాస! శ్రీధర్మపురనివాస!

దుష్టసంహార! నరసింహ దురితదూర!

093

సీ. నవ సరోజదళాక్ష! నన్నుఁ బోషించెడు

దాతవు నీవంచు ధైర్యపడితి

నా మనంబున నిన్ను నమ్మినందుకుఁ దండ్రి!

మేలు నా కొనరింపు నీలదేహ!

భళిభళీ! నీ యంత ప్రభువు నెక్కడఁ జూడఁ

బుడమిలో నీ పేరు పొగడవచ్చు

ముందుఁ జేసిన పాపమును నశింపఁగఁ జేసి

నిర్వహింపుము నన్ను నేర్పుతోడఁ


తే. బరమ సంతోషమాయె నా ప్రాణములకు

నీ ఋణము దీర్చుకొననేర నీరజాక్ష!

భూషణవికాస! శ్రీధర్మపురనివాస!

దుష్టసంహార! నరసింహ దురితదూర!

094

సీ. ఫణుల పుట్టల మీఁదఁ బవ్వళించిన యట్లు

పులుల గుంపునఁ జేరఁబోయిన యట్లు

మకరి వర్గంబున్న మడుఁగుఁ జొచ్చినయట్లు

గంగ దాపున నిండ్లు గట్టినట్లు చెదల భూమిని చెరగు చాఁప బఱచినయట్లు

ఓటిబిందెలఁ బాల నునిచినట్లు

వెఱ్ఱివానికిఁ బహువిత్త మిచ్చినయట్లు

కమ్మగుడిసె మందుఁ గాల్చినట్లు


తే. స్వామి నీ భక్తవరులు దుర్జనులతోడఁ

జెలిమిఁ జేసిన యట్లైనఁ జేటు వచ్చు

భూషణవికాస! శ్రీధర్మపురనివాస!

దుష్టసంహార! నరసింహ దురితదూర!

095 సవరించు

సీ. దనుజసంహార! చక్ర - ధర! నీకు దండంబు

లిందిరాధిప! నీకు - వందనంబు

పతితపావన! నీకు - బహునమస్కారముల్

నీరజాతదళాక్ష! - నీకు శరణు

వాసవార్చిత! మేఘ - వర్ణ! నీకు శుభంబు

మందరధర! నీకు - మంగళంబు

కంబుకంధర! శార్జ్గ - కర! నీకు భద్రంబు

దీనరక్షక! నీకు - దిగ్విజయము


తే. సకలవైభవములు నీకు - సార్వభౌమ!

నిత్యకల్యాణములు నగు - నీకు నెపుడు.

భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!

దుష్టసంహార! నరసింహ - దురితదూర!



096 సవరించు

సీ. మత్స్యావతార మై - మడుగులోపల జొచ్చి

సోమకాసురు ద్రుంచి - చోద్యముగను

దెచ్చి వేదము లెల్ల - మెచ్చ దేవతలెల్ల

బ్రహ్మ కిచ్చితి వీవు - భళి! యనంగ

నా వేదముల నియ్య - నాచారనిష్ఠల

ననుభవించుచు నుందు - రవనిసురులు

సకలపాపంబులు - సమసిపోవు నటంచు

మనుజు లందఱు నీదు - మహిమ దెలిసి


తే. యుందు రరవిందనయన! నీ - యునికి దెలియు

వారలకు వేగ మోక్షంబు - వచ్చు ననఘ!

భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!

దుష్టసంహార! నరసింహ - దురితదూర!

097 సవరించు

సీ. కూర్మావతారమై - కుధరంబుక్రిందను

గోర్కితో నుండవా - కొమరు మిగుల?

వరహావతారమై - వనభూములను జొచ్చి

శిక్షింపవా హిర - ణ్యాక్షు నపుడు?

నరసింహమూర్తివై - నరభోజను హిరణ్య

కశిపుని ద్రుంపవా - కాంతి మీఱ?

వామనరూపమై - వసుధలో బలిచక్ర

వర్తి నఱంపవా - వైర ముడిగి?


తే. యిట్టి పను లెల్ల జేయగా - నెవరికేని

తగునె నరసింహ! నీకిది - దగును గాక!

భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!

దుష్టసంహార! నరసింహ - దురితదూర!

098 సవరించు

సీ. లక్ష్మీశ! నీదివ్య - లక్షణగుణముల

వినజాల కెప్పుడు - వెఱ్ఱినైతి

నా వెఱ్ఱిగుణములు - నయముగా ఖండించి

నన్ను రక్షింపు మో - నళిననేత్ర!

నిన్ను నే నమ్మితి - నితరదైవముల నే

నమ్మలే దెప్పుడు - నాగశయన!

కాపాడినను నీవె - కష్టపెట్టిన నీవె

నీపాదకమలముల్ - నిరత మేను


తే. నమ్మియున్నాను నీపాద - నళినభక్తి

వేగ దయచేసి రక్షింపు - వేదవేద్య!

భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!

దుష్టసంహార! నరసింహ - దురితదూర!

099 సవరించు

సీ. అమరేంద్రవినుత! ని - న్ననుసరించినవారు

ముక్తి బొందిరి వేగ - ముదముతోను

నీపాదపద్మముల్ - నెఱ నమ్మియున్నాను

నాకు మోక్షం బిమ్ము - నళిననేత్ర!

కాచి రక్షించు నన్ - గడతేర్చు వేగమే

నీ సేవకుని జేయు - నిశ్చలముగ

గాపాడినను నీకు - గైంకర్యపరుడ నై

చెలగి నీపనులను - జేయువాడ


తే. ననుచు బలుమాఱు వేడెద - నబ్జనాభ!

నాకు బ్రత్యక్ష మగుము నిన్ - నమ్మినాను.

భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!

దుష్టసంహార! నరసింహ - దురితదూర!



100 సవరించు

సీ. శేషప్ప యను కవి - చెప్పిన పద్యముల్

చెవుల కానందమై - చెలగుచుండు

నే మనుజుండైన - నెలమి నీ శతకంబు

భక్తితో విన్న స - త్ఫలము గలుగు

జెలగి యీ పద్యముల్ - చేర్చి వ్రాసినవారు

కమలాక్షుకరుణను - గాంతు రెపుడు

నింపుగా బుస్తకం - బెపుడు బూజించిన

దురితజాలంబులు - దొలగిపోవు


తే. నిద్ది పుణ్యాకరం బని - యెపుడు జనులు

గషట మెన్నక పఠియింప - గలుగు ముక్తి.

భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!

దుష్టసంహార! నరసింహ - దురితదూర!

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics