నరసింహ శతకం రెండవ భాగం Narasimha satakam part two
నరసింహ శతకము రెండవ భాగం
041
సీ. ఇలలోన నే జన్మ - మెత్తినప్పటినుండి
బహు గడించితినయ్య - పాతకములు
తెలిసి చేసితి గొన్ని - తెలియజాలక చేసి
బాధ నొందితి నయ్య - పద్మనాభ
అనుభవించెడు నప్పు - దతి ప్రయాసంబంచు
బ్రజలు చెప్పగ జాల - భయము గలిగె
నెగిరి పోవుటకునై - యే యుపాయంబైన
జేసి చూతమటన్న - జేతగాదు
తే. సూర్యశశినేత్ర! నీచాటు - జొచ్చి నాను
కలుషములు ద్రుంచి నన్నేలు - కష్టమనక.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
042
సీ. తాపసార్చిత! నేను - పాపకర్ముడనంచు
నాకు వంకలబెట్ట - బోకుచుమ్మి
నాటికి శిక్షలు - నన్ను చేయుటకంటె
నేడు సేయుము నీవు - నేస్తమనక
అతిభయంకరులైన - యమదూతలకు నన్ను
నొప్పగింపకు మయ్య - యురగశయన!
నీ దాసులను బట్టి - నీవు దండింపంగ
వద్దు వద్దన రెంత - పెద్దలైన
తే. దండ్రివై నీవు పరపీడ - దగులజేయ
వాసిగల పేరు కపకీర్తి - వచ్చునయ్య.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
043
సీ. ధరణిలోపల నేను - తల్లిగర్భమునందు
బుట్టినప్పటినుండి - పుణ్యమెఱుగ
నేకాదశీవ్రతం - బెన్న డుండుగ లేదు
తీర్థయాత్రలకైన - దిరుగలేదు
పారమార్థికమైన - పనులు చేయగలేదు
భిక్ష మొక్కనికైన - బెట్టలేదు
జ్ఞానవంతులకైన - బూని మ్రొక్కగలేదు
ఇతర దానములైన - నియ్యలేదు
తే. నళినదళనేత్ర! నిన్ను నే - నమ్మినాను
జేరి రక్షింపవే నన్ను - శీఘ్రముగను.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
044
సీ. అడవిపక్షుల కెవ్వ - డాహార మిచ్చెను
మృగజాతి కెవ్వడు - మేతబెట్టె
వనచరాదులకు భో - జన మెవ్వ డిప్పించె
జెట్ల కెవ్వడు నీళ్ళు - చేదిపోసె
స్త్రీలగర్భంబున - శిశువు నెవ్వడు పెంచె
ఫణుల కెవ్వడు పోసె - బరగ బాలు
మధుపాళి కెవ్వడు - మకరంద మొనరించె
బసుల కెవ్వ డొసంగె - బచ్చిపూరి
తే. జీవకోట్లను బోషింప - నీవెకాని
వేఱె యొక దాత లేడయ్య - వెదకిచూడ.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
045
సీ. దనుజారి! నావంటి - దాసజాలము నీకు
కోటి సంఖ్య గలరు - కొదువ లేదు
బంట్లసందడివల్ల - బహుపరాకై నన్ను
మఱచి పోకుము భాగ్య - మహిమచేత
దండిగా భృత్యులు - దగిలి నీకుండంగ
బక్కబం టేపాటి - పనికి నగును?
నీవు మెచ్చెడి పనుల్ - నేను జేయగలేక
యింత వృథాజన్మ - మెత్తినాను
తే. భూజనులలోన నే నప్ర - యోజకుడను
గనుక నీ సత్కటాక్షంబు - గలుగజేయు.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
046
సీ. కమలలోచన! నన్ను - గన్నతండ్రివిగాన
నిన్ను నేమఱకుంటి - నేను విడక
యుదరపోషణకునై - యొకరి నే నాశింప
నేర నా కన్నంబు - నీవు నడపు
పెట్టలే నంటివా - పిన్న పెద్దలలోన
దగవు కిప్పుడు దీయ - దలచినాను
ధనము భారంబైన - దలకిరీటము నమ్ము
కుండలంబులు పైడి - గొలుసు లమ్ము
తే. కొసకు నీ శంఖ చక్రముల్ - కుదువబెట్టి
గ్రాసము నొసంగి పోషించు - కపటముడిగి.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
047
సీ. కువలయశ్యామ! నీ - కొలువు చేసిన నాకు
జీత మెందుకు ముట్ట - జెప్పవైతి
మంచిమాటలచేత - గొంచెమియ్యగలేవు
కలహమౌ నిక జుమ్మి - ఖండితముగ
నీవు సాధువు గాన - నింత పర్యంతంబు
చనవుచే నిన్నాళ్లు - జరుపవలసె
నిక నే సహింప నీ - విపుడు నన్నేమైన
శిక్ష చేసిన జేయు - సిద్ధమయితి
తే. నేడు కరుణింపకుంటివా - నిశ్చయముగ
దెగబడితి చూడు నీతోడ - జగడమునకు.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
048
సీ. హరి! నీకు బర్యంక - మైన శేషుడు చాల
బవనము భక్షించి - బ్రతుకుచుండు
ననువుగా నీకు వా - హనమైన ఖగరాజు
గొప్పపామును నోట - గొఱుకుచుండు
అదిగాక నీ భార్య - యైన లక్ష్మీదేవి
దినము పేరంటంబు - దిరుగుచుండు
నిన్ను భక్తులు పిల్చి - నిత్యపూజలు చేసి
ప్రేమ బక్వాన్నముల్ - పెట్టుచుండ్రు
తే. స్వస్థముగ నీకు గ్రాసము - జరుగుచుండు
గాసు నీ చేతి దొకటైన - గాదు వ్యయము.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
049
సీ. పుండరీకాక్ష! నా - రెండు కన్నుల నిండ
నిన్ను జూచెడి భాగ్య - మెన్నడయ్య
వాసిగా నా మనో - వాంఛ దీరెడునట్లు
సొగసుగా నీరూపు - చూపవయ్య
పాపకర్ముని కంట - బడకపోవుదమంచు
బరుషమైన ప్రతిజ్ఞ - బట్టినావె?
వసుధలో బతిత పా - వనుడ వీ వంచు నే
బుణ్యవంతులనోట - బొగడ వింటి
తే. నేమిటికి విస్తరించె నీ - కింత కీర్తి
ద్రోహినైనను నా కీవు - దొరకరాదె?
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
050
సీ. పచ్చి చర్మపు దిత్తి - పసలేదు దేహంబు
లోపల నంతట - రోయ రోత
నరములు శల్యముల్ - నవరంధ్రములు రక్త
మాంసంబు కండలు - మైల తిత్తి
బలువైన యెండ వా - నల కోర్వ దింతైన
దాళలే దాకలి - దాహములకు
సకల రోగములకు - సంస్థానమె యుండు
నిలువ దస్థిరమైన - నీటిబుగ్గ
తే. బొందిలో నుండు ప్రాణముల్ - పోయినంత
గాటికే గాని కొఱగాదు - గవ్వకైన.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
051
సీ. పలురోగములకు నీ - పాదతీర్థమే కాని
వలపు మందులు నాకు - వలదు వలదు
చెలిమి సేయుచు నీకు - సేవ జేసెద గాన
నీ దాసకోటిలో - నిలుపవయ్య
గ్రహభయంబునకు జ - క్రము దలచెదగాని
ఘోరరక్షలు గట్ట - గోరనయ్య
పాముకాటుకు నిన్ను - భజన జేసెదగాని
దాని మంత్రము నేను - తలపనయ్య
తే. దొరికితివి నాకు దండి వై - ద్యుడవు నీవు
వేయికష్టాలు వచ్చినన్ - వెఱవనయ్య.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
052
సీ. కూటికోసరము నే - గొఱగాని జనులచే
బలుగద్దరింపులు - పడగవలసె?
దార సుత భ్రమ - దగిలియుండగగదా
దేశదేశములెల్ల - దిరుగవలసె?
బెను దరిద్రత పైని - బెనగియుండగగదా
చేరి నీచులసేవ - చేయవలసె?
నభిమానములు మది - నంటియుండగగదా
పరుల జూచిన భీతి - పడగవలసె?
తే. నిటుల సంసారవారిధి - నీదలేక
వేయివిధముల నిన్ను నే - వేడుకొంటి.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
053
సీ. సాధు సజ్జనులతో - జగడమాడిన గీడు
కవులతో వైరంబు - గాంచ గీడు
పరమ దీనుల జిక్క - బట్టి కొట్టిన గీడు
భిక్షగాండ్రను దుఃఖ - పెట్ట గీడు
నిరుపేదలను జూచి - నిందజేసిన గీడు
పుణ్యవంతుల దిట్ట - బొసగు గీడు
సద్భక్తులను దిర - స్కారమాడిన గీడు
గురుని ద్రవ్యము దోచు - కొనిన గీడు
తే. దుష్టకార్యము లొనరించు - దుర్జనులకు
ఘనతరంబైన నరకంబు - గట్టిముల్లె.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
054
సీ. పరులద్రవ్యముమీద - భ్రాంతి నొందినవాడు
పరకాంతల నపేక్ష - పడెడువాడు
అర్థుల విత్తంబు - లపహరించెడువాడు
దానమియ్యంగ వ - ద్దనెడివాడు
సభలలోపల నిల్చి - చాడిచెప్పెడివాడు
పక్షపు సాక్ష్యంబు - పలుకువాడు
విష్ణుదాసుల జూచి - వెక్కిరించెడివాడు
ధర్మసాధుల దిట్ట - దలచువాడు
తే. ప్రజల జంతుల హింసించు - పాతకుండు
కాలకింకర గదలచే - గష్టమొందు.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
055
సీ. నరసింహ! నా తండ్రి - నన్నేలు నన్నేలు
కామితార్థము లిచ్చి - కావు కావు
దైత్యసంహార! చాల - దయయుంచు దయయుంచు
దీనపోషక! నీవె - దిక్కు దిక్కు
రత్నభూషితవక్ష! - రక్షించు రక్షించు
భువనరక్షక! నన్ను - బ్రోవు బ్రోవు
మారకోటిసురూప! - మన్నించు మన్నించు
పద్మలోచన! చేయి - పట్టు పట్టు
తే. సురవినుత! నేను నీచాటు - జొచ్చినాను
నా మొఱాలించి కడతేర్చు - నాగశయన!
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
056
సీ. నీ భక్తులను గనుల్ - నిండ జూచియు రెండు
చేతుల జోహారు - సేయువాడు
నేర్పుతో నెవరైన - నీ కథల్ చెప్పంగ
వినయమందుచు జాల - వినెడువాడు
తన గృహంబునకు నీ - దాసులు రా జూచి
పీటపై గూర్చుండ - బెట్టువాడు
నీసేవకుల జాతి - నీతు లెన్నక చాల
దాసోహ మని చేర - దలచువాడు
తే. పరమభక్తుండు ధన్యుండు - భానుతేజ!
వాని గనుగొన్న బుణ్యంబు - వసుధలోన.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
057
సీ. పక్షివాహన! నేను - బ్రతికినన్నిదినాలు
కొండెగాండ్రను గూడి - కుమతినైతి
నన్నవస్త్రము లిచ్చి - యాదరింపుము నన్ను
గన్నతండ్రివి నీవె - కమలనాభ!
మరణ మయ్యెడినాడు - మమతతో నీయొద్ది
బంట్ల దోలుము ముందు - బ్రహ్మజనక!
ఇనజభటావళి - యీడిచికొనిపోక
కరుణతో నాయొద్ద - గావ లుంచు
తే. కొసకు నీ సన్నిధికి బిల్చు - కొనియు నీకు
సేవకుని జేసికొనవయ్య - శేషశయన!
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
058
సీ. నిగమాదిశాస్త్రముల్ - నేర్చిన ద్విజుడైన
యజ్ఞకర్తగు సోమ - యాజియైన
ధరణిలోపల బ్రభా - త స్నానపరుడైన
నిత్యసత్కర్మాది - నిరతుడైన
నుపవాస నియమంబు - లొందు సజ్జనుడైన
గావివస్త్రముగట్టు - ఘనుడునైన
దండిషోడశమహా - దానపరుండైన
సకల యాత్రలు సల్పు - సరసుడైన
తే. గర్వమున గష్టపడి నిన్ను - గానకున్న
మోక్షసామ్రాజ్య మొందడు - మోహనాంగ!
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
059
సీ. పంజరంబున గాకి - బట్టి యుంచిన లెస్స
పలుకునే వింతైన - చిలుకవలెను?
గార్దభంబును దెచ్చి - కళ్లెమింపుగవేయ
దిరుగునే గుఱ్ఱంబు - తీరుగాను?
ఎనుపపోతును మావ - టీ డు శిక్షించిన
నడచునే మదవార - ణంబువలెను?
పెద్దపిట్టను మేత - బెట్టి పెంచిన గ్రొవ్వి
సాగునే వేటాడు - డేగవలెను?
తే. కుజనులను దెచ్చి నీ సేవ - కొఱకు బెట్ట
వాంఛతో జేతురే భక్త - వరులవలెను?
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
060
సీ. నీకు దాసుడ నంటి - నిన్ను నమ్ముకయుంటి
గాన నాపై నేడు - కరుణజూడు
దోసిలొగ్గితి నీకు - ద్రోహ మెన్నగబోకు
పద్మలోచన! నేను - పరుడగాను
భక్తి నీపై నుంచి - భజన జేసెద గాని
పరుల వేడను జుమ్మి - వరము లిమ్ము
దండిదాతవు నీవు - తడవుసేయక కావు
ఘోరపాతకరాశి - గొట్టివైచి
తే. శీఘ్రముగ గోర్కు లీడేర్చు - చింత దీర్చు
నిరతముగ నన్ను బోషించు - నెనరు నుంచు.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
061
సీ. విద్య నేర్చితి నంచు - విఱ్ఱవీగగలేదు
భాగ్యవంతుడ నంచు - బలుకలేదు
ద్రవ్యవంతుడ నంచు - దఱచు నిక్కగలేదు
నిరతదానములైన - నెఱపలేదు
పుత్రవంతుడ నంచు - బొగడుచుండగలేదు
భ్రుత్యవంతుడ నంచు - బొగడలేదు
శౌర్యవంతుడ నంచు - సంతసింపగలేదు
కార్యవంతుడ నంచు - గడపలేదు
తే. నలుగురికి మెప్పుగానైన - నడువలేదు
నళినదళనేత్ర! నిన్ను నే - నమ్మినాను.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
062
సీ. అతిలోభులను భిక్ష - మడుగబోవుట రోత
తనద్రవ్య మొకరింట - దాచ రోత
గుణహీను డగువాని - కొలువు గొల్చుట రోత
యొరుల పంచలక్రింద - నుండ రోత
భాగ్యవంతునితోడ - బంతమాడుట రోత
గుఱిలేని బంధుల - గూడ రోత
ఆదాయములు లేక - యప్పుదీయుట రోత
జార చోరుల గూడి - చనుట రోత
తే. యాదిలక్ష్మీశ! నీబంట - నైతినయ్య!
యింక నెడబాసి జన్మంబు - లెత్త రోత.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
063
సీ. వెఱ్ఱివానికి నేల - వేదాక్షరంబులు?
మోటువానికి మంచి - పాట లేల?
పసులకాపరి కేల - పరతత్త్వబోధలు?
విటకాని కేటికో - విష్ణుకథలు?
వదరు శుంఠల కేల - వ్రాత పుస్తకములు?
తిరుగు ద్రిమ్మరి కేల - దేవపూజ?
ద్రవ్యలోభికి నేల - ధాతృత్వ గుణములు?
దొంగబంటుకు మంచి - సంగ తేల?
తే. క్రూరజనులకు నీమీద - గోరి కేల?
ద్రోహి పాపాత్మునకు దయా - దుఃఖ మేల?
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
064
సీ. నా తండ్రి నాదాత - నాయిష్టదైవమా
నన్ను మన్ననసేయు - నారసింహ!
దయయుంచు నామీద - దప్పులన్ని క్షమించు
నిగమగోచర! నాకు - నీవె దిక్కు
నే దురాత్ముడ నంచు - నీమనంబున గోప
గింపబోకుము స్వామి! - కేవలముగ
ముక్తిదాయక నీకు - మ్రొక్కినందుకు నన్ను
గరుణించి రక్షించు - కమలనాభ!
తే. దండిదొర వంచు నీవెంట - దగిలినాను
నేడు ప్రత్యక్షమై నన్ను - నిర్వహింపు.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
065
సీ. వేమాఱు నీకథల్ - వినుచు నుండెడివాడు
పరుల ముచ్చటమీద - భ్రాంతి పడడు
అగణితంబుగ నిన్ను - బొగడ నేర్చినవాడు
చెడ్డమాటలు నోట - జెప్పబోడు
ఆసక్తిచేత ని - న్ననుసరించెడివాడు
ధనమదాంధులవెంట - దగుల బోడు
సంతసంబున నిన్ను - స్మరణజేసెడివాడు
చెలగి నీచులపేరు - దలపబోడు
తే. నిన్ను నమ్మిన భక్తుండు - నిశ్చయముగ
గోరి చిల్లర వేల్పుల - గొల్వబోడు.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
066
సీ. నే నెంత వేడిన - నీ కేల దయరాదు?
పలుమాఱు పిలిచిన - బలుక వేమి?
పలికిన నీ కున్న - పద వేమిబోవు? నీ
మోమైన బొడచూప - వేమి నాకు?
శరణు జొచ్చినవాని - సవరింపవలె గాక
పరిహరించుట నీకు - బిరుదు గాదు
నీదాసులను నీవు - నిర్వహింపక యున్న
బరు లెవ్వ రగుదురు - పంకజాక్ష!
తే. దాత దైవంబు తల్లియు - దండ్రి వీవె
నమ్మియున్నాను నీపాద - నళినములను.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
067
సీ. వేదముల్ చదివెడు - విప్రవర్యుండైన
రణము సాధించెడు - రాజెయైన
వర్తకకృషికుడౌ - వైశ్యముఖ్యుండైన
బరిచగించెడు శూద్ర - వర్యుడయిన
మెచ్చుఖడ్గము బట్టి - మెఱయు మ్లేచ్ఛుండైన
బ్రజల కక్కఱపడు - రజకుడైన
చర్మ మమ్మెడి హీన - చండాలనరుడైన
నీ మహీతలమందు - నెవ్వడైన
తే. నిన్ను గొనియాడుచుండెనా - నిశ్చయముగ
వాడు మోక్షాధికారి యీ - వసుధలోన.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
068
సీ. సకలవిద్యలు నేర్చి - సభ జయింపగవచ్చు
శూరుడై రణమందు - బోరవచ్చు
రాజరాజై పుట్టి - రాజ్య మేలగవచ్చు
హేమ గోదానంబు - లియ్యవచ్చు
గగనమం దున్న చు - క్కల నెంచగావచ్చు
జీవరాసుల పేళ్లు - చెప్పవచ్చు
నష్టాంగయోగము - లభ్యసింపగవచ్చు
మేక రీతిగ నాకు - మెసవవచ్చు
తే. తామరసగర్భ హర పురం - దరులకైన
నిన్ను వర్ణింప దరమౌనె - నీరజాక్ష!
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
069
సీ. నరసింహ! నీవంటి - దొరను సంపాదించి
కుమతి మానవుల నే - గొల్వజాల
నెక్కు వైశ్వర్యంబు - లియ్యలేకున్నను
బొట్టకుమాత్రము - పోయరాదె?
ఘనముగా దిది నీకు - కరవున బోషింప
గష్ట మెంతటి స్వల్ప - కార్యమయ్య?
పెట్టజాలక యేల - భిక్షమెత్తించెదు
నన్ను బీదను జేసి - నా వదేమి?
తే. అమల! కమలాక్ష! నే నిట్లు - శ్రమపడంగ
గన్నులకు బండువై నీకు - గానబడునె?
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
070
సీ. వనరుహనాభ! నీ - వంక జేరితి నేను
గట్టిగా నను గావు - కావు మనుచు
వచ్చినందుకు వేగ - వరము లియ్యకకాని
లేవబోయిన నిన్ను - లేవనియ్య
గూర్చుండబెట్టి నీ - కొంగు గట్టిగ బట్టి
పుచ్చుకొందును జూడు - భోగిశయన!
యీవేళ నీ కడ్డ - మెవరు వచ్చినగాని
వారికైనను లొంగి - వడకబోను
తే. గోపగాడను నీవు నా - గుణము తెలిసి
యిప్పుడే నన్ను రక్షించి - యేలుకొమ్ము.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
071
సీ. ప్రహ్లాదు డేపాటి - పైడి కానుక లిచ్చె?
మదగజం బెన్నిచ్చె - మౌక్తికములు?
నారదుం డెన్నిచ్చె - నగలు రత్నంబు? ల
హల్య నీ కే యగ్ర - హార మిచ్చె?
ఉడుత నీ కేపాటి - యూడిగంబులు చేసె?
ఘనవిభీషణు డేమి - కట్న మిచ్చె?
పంచపాండవు లేమి - లంచ మిచ్చిరి నీకు?
ద్రౌపది నీ కెంత - ద్రవ్య మిచ్చె?
తే. నీకు వీరంద ఱయినట్లు - నేను గాన?
యెందు కని నన్ను రక్షింప - విందువదన!
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
072
సీ. వాంఛతో బలిచక్ర - వర్తిదగ్గర జేరి
భిక్షమెత్తితి వేల - బిడియపడక?
యడవిలో శబరి ది - య్యని ఫలా లందియ్య
జేతులొగ్గితి వేల - సిగ్గుపడక?
వేడ్కతో వేవేగ - విదురునింటికి నేగి
విందుగొంటి వదేమి - వెలితిపడక?
అడుకు లల్పము కుచే - లుడు గడించుక తేర
బొక్కసాగితి వేల - లెక్కగొనక?
తే. భక్తులకు నీవు పెట్టుట - భాగ్యమౌను
వారి కాశించితివి తిండి - వాడ వగుచు.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
073
సీ. స్తంభమం దుదయించి - దానవేంద్రుని ద్రుంచి
కరుణతో బ్రహ్లాదు - గాచినావు
మకరిచే జిక్కి సా - మజము దుఃఖించంగ
గృపయుంచి వేగ ర - క్షించినావు
శరణంచు నా విభీ - షణుడు నీ చాటున
వచ్చినప్పుడె లంక - నిచ్చినావు
ఆ కుచేలుడు చేరె - డటుకు లర్పించిన
బహుసంపదల నిచ్చి - పంపినావు
తే. వారివలె నన్ను బోషింప - వశముగాదె?
యంత వలపక్ష మేల శ్రీ - కాంత! నీకు?
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
074
సీ. వ్యాసు డే కులమందు - వాసిగా జన్మించె?
విదురు డే కులమందు - వృద్ధి బొందె?
గర్ణు డేకులమందు - ఘనముగా వర్ధిల్లె?
నా వసిష్ఠుం డెందు - నవతరించె?
నింపుగా వాల్మీకి - యే కులంబున బుట్టె?
గుహు డను పుణ్యు డే - కులమువాడు?
శ్రీశుకు డెక్కట - జెలగి జన్మించెను?
శబరి యేకులమందు - జన్మమొందె?
తే. నే కులంబున వీ రింద - ఱెచ్చినారు?
నీకృపాపాత్రులకు జాతి - నీతు లేల?
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
075
సీ. వసుధాస్థలంబున - వర్ణహీనుడు గాని
బహుళ దురాచార - పరుడు గాని
తడసి కాసియ్యని - ధర్మశూన్యుడు గాని
చదువనేరని మూఢ - జనుడు గాని
సకలమానవులు మె - చ్చని కృతఘ్నుడు గాని
చూడ సొంపును లేని - శుంఠ గాని
అప్రతిష్ఠలకు లో - నైన దీనుడు గాని
మొదటి కే మెఱుగని - మోటు గాని
తే. ప్రతిదినము నీదు భజనచే - బరగునట్టి
వాని కే వంక లేదయ్య - వచ్చు ముక్తి.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
076
సీ. ఇభకుంభములమీది - కెగిరెడి సింగంబు
ముట్టునే కుఱుచైన - మూషకమును?
నవచూతపత్రముల్ - నమలుచున్న పికంబు
గొఱుకునే జిల్లేడు - కొనలు నోట?
అరవిందమకరంద - మనుభవించెడి తేటి
పోవునే పల్లేరు - పూలకడకు?
లలిత మైన రసాల - ఫలము గోరెడి చిల్క
మెసవునే భమత ను - మ్మెత్తకాయ?
తే. నిలను నీకీర్తనలు పాడ - నేర్చినతడు
పరులకీర్తన బాడునే - యరసి చూడ?
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
077
సీ. సర్వేశ! నీపాద - సరసిజద్వయమందు
జిత్త ముంపగలేను - జెదరకుండ
నీవైన దయయుంచి - నిలిచి యుండెడునట్లు
చేరి నన్నిపు డేలు - సేవకుడను
వనజలోచన! నేను - వట్టి మూర్ఖుడ జుమ్మి
నీస్వరూపము జూడ - నేర్పు వేగ
తన కుమారున కుగ్గు - తల్లి వోసినయట్లు
భక్తిమార్గం బను - పాలు పోసి
తే. ప్రేమతో నన్ను బోషించి - పెంచుకొనుము
ఘనత కెక్కించు నీదాస - గణములోన.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
078
సీ. జీమూతవర్ణ! నీ - మోముతో సరిరాక
కమలారి యతికళం - కమును బడసె
సొగసైన నీ నేత్ర - యుగముతో సరిరాక
నళినబృందము నీళ్ల - నడుమ జేరె
గరిరాజవరద! నీ - గళముతో సరిరాక
పెద్దశంఖము బొబ్బ - పెట్ట బొడగె
శ్రీపతి! నీదివ్య - రూపుతో సరి రాక
పుష్పబాణుడు నీకు - బుత్రు డయ్యె
తే. నిందిరాదేవి నిన్ను మో - హించి విడక
నీకు బట్టమహిషి యయ్యె - నిశ్చయముగ.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
079
సీ. హరిదాసులను నింద - లాడకుండిన జాలు
సకల గ్రంథమ్ములు - చదివినట్లు
భిక్ష మియ్యంగ ద - ప్పింపకుండిన జాలు
జేముట్టి దానంబు - చేసినట్లు
మించి సజ్జనుల వం - చించకుండిన జాలు
నింపుగా బహుమాన - మిచ్చినట్లు
దేవాగ్రహారముల్ - దీయకుండిన జాలు
గనకకంబపు గుళ్లు - గట్టినట్లు
తే. ఒకరి వర్శాశనము ముంచ - కున్న జాలు
బేరుకీర్తిగ సత్రముల్ - పెట్టినట్లు.
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
080
సీ. ఇహలోకసౌఖ్యము - లిచ్చగించెద మన్న
దేహ మెప్పటికి దా - స్థిరత నొంద
దాయుష్య మున్న ప - ర్యంతంబు పటుతయు
నొక్కతీరున నుండ - దుర్విలోన
బాల్యయువత్వదు - ర్బలవార్ధకము లను
మూటిలో మునిగెడి - ముఱికికొంప
భ్రాంతితో దీని గా - పాడుద మనుమొన్న
గాలమృత్యువుచేత - గోలుపోవు
తే. నమ్మరా దయ్య! యిది మాయ - నాటకంబు
జన్మ మిక నొల్ల న న్నేలు - జలజనాభ!
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
Comments
Post a Comment