సంన్యాస యోగం తాత్పర్యం తో samnyasa yogam with Telugu lyrics and meaning

అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః
సంన్యాస యోగం తాత్పర్యం తో samnyasa yogam with Telugu lyrics and meaning

అర్జున ఉవాచ|
సంన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి|
యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్|| 5-1 ||
అర్జునుడు ఇలా అడిగాడు: - ఓ కృష్ణా ఒకసారి కర్మ సన్యాసాన్ని, మరొకసారి కర్మ యోగాన్ని పొగుడుతున్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో దానిని నాకు తెలుపుము.

శ్రీభగవానువాచ|
సంన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ|
తయోస్తు కర్మసంన్యాసాత్కర్మయోగో విశిష్యతే|| 5-2 ||
శ్రీ కృష్ణుడన్నాడు: - కర్మసన్యాసమూ, కర్మయోగమూ రెండూ కూడా ఉత్తమమైన ఆనందానికి తీసుక వెళతాయి. ఐతే ఈ రెండింటిలో కర్మ యోగము కర్మసన్యాసము కంటే మెరుగైనది.

జ్ఞేయః స నిత్యసంన్యాసీ యో న ద్వేష్టి న కాఙ్క్షతి|
నిర్ద్వన్ద్వో హి మహాబాహో సుఖం బన్ధాత్ప్రముచ్యతే|| 5-3 ||
ఎవరైతే ద్వేషించకుండా, కాంక్షించకుండా ఉంటారో, అతడే నిత్యసన్యాసీ అని తెలుసుకో. ఓ మహాబాహూ! ద్వందాలు లేనివాడే బంధాలనుండి తేలికగా విడుదల పొందుతాడు.

సాఙ్ఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదన్తి న పణ్డితాః|
ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విన్దతే ఫలమ్|| 5-4 ||
పసివారు (అజ్ఞానులు) మాత్రమే సాంఖ్యమూ, యోగమూ వేరు వేరు అని అంటారు. విద్వాంసులు అనరు. ఎవరైతే ఒకదానిలో సరిగా నిలబడ్డారో అతడికి రెండింటి ఫలం దొరుకుతుంది.

యత్సాఙ్ఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే|
ఏకం సాఙ్ఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి|| 5-5 ||
సాంఖ్యులచేత ఏస్థానం పొందబడుతుందో, ఆస్థానమే యోగులుచేత పొందబడుతుంది. సంఖ్య యోగాన్ని ఒకటిగా ఎవరు చూస్తున్నారో వాళ్ళే నిజమైన దృష్టి కలిగిన వారు.

సంన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః|
యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్ఛతి|| 5-6 ||
ఓ మహాబాహో! కర్మయోగం చెయ్యని వాళ్ళకు కర్మసన్యాసాన్ని సాధించడం కష్టం. కర్మ యోగంతో కూడిన మానవుడు త్వరలోనే తేలికగా బ్రహ్మమును చేరుకుంటాడు.

యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేన్ద్రియః|
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే|| 5-7 ||
కర్మ యోగంతో కూడుకుని, విశుద్ధం ఐన బుద్ధితో మనస్సు, ఇంద్రియాలను జయించి, అన్ని ప్రాణులలోని ఆత్మను తన ఆత్మగా తెలుసుకున్న వాడు కర్మలను చేసినా బంధంలో చిక్కుకోడు

నైవ కిఞ్చిత్కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్|
పశ్యఞ్శృణ్వన్స్పృశఞ్జిఘ్రన్నశ్నన్గచ్ఛన్స్వపఞ్శ్వసన్|| 5-8 ||
పరమసత్యాన్ని ఎరిగిన యోగయుక్తుడు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, స్పృసిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పడుకుంటున్నఫ్ఫుడు, ఊపిరి పీలుస్తున్నప్పుడు

ప్రలపన్విసృజన్గృహ్ణన్నున్మిషన్నిమిషన్నపి|
ఇన్ద్రియాణీన్ద్రియార్థేషు వర్తన్త ఇతి ధారయన్|| 5-9 ||

మాట్లాడుతున్నప్పుడు, వదిలేస్తున్నప్పుడు, పట్టుకుంటున్నప్పుడు. కనురెప్పలు తెరుస్తూ మూస్తున్నప్పుడు ఇంద్రియాలు విషయాలలో సంచరిస్తున్నాయని తాను ఏమీ చేయడం లేదనీ భావిస్తాడు.

బ్రహ్మణ్యాధాయ కర్మాణి సఙ్గం త్యక్త్వా కరోతి యః|
లిప్యతే న స పాపేన పద్మపత్రమివామ్భసా|| 5-10 ||
ఎవరైతే కర్మలను బ్రహ్మముకు అర్పించి, సంగభావాన్ని వదిలి పనిచేస్తారో, అట్టివాడు నీటిలో ఉన్న తామరాకు ఎలా నీటివలన తాకబడదో అలాగే పాపం చేత తాకబడడు.

కాయేన మనసా బుద్ధ్యా కేవలైరిన్ద్రియైరపి|
యోగినః కర్మ కుర్వన్తి సఙ్గం త్యక్త్వాత్మశుద్ధయే|| 5-11 ||
యోగులు తమ అంతఃకరణ శుద్ధి కోసం సంగభావాన్ని వదిలి కేవలం శరీర, మనో, బుద్ధి. ఇంద్రియాలతో మాత్రమే కర్మలు చేస్తారు.

యుక్తః కర్మఫలం త్యక్త్వా శాన్తిమాప్నోతి నైష్ఠికీమ్|
అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే|| 5-12 ||

యోగయుక్తుడైన వాడు కర్మఫలాన్ని వదిలి పెట్టి శాశ్వత మైన శాంతిని పొందుతాడు. యోగికానివాడు కోరికల కారణంగా కర్మఫలానికి అతుక్కు పోయి బంధింప బడతాడు.

సర్వకర్మాణి మనసా సంన్యస్యాస్తే సుఖం వశీ|
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్|| 5-13 ||
మానసికంగా అన్ని కర్మల్ను సన్యసించి, పూర్తిగా తనను తాను స్వాధీనంలో ఉంచుకున్న దేహధారి, తొమ్మిది ద్వారాల పురంలో తాను ఏమీ చేయకుండా, ఎవరిచేత చేయించ కుండా సుఖంగా ఉంటాడు.

న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః|
న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే|| 5-14 ||

భగవంతుడు కర్తృత్వాన్ని గానీ, కర్మలని గానీ సృజించడం లేదు. కర్మ ఫలంతో సంయోగాన్ని ఆయన చేయడు. ప్రకృతే ఆ ప్రకారంగా వ్యవహరిస్తుంది.

నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః|
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యన్తి జన్తవః|| 5-15 ||
భగవంతుడు పాపాలను కాని, పుణ్యాలని కాని స్వీకరించడు. జ్ఞానం అజ్ఞానంచేత కప్పబడుతుంది. అందుచేత ప్రాణులు భ్రాంతులౌతారు.

జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః|
తేషామాదిత్యవజ్జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్|| 5-16 ||
ఎవరిలో ఐతే సమగ్రమైన జ్ఞానం ద్వారా అజ్ఞానం నాశనం చేయబడినదో వారిలో ఆ పరమాత్మ జ్ఞానము సూర్యునివలె ప్రకాశింప బడుతుంది.

తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్ఠాస్తత్పరాయణాః|
గచ్ఛన్త్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః|| 5-17 ||
ఆత్మలోనే బుద్ధిని నిలిపి, ఆత్మభావంతో మనసు నింపి, ఆత్మనే అంతిమ లక్ష్యంగా పెట్టుకుని అత్మాభ్యాసం చేసేవాళ్ళు పాపములు నశింప బడిన వారై తిరిగిరాని స్థితి ని పొందుతారు.

విద్యావినయసమ్పన్నే బ్రాహ్మణే గవి హస్తిని|
శుని చైవ శ్వపాకే చ పణ్డితాః సమదర్శినః|| 5-18 ||
మహాత్ములు విద్యా వినయాలతో కూడిన బ్రాహ్మణుడిలో, గోవులో, ఏనుగులో, కుక్కలో, కుక్కమాంసాన్ని వండుకుని తినే చంఢాలునిలో కూడా పండితులు సమాన తత్వాన్నే చూస్తారు.

ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః|
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః|| 5-19 ||
ఎవరి మనస్సు సామ్యస్థితిలో నిలిచి ఉంటుందో, వారు ఈ శరీరంలో ఉండగానే సంసారాన్ని జయిస్తారు. నిర్దోషమైన బ్రహ్మము అన్నింటా సమంగా ఉన్నందున వాళ్ళు కూడా బ్రహ్మమంలోనే నిలిచి ఉంటారు.

న ప్రహృష్యేత్ప్రియం ప్రాప్య నోద్విజేత్ప్రాప్య చాప్రియమ్|
స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః|| 5-20 ||
స్థిరమైన బుద్ధితో, బ్రాంతి రహితుడై బ్రహ్మతత్వంలోనిలిచి ఉన్న బ్రహ్మజ్ఞాని ప్రియమైనది లభించినపుడు సంతోషించడు అప్రియమైనది లభించినప్పుడు ఉద్వేగాన్ని పొందడు.

బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విన్దత్యాత్మని యత్సుఖమ్|
స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే|| 5-21 ||
బాహ్య స్పర్శలో తగుల్కోనివాడు, ఆత్మలో ఉండే సుఖాన్ని పొందుతాడు. బ్రహ్మతత్వానుసంధానంలో నిలిచిన ఆ యోగి అనంతమైన ఆనందాన్ని పొందుతాడు.

యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే|
ఆద్యన్తవన్తః కౌన్తేయ న తేషు రమతే బుధః|| 5-22 ||
కుంతీకుమారా! బాహ్య విషయ స్పర్శలవల్ల జనించేభోగాలన్నీ దుఃఖాలకు మూలమే. ఆది, అంతములతో కూడుకున్న ఆ క్షణిక సుఖాలలో వివేకవంతుడు రమించడు.

శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్|
కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః|| 5-23 ||
ఏవరైతే ఈ శరీరం ఉండగానే కామక్రోధాల నుండి పుట్టిన ప్రేరణలని తట్టుకోవడానికి సమర్ధుడౌతాడొ, అతడే యోగి, అతడే సుఖవంతుడు ఔతాడు.

యోऽన్తఃసుఖోऽన్తరారామస్తథాన్తర్జ్యోతిరేవ యః|
స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోऽధిగచ్ఛతి|| 5-24 ||
ఎవరైతే తనలోనే సుఖాన్ని పొందుతూ, తనలో తాను ఆనందిస్తూ తనలో నే జ్ఞాన జ్యోతిని నిలుపుకున్న యోగి బ్రహ్మ స్వరూపుడై మోక్షాన్ని పొందుతాడు.

లభన్తే బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః|
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః|| 5-25 ||
కల్మషాలు నశించి, భేదభావం తొలగిపోయి, మనస్సుని నిగ్రహించి, అన్ని ప్రాణుల హితాన్ని కోరే ఋషులు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు

కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసామ్|
అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్|| 5-26 ||
కామక్రోధాలనుండి విడిపడి, మనస్సును జయించి, ఆత్మ స్వరూపాన్ని ఎరిగిన యతులకు బ్రహ్మ నిర్వాణస్థితి అంతటా ఉంటుంది.

స్పర్శాన్కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాన్తరే భ్రువోః|
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యన్తరచారిణౌ|| 5-27 ||
బాహ్యస్పర్శలన్నీ అరికట్టి, దృష్టిని భ్రకుటి మీద నిలిపి , నాసికలో సంచరించేప్రాణాపాలనుసమానం చేసి

యతేన్ద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః|
విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః|| 5-28 ||
ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి, మోక్షమే తన అంతిమ లక్ష్యంగా పెట్టుకుని కోరికలను, భయమును, కోపాన్ని వదిలిన ఋషి ఎప్పుడూ ముక్తుడే.

భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్|
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాన్తిమృచ్ఛతి|| 5-29 ||
యజ్ఞాలకు తపస్సులకి భోక్తగా, అన్ని లోకాలకు ప్రభువుగా, అన్ని ప్రాణుల హితం కోరేవాడిగా నన్ను తెలుసుకున్న వాడు శాశ్విత శాంతి పొందుతాడు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
సంన్యాసయోగో నామ పఞ్చమోऽధ్యాయః|| 5 ||

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

Sri venkateshwara suprabatam with Telugu lyrics and meaning శ్రీవేంకటేశ్వర సుప్రభాతం విత్ మీనీంగ్

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu