శ్రీ కాళహస్తీశ్వర శతకము మూడవ భాగం Sri kaalahastiswara satakam part three

శ్రీ కాళహస్తీశ్వర శతకము మూడవ భాగం


   వేధం దిట్టగరాదు భువిలో విద్వాంసులం జేయునే
   లా ధీచాతురిఁ జేసెఁ జేసినగులా మాపాటనే పోక క్షు
   ద్బాధాదుల్ కలిగింపనేల యది కృత్యంబైన దుర్మార్గులన్
   జే ధాత్రీశులఁ జేయనేటికకటా శ్రీకాళహస్తీశ్వరా!  (81)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! బ్రహ్మదేవున్ని తిట్టకూడదు కానీ, ఈ సృష్టిలో ఆయన విద్వాంసులను సృష్టించుట ఎందుకు? పోనీ సృష్టించినా వారికి ఆకలి బాధలు కలుగజేయుట ఎందుకు? వీటిని తీర్చగలిగికూడా తీర్చని దుష్టులను రాజులు చేయుట ఎందుకు స్వామీ

   పుడమిన్నిన్నొక బిల్వపత్రమున నేఁ బూజించి పుణ్యంబునున్
   బడయన్నేరక పెక్కు దైవములకున్ బప్పుల్ ప్రసాదంబులున్
   గుడుముల్ దోసెలు సారెసత్తులడుకుల్ గుగ్గిళ్ళునుం బెట్టుచున్ 
   జెడి యెందుం గొఱగాకపోదు రకటా శ్రీకాళహస్తీశ్వరా! (82)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! జనులు భూమిలో భక్తసులభుడవైన నిన్ను ఒక్క బిల్వపత్రముతో పూజించక ఇతర దేవతలకు నానావిధములైన ప్రసాదములు పెట్టి చెడి ఎందుకూ కొరగాకుండా పోవుచున్నారు కదా

   విత్తజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షాంబువుల్
   మత్తత్వంబు తదంకురం బనృతముల్ మాఱాకులత్యంత దు
   ర్వృత్తుల్పువ్వులు పండ్లు మన్మథ ముఖావిర్భూత దోషంబులున్
   జిత్తాభ్యున్నత నింబ భూజమునకున్ శ్రీకాళహస్తీశ్వరా!  (83)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నా మనస్సు చేదు వేపవృక్షము వంటిది. దీనికి పాదు ధనమందు ఆశ, అహంకారము నీరు, మదము దీని మొలకలు, అసత్యములు మారాకులు, అత్యంత క్రూరపనులు పువ్వులు, కామవికారము పండ్లు. (ఇది నీ చింతనామృతము ఎట్లు స్వీకరించునయ్యా)

   నీపైఁ గావ్యము చెప్పుచున్న యతఁడు న్నీపద్యముల్ వ్రాసియి
   మ్మా పాఠంబొనరింతునన్నయతఁడు మంజుప్రబందంబు ని
   ష్టాపూర్తినబఠియించుచున్న యతఁడున్సద్బాందవుల్గాక చీ
   చీ పృష్ఠాగతబాంధవంబు నిజమా శ్రీకాళహస్తీశ్వరా!  (84)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నీపైని పద్యములు వ్రాసి ఇచ్చిన చదివెదనని చెప్పువాడు, నిన్నుగురించిన పురాణముల పఠనము చేయగోరువాడు నిజమైన బంధువులు కానీ నాకు వెనుకటి సంబంధముల, పుట్టుకవల్ల అయినవారు నాకు బంధువులా ప్రభో?

   సంపద్వర్గముఁ బాఱద్రోలి రిపులన్ జంకించి యాకాంక్షలన్
   దంపుల్వెట్టి కళంకముల్నఱికి బంధక్లేశదోషంబులన్
   జింపుల్చేసి వయోవిలాసములు సంక్షేపించి భూతంబులన్
   జెంపల్వేయక నిన్నుఁగాననగునా శ్రీకాళహస్తీశ్వరా!  85)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! సంపదలను త్యజించి, అరిషడ్వర్గములను భేదించి, ఆశలను పక్కకుపెట్టి, పాపములను ప్రక్షాళన గావించుకుని, బంధుబాధలను విడిచి, వయస్సు దాని విలాసములను వదులుకుని, పంచభూతాత్మకమైన వాసనలను పారద్రోలిన గానీ నిన్ను చూడగలనా ప్రభో?

   రాజశ్రేణికి దాసులై సిరులఁ గోరం జేరఁగా సౌఖ్యమో
   యీ జన్మంబు తరింపఁ జేయఁగల నిన్నేపొద్దు సేవించు ని
   ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరౌ మానవుల్పాపరా
   జీజాతాతి మదాంధబుద్ధులగుచున్ శ్రీకాళహస్తీశ్వరా!  (86)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ధనముకై రాజుల పంచన పడి బ్రతుకుట సుఖమా నిరంతర సుఖదాయకుడవగు నీ సేవ సౌఖ్యమా? ఈ విషయమును తెలుసుకోలేక మనుషులు పాపముల వలన గ్రుడ్డివారై జీవించుచున్నారు కదా ప్రభో

   నిన్నంజూడరో మొన్నఁజూడరొజనుల్ నిత్యంబుఁజావంగ నా
   పన్నుల్గన్న నిధానమయ్యెడి ధనభ్రాంతి న్విసర్జింప లే
   కున్నా రెన్నఁడు గందురిఁకమర్త్యుల్ గొల్వరేమో నినున్
   జిన్నంబుచ్చక ప్రోవకుండు నెడలన్ శ్రీకాళహస్తీశ్వరా!  (87)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! రోజూ చస్తున్నవారిని చూసి కూడా మనుషులు నిన్ను కొలవలేక ధనభ్రాంతి విసర్జించలేక ఉన్నారు. వారికింక ఎప్పటికి వచ్చునొ నీ పాదసంసేవాసక్తి. కానీ నీవు మాత్రము వారు నిన్ను కొలువని కారణమున వారి చేయి విడువకు ప్రభో


   వన్నే యేనుఁగుతోలు దుప్పటము బువ్వా కాలకూతంబు చే
   గిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మే
   ల్నిన్నీలాగున నుంటయున్ దెలిసియు న్నీపాదపద్మంబు చే
   ర్చె నారాయణుఁడెట్లు మానసముఁ దా శ్రీకాళహస్తీశ్వరా!  (88)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నీవు కట్టునది ఏనుగుచర్మము, ఆహారమా కాలకూటవిషము, చేతిలో బ్రహ్మదేవుని కపాలము, మెడలో భీకరమైన సర్పము. ఇంత ఉగ్రమైన ఆకారము కలిగిన నిన్ను చూసి కూడా ఆ శ్రీమన్నారాయణుడు సదా తన మనస్సును నీ ధ్యానమందు ఏ విధముగా నిలిపినాడో కదా ప్రభో?


   ద్వారద్వారములందుఁ గంచుకి జనవ్రాతంబు దండంబులున్
   దోరంతస్థలి బగ్గనం బొడుచుచున్ దుర్బాషలాడన్మఱిన్
   వారిన్ బ్రార్థనచేసి రాజులకు సేవల్సేయగాఁ బోరు ల
   క్ష్మీరాజ్యంబును గోరి నీ పరిజనుల్ శ్రీకాళహస్తీశ్వరా! (89)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! రాజసందర్శనార్థము పోవు జనులు అక్కడ కావలివాడు కట్టె తీసుకుని అదిలిస్తూ లోనికి విడువక నానా దుర్భాషలు ఆడుచూ ఉన్నా వారిని బ్రతిమాలి లోనికి వెళ్లి రాజాశ్రయము పొంది సంపదలు పొందవలెనని జనులు ఆశిస్తూ ఉంటారు. కానీ నీ సేవాసక్తులైన జనులు మాత్రము అట్టి తుచ్చ సుఖములను ఆశింపరు.

   ఊరూరన్ జనులెల్ల భిక్షమిడరో యుండన్ గుహల్గల్గవో
   చీరానీకము వీధులన్దొరకదో శీతామృతస్వచ్ఛ వాః
   పూరం బేఱులఁపాఱదో తపసులం బ్రోవంగ నీవోపవో
   చేరం బోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా!  (90)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! తిండికి ప్రజలు ఊరూరా భిక్ష పెట్టరా? ఉండుటకు గుహలు లేవా? కట్టుకొను బట్టలు వీధి అంగళ్ళలో దొరకవా? ఊరి సెలయేళ్లయందు త్రాగుటకు స్వచ్ఛమైన నీరు పారదా? తపస్సు చేసుకునే వారికి నీవు అండగా లేవా? ఇన్ని ఉన్నా రాజుల ప్రాపకము గోరి జనులు ఎందుకు తిరిగెదరో స్వామీ?

   దయసేయండని కొందఱాడుదురు నిత్యంబున్నినున్గొల్చుచున్
   నియమంబెంతొ ఫలంబు నంతియకదా నీవీయు పిండెంతొయం
   తియకా రొట్టె మదిం దళంబశనబుద్ధిం జూడనేలబ్బు స
   త్క్రియలన్నిన్ను భజింపకిష్టసుఖముల్ శ్రీకాళహస్తీశ్వరా!  (91)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! "మాపై దయ లేదా" అని కొందఱు నిన్ను నిత్యమూ కొలుచుచూ, కానీ వారి భక్తి ఏపాటిదో నీ కరుణా వారిపై అంతే కదా. పిండెంతో రొట్టె అంతే అన్న చందమున.

   అరావం బుదయించెఁ దారకముగా నాత్మాభ్రవీధిన్మహా
   కారోకారమకారయుక్తమగు నోంకారాభిధానంబు చే 
   న్నారున్విశ్వ మనంగఁ దన్మహిమచే నా నాదబిందుల్సుఖ 
   శ్రీరంజిల్లఁ గడంగు నీవదె సుమీ శ్రీకాళహస్తీశ్వరా!  (92)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! అకార, ఉకార మకార స్వరూపమైన ఓంకారరూపుడవు నీవే ('ఓమిత్యేకాక్షరం బ్రహ్మ' అను ప్రణవోక్తి మూలముగా). నీ మీదనే విశ్వమంతా నడుచుచున్నది. ఆ ఓంకారనాదము అపౌరుషేయమై అభ్రవీధిలో ఉదయించినది.

   నీభక్తుల్పదివేలభంగుల నినున్ సేవింపుచున్ వేడఁగా 
   లోభంబేటికి వారి కోర్కుల్ కృపాళుత్వంబునన్ తీర్ప రా
   దా భవ్యంబుఁ దలంచిచూడు పరమార్థంబిచ్చి పొమ్మన్న నీ
   శ్రీభండారములోఁ గొఱంతపడునా శ్రీకాళహస్తీశ్వరా!  (93)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! వేలవిధములుగా నీ భక్తులు నిన్ను సేవించుచూ ఉంటే వారికి పరమార్థము దయచేసి వారిని ఆదుకోరాదా ప్రభో? వారికి కోరిన కోర్కెలు తీరిస్తే నీ ఆస్తి ఎమన్నా కరిగిపోతుందా స్వామీ?

   మొదలన్భక్తుల కిచ్చినాఁడవుకదా మోక్షంబునేఁడేమయా
   ముదియంగా ముదియంగఁబుట్టె ఘనమౌమోహంబు లోభంబు న
   న్నది సత్యంబు కృపందలంప వొకపుణ్యాత్ముండు నిన్నాత్మఁ గొ
   ల్చి దినంబుల్మొఱవెట్టగాఁ గటకటా శ్రీకాళహస్తీశ్వరా!  (94)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! మొదలు నిన్ను పూజించిన భక్తులకందరికీ మోక్షమును ఇచ్చినావు అని అంటారే. ఇప్పుడు ఒక పుణ్యాత్ముడు (ధూర్జటి) నిన్ను పదేపదే కొల్చుచుండ ఇంత ఆలసత్వము ఎందుకయ్యా. నాకు వయస్సు మీరి మోహము లోభము (వారికిచ్చితివి నాకు లేదు అని) పెరుగుచున్నవి ప్రభో.

   కాలద్వారకవాటబంధనము దుష్కాలప్రమాణక్రియా
   లీలాజాలక చిత్రగుప్త ముఖవల్మీకోగ్రజిహ్వాద్భుత
   వ్యాళవ్యాళ విరోధి మృత్యుముఖదంష్ట్రాహార్యవజ్రంబు ది
   క్చేలాలంకృత నీదునామ మరయన్ శ్రీకాళహస్తీశ్వరా!  (95)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! దిక్కుల సరిహద్దులచేతనే తెలుసుకొనదగిన నీ నామము పరికించి చూడగా, నరకద్వారములు మూసివేయగలిగినది. మరణకాలసూచకమగు చిత్రగుప్తుని నాలుకలకు గరుత్మంతుడి వంటిది, కొండలవంటి మృత్యుకోరలకు వజ్రాయుధము వంటిది ప్రభో (జరాజన్మమృత్యు విముక్తి సాధనము అని కవి భావము)

   పదివేలైనను లోకకంటకులచేఁ బ్రాపించు సౌఖ్యంబు నా
   మదికిన్ బథ్యముగాదు సర్వమునకున్ మధ్యస్థుఁడై సత్య దా
   న దయాదుల్గలరాజు నా కొసఁగు మెన్నన్వాని నీయట్ల చూ
   చి దినంబున్ముదమొందుదున్ గడపటన్ శ్రీకాళహస్తీశ్వరా!  (96)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ఎన్ని చెప్పినా నాకు లోకకంటకులైన రాజుల ప్రాపకము చేయుట ఇష్టము లేదు, సత్య దాన దాయాది గుణములు కలిగిన నీవంటి రాజును చూపించు, నిన్ను కొలిచినత్తే వానిని కూడా సేవించెదను. (అటువంటి రాజు లేదు కనుక నిన్నే సేవించెదనని కవి భావము)


   తాతల్తల్లియుఁ దండ్రియున్మఱియుఁ బెద్దల్చావఁగా చూడరో
   భీతిం బొందంగనేల చావునకుఁగాఁ బెండ్లాము బిడ్డల్హిత
   వ్రాతంబున్ బలవింప జంతువులకున్వాలాయమైపోవఁగాఁ
   జేతోవీధినరుండు నిన్గొలువఁడో శ్రీకాళహస్తీశ్వరా!  (97)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! బంధువులు అందరూ నశింపకుందురా? జంతువులకు మరణము తథ్యము అని తెలిసీ జనులు మూర్ఖులై బాధపడుచూ వ్యర్థముగా కాలక్షేపము చేయుదురే కానీ నిన్ను కొలువరు కదా

   జాతుల్సెప్పుట సేవసేయుట మృషల్ సంధించుటన్యాయ వి
   ఖ్యాతిం బొందుట కొండెకాఁడవుట హింసారంభకుండౌట మి
   థ్యా తాత్పర్యములాడుటన్నియుఁ బరద్రవ్యంబు నాశించి యీ
   శ్రీతానెన్ని యుగంబులుండఁగలదో శ్రీకాళహస్తీశ్వరా!  (98)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! జాతకములు చెప్పి, పరుల సేవ చేసి, బొంకులాడి, అన్యాయము చేయుటలో పేరొంది, ఇతరులపై నేరములాక్రోశించి, హింసించి, దొంగసాక్ష్యములు చెప్పి పరద్రవ్యమును కూడబెట్టిన ఆ ధనము ఎన్నో యుగములు ఉండును వారికి అని వృథా ఆలోచనలు చేయుదురే కానీ నీ పాదసంసేవాసక్తి పొందారు కదా జనులు.

   చెడుగుల్ కొందఱకూడి చేయఁగఁబనుల్ చీఁకట్లు దూఱఁగఁ
   ల్పడితిం గాని చరింపరాని నిను నొల్లంజాలుఁ బొమ్మంచు ని
   ల్వెడలంద్రోచినఁ జూరుపట్టుకొని నేవ్రేలాడుదుం గోర్కెఁగో
   రెడి యర్థంబులు నాకు వే గలుగావో శ్రీకాళహస్తీశ్వరా!  (99)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! కొందఱు చెడ్డవారితో కూడి నేను పూర్వము కొన్ని పనులు చేసిన మాట నిజమే. కానీ నీ సాన్నిధ్యమును మాత్రము ఎదబాయను. నీవు నన్ను వద్దని మెడ పట్టుకొని గెంటివేసినా నేను మాత్రము నీ చూరు పట్టుకొనే వేలాడుతాను. నేను కోరిన కైవల్యమును నాకు ఎందుకు ప్రసాదించవు ప్రభో?

   భసితోద్ధూళన ధూసరాంగులో జటాభారోత్తమాంగుల్తపో
   వ్యసనుల్ సాధితపంచవర్ణరసనుల్ వైరాగ్యవంతుల్ నితాం
   త సుఖస్వాంతులు సత్యభాషణ సముద్యద్రత్న రుద్రాక్ష రా
   జి సమేతుల్ తుదనెవ్వరైనఁ గొలుతున్ శ్రీకాళహస్తీశ్వరా!  (100)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! భస్మము పూసుకున్నవారు, తలపై జడలు కలిగినవారు, నిత్యమూ తపస్సు చేయువారు, పంచాక్షరీ మంత్రమును జపించువారు, సర్వమూ త్యజించినవారు, బ్రహ్మానందమును పొందినవారు, సత్యము అను రత్నమాలను రుద్రాక్షమాలను ధరించినవారు ఏ వర్ణమైననూ కనబదినచో నేను వారిని నీ స్వరూపులుగా భావించి పూజించెదను.

   జలజశ్రీఁ గల మంచినీళ్ళు గలవా చట్రాతిలో బాపురే
   వెలివాడన్మఱి బాపనిల్లు గలదా వేసాలుగా కక్కటా
   నలి నా రెండుగుణంబులెంచి మదిలో నన్నేమిరోయంగ నీ
   చెలువంబైన గుణంబు లెంచుకొనవే శ్రీకాళహస్తీశ్వరా!  (101

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! తామరపూవులతో కూడిన నీళ్ళు చట్రాయి బావిలో ఉండునా? అదే విధముగా మాలవాడలో బ్రాహ్మణుని ఇల్లు ఉండునా? ఉన్నా కూడా అవన్నీ వేషములే కదా. అదే విధముగా నాలో ఎన్ని దుర్గుణములు ఉన్ననూ, నీకు ఇష్టమైన రెండు గుణములు ఎంచుకుని నన్ను అసహ్యించుకొనక కాపాడు

   గడియల్ రెంటికొ మూఁటికో గడియకో కాదేని నేఁ డెల్లియో
   కడఁ నేఁడాదికో యెన్నఁడో యెఱుఁగ మీకాయంబు లీభూమిపైఁ
   బడఁగా నున్నవి ధర్మమార్గమొకటిం బాటింప రీమానవుల్
   చెడుగుల్ నీపదభక్తినిం దెలియరో శ్రీకాళహస్తీశ్వరా!  (102)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ఈ జీవితమూ ఈ ఘడియో, రెండో, మూడో ఘడియలకో తీరక తప్పదు. ఇది తెలిసి కూడా మూర్ఖమానవులు నీ పాదములను ఆశ్రయించక ధర్మమార్గమును పాటింపకయుందురు కదా

   క్షితిలో దొడ్డతురంగసామజము లేచిత్రమ్ము లాందోళికా
   తతు లే లెక్క విలాసినీజన సువస్త్ర వ్రాతభూషాకలా
   ప తనూజాదిక మేమిదుర్లభము నీ పదమ్ములర్చించుచో
   జిత పంకేరుహపాదపద్మయుగళా శ్రీకాళహస్తీశ్వరా!  (103)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నీ పాదపద్మములపైన సంతత చిత్తము కలిగినవాడికి, ఈ భూమిలో పెద్ద గుఱ్ఱములు, ఏనుగులు, పల్లకీలు, స్త్రీలు, వస్త్రములు, బిడ్డలు వంటి వ్యామోహములు ఏ పాటి

   సలిలమ్మున్జులుక ప్రమాణమొక పుష్పమ్ము న్భవన్మౌళి ని
   శ్చల భక్తి ప్రతిపత్తిచే నరుఁడు పూజల్సేయఁగా ధన్యుఁడౌ 
   నిల గంగానదిఁ జంద్రఖండము దానిందుం దుదిన్గాంచు నీ
   చెలువంబంతయు నీ మహాత్త్యమిదిగా శ్రీకాళహస్తీశ్వరా!  (104)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ఇంచుక నీరు, ఒక పుష్పము నీ లింగముపైన భక్తితో ఉంచిన మాత్రముననే నీవు ప్రసన్నుడవై ఆ నరునికి గంగానది మొదలు నీ తలపైని చంద్రఖందమును కూడా చూపెదవు కదా. ఆశుతోషుడవు నీవు అని కవి భావము


   తమనేత్రద్యుతిఁ దామెచూడ సుఖమై తదాత్త్యమున్గూర్పఁగా
   విమలమ్ముల్కమలాభముల్జతలసద్విద్యుల్లతా లాస్యముల్
   సుమనోబాణ జయప్రదమ్ములనుచున్జూచున్ జనంబూని హా
   రిమృగాక్షీనివహమ్ము కన్నుఁగవలన్ శ్రీకాళహస్తీశ్వరా!  (105)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! తమలో నిన్ను గూర్చి ధ్యానించి ఆత్మసాక్షాత్కారము పొంది తమలో తమనే చూసుకొనక ఈ జనులు స్త్రీలకన్నులను చూసి అవి పద్మములని, లేడి కన్నులని, అందముగా ఉన్నవనీ, మెరుపుతీగలని, మన్మథునికి జయము చేకూర్చేవని భావిస్తారు. అహం బ్రహ్మాస్మి అనే స్థితిని పొందక వీరు ఇటువంటి ఇహబంధములయందు చిక్కుకొని ఉంటారని కవి భావము.

   పాటవద్రజ్జుభుజంగవ ద్రజత విభ్రాంతిస్ఫురచ్ఛుక్తి వ
   ద్ఘటవాచ్చంద్రశిలా జపాకుసుమ రుక్సాంగత్యవత్తంచు వా
   క్పటిమల్నేర్తురు చిత్సుఖం బనుభావింపన్ లేక దుర్మేధసుల్
   చిటుకన్నం దలపోయజూతు రథముల్ శ్రీకాళహస్తీశ్వరా!  (106)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! కొందఱు పండితులు దుర్మేధస్సులై ఆత్మానందసుఖము అనుభవింపలేక ఈ జగత్తు అంతా అశాశ్వతమని, వస్త్రమువంటిది అని, పామువంటి తాడు అనే విభ్రాంతి కలిగించునది అని ముత్యపు చిప్ప వెండి పాత్రగా తోచునటువంటిది అని చంద్రకాన్తామని పక్కన మంకెన పువ్విడగా శిలకు కలుగు ఎఱ్ఱని గుణమువంటిది అని, మఱియు చీమ చిటుక్కుమన్న గూడ దానికి నీవే కారణమనీ పూర్తిగా తెలియని ఉపమానములు చెప్పుతూ కాలము గడిపెదరు.

   నిను నిందించిన దక్షుపైఁ దెగవో వాణీనాధు శాసింపవో
   చనువా నీ పదపద్మసేవకులఁ దుచ్ఛంబాడు దుర్మార్గులన్
   బెనుప న్నీకుం నీదుభక్తతతికిన్ భేదంబు గానంగ వ
   చ్చేనొ లేకుండిన నూరకుండఁగలవా శ్రీకాళహస్తీశ్వరా!  (107)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! పూర్వము నిన్ను ధిక్కరించిన దక్షుని, బ్రహ్మదేవుని శిరస్సు నీవు తెంపితివి కదా. కానీ ఇప్పుడు నీ భక్తులను సుర్మార్గులు దుర్భాషలు ఆడుచూ ఉంటే పట్టకుండనట్టు ఉన్నావు. నీవరకూ రాలేదు కదా అని తామసము వహించితివా ప్రభో? లేక నీకూ నీ భక్తులకూ భేదము తలచినావా?


   కరిదైత్యున్బొరిగొన్న శూలము కరగ్రస్తంబుగాదో రతీ
   శ్వరునిన్గాల్చిన ఫాలలోచన శిఖావర్గంబు చల్లారెనో
   పరనిందాపరులన్వధింప విదియున్ భావ్యంబె వారేమి చే
   సిరి నీకున్ బరమోపకార మరయన్ శ్రీకాళహస్తీశ్వరా!  (108)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! పూర్వము నీవు గజాసురుని చంపిన శూలము నీచేతిలో ఇప్పుడు లేదా? మన్మథుని కాల్చిబూడిద చేసిన మూడో కన్ను మంట చల్లరిందా? పరనిందా పరులు విర్రవీగుతూ ఉంటే వారిని శిక్షింపక మౌనము వహించితివేమి? వారు నీకేమైనా మహోపకారము చేసిరా?

   దురమున్దుర్గము రాయబారము మఱిన్దొంగర్కము న్వైద్య
   మున్ నరనాథాశ్రమ మోడబేరమును బెన్మంత్రంబు సిద్ధించినన్
   ఆర్యన్ దొడ్డఫలంబు గల్గు నదిగా కాకార్యమే తప్పినన్
   సిరియుం బోవును బ్రాణహానియునగున్ శ్రీకాళహస్తీశ్వరా! (109)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! యుద్ధము, కోట ముట్టడి, రాయబారము, దొంగతనము, వైద్యము, రాజాశ్రయము, నౌకా వ్యాపారము, మంత్రసాధన, ఇవి సిద్ధించిన మంచి లాభము కలుగును కానీ ఒకవేళ ఇవి కనుక వికటిస్తే ధనము హరించి పోవడమే కాక ప్రాణహాని కూడా కలుగును

   తనయుం గాంచి ధనంబులిచ్చి దివిజస్థానంబు గట్టించి వి
   ప్రున కుద్వాహము చేసి సత్కృతికిఁ బాత్రుండై తటాకంబు నే
   ర్పునఁ ద్రవ్వించి వనంబువెట్టి మననీ పోలేఁడు నీ సీవ చే
   సిన పుణ్యాత్ముఁడు పోవులోకమునకున్ శ్రీకాళహస్తీశ్వరా!  (110)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ఎవరైనా కానీ కొడుకులను కని, దానములు చేసి, గుడి కట్టించి, బ్రాహ్మణులకు మేలు చేసి, వారి దయకు పాత్రుడై, చెరువులు త్రవ్వించి, చేట్లు పెంచి ఇంట మంచి చేసినా కూడా నీ భక్తులు చేరు బ్రహ్మపదమును చేరలేరు.

   క్షితినాథోత్తమ సత్కవీశ్వరుఁడు వచ్చెన్ మిమ్ములం జూడగా
   నతఁడే మేటి కవిత్వవైఖరిని సద్యఃకావ్యనిర్మాత త
   త్ప్రతిభల్మంచివి తిట్టు పద్యములు చెప్పండాతఁడన్నన్ మముం
   గ్రితమే చూచెను బొమ్మటందు రధముల్ శ్రీకాళహస్తీశ్వరా! (111)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ఎవరేని రాజువద్దకు ఒక మంచి కవి రాగా అతని పరిచారకులు 'రాజా, ఇతడు మంచి కవి, మంచి కవిత్వమును చెప్పునే కానీ తిట్టు కవిత్వము కాదు' అని చెప్తే ఆ రాజాధముడు ఈ కవిని ముందే చూచినాను పొమ్మని చెప్పండి అనువారు ఎక్కువ. (అట్టి రాజాధములను కాక నీ సేవ చేసుకోనెదనని కవి భావము)

   నీకుంగాని కవిత్వమెవ్వరికి నేనీనంచు మీఁదెత్తితిన్
   జేకొంటిం బిరుదంబు కంకణము ముంజేఁ గట్టితిం బట్టితిన్
   లోకుల్ మెచ్చ వ్రతంబు నాతనువుకీలున్ నేర్పులుంగావు చీ
   చీ కాలంబులరీతి దప్పెడుఁ జుమీ శ్రీకాళహస్తీశ్వరా!  (112)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నా కవిత్వము నీకు కాక వేరెవ్వరికీ నేను అంకితమివ్వను అని ప్రతిన బూనితిని. దీనికి లోకులు మెచ్చు విధముగా శైవుడనని బిరుదము పొంది కంకణము ముంజేతిలో తొడిగితిని. ఇది నా నేర్పు కాదు నీ మీద భక్తి అని నేను అనుకున్న, లోకము మారి ఇప్పుడు జనులు ఇది మెరమెచ్చుల కోసమని అందురు.

   నిచ్చల్ నిన్ను భజించి చిన్మయ మహానిర్వాణపీఠంబుపై
   రచ్చల్సేయక యార్జవంబు కుజనవ్రాతంబుచేఁ గ్రాఁగి భూ
   భృచ్చండాలురఁ గొల్చి వారు దనుఁ గోపింపం బుదుండార్తుఁడై
   చిచ్చారం జమురెల్లఁ జల్లుకొనునో శ్రీకాళహస్తీశ్వరా!  (113)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! మంచి పండితులు నిన్ను కొలిచి మహానిర్వాణ పదవిని పొందక, జనుల మాటలు విని, చెడు రాజుల ఆశ్రయము గోరి వారిని భజింపపోదురు. వారు కోపించిన వారి స్థితి మంటలు చల్లార్చుకొనుటకు నూనె మీద పోసుకున్న విధముగా ఉంది.

   దంతంబుల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే
   కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు గానప్పుడే
   వింతల్మేన జరింపనప్పుడే కురుల్వెల్వెల్ల గానప్పుడే
   చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!  (114)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ఇంకా పండ్లు ఊడిపోకమునుపే, శరీరములో సత్త్వము ఉన్నపుడే, స్త్రీలు ముదిమివల్ల తమను అసహ్యించుకోక మునుపే, ముదిమి మీదపడక ముందే, తనువులో వింతలు (క్రొత్త రోగములు) పుట్టకముందే నీ పాదాంబుజములను సేవించవలెను స్వామీ, ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా!


|| ధూర్జటి మహాకవి ప్రణీతంబైన శ్రీకాళహస్తీశ్వర శతకము సంపూర్ణము ||

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics