శ్రీ కాళహస్తీశ్వర శతకము రెండవ భాగం Sri kaalahastiswara satakam part two

శ్రీ కాళహస్తీశ్వర శతకము రెండవ భాగం


 అమరస్త్రీల రమించినన్ జెడదు మోహంబింతయున్ బ్రహ్మ ప
   ట్టము సిద్దించిన నాస దీరదు నిరూఢక్రోధమున్ సర్వలో 
   కములన్మ్రింగినమాన దిందుఁగల సౌఖ్యంబొల్ల నీ సేవ చే
   సి మహాపాతక వారిరాశిఁ గడతున్ శ్రీకాళహస్తీశ్వరా!  (41)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! రంభాద్యప్సరసలను కూడినా కూడా మోహము చల్లారదు, బ్రహ్మపదవి చేకూరినా కూడా ఆశ చావదు, సమస్త సృష్టిని కబళించినా కూడా లోపలి కోపము తగ్గదు. ఈ ప్రపంచములోని సుఖములు నాకక్కరలేదు. నీ సేవ చేసుకొని నా పాపపంకిలమును కడుగుకుంటాను ప్రభో.


   చనువారిన్ గని యేడ్చువారు జముఁడా! సత్యంబుగా వత్తు మే
   మనుమానం బిఁకలేదు నమ్ముమని తా రావేళ నా రేవునన్
   మునుగన్ బోవుచు బాసచేయుట సుమీ ముమ్మాటికింజూడగాఁ
   చెనటుల్గానరు దీని భావమిదివో శ్రీకాళహస్తీశ్వరా!  (42)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! చనిపోయిన వారిని చూసి రేవులో మునుగుతూ, "యముడా! మేము మాత్రము శాశ్వతమా? ఏదో ఒకనాడు అనుమానము లేక మేము కూడా వస్తాము" అని ఏడ్చునది ప్రమాణములు చేయుటకు మాత్రమే. దీనిలోని భావమును వివేకహీనులు గ్రహించలేరు. ఆ ఏడుపు ఆ ప్రమాణాల వరకేనని కవి భావము.


   భవదుఃఖంబులు రాజకీటముల నే బ్రార్థించినం బాయునే
   భవదంఘ్రిస్తుతిచేతఁగాక విలసద్బాలక్షుధాక్లేశదు
   ష్టవిధుల్మానునె చూడ మేఁకమెడచంటందల్లి కారుణ్య దృ
   ష్టివిశేషంబున నిచ్చు చంటఁబలెనో శ్రీకాళహస్తీశ్వరా!  (43)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! సంసారతాపత్రయములు నీ పాదసంసేవచే మానునా, లేక దుష్టరాజుల ప్రాపకముచే మానునా? బిడ్డ ఆకలి తల్లి చనుబాలతో తీరునే కానీ మేక మెడ క్రింది చన్ను గుడిచిన తీరునా ప్రభో?


   పవి పుష్పంబగు నగ్నిమంచగు నకూపారంబు భూమీస్థలం
   బవు, శత్రుండతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా
   నవనీమండలిలోపలన్ శివశివేత్యాభాషణోల్లాసికిన్
   శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా!  (44)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! వజ్రాయుధము కూడా పుష్పమాలికవుతుంది, అగ్ని మంచులా మారుతుంది, సముద్రము నేలగా పరిణమిస్తుంది, అత్యంతశత్రువు మిత్రుడవుతాడు, విషము ఆహారమౌతుంది కదా ప్రభో "శివ శివా" అని సదా నీ నామ సంస్మరణము చేయువానికి సర్వమూ వశ్యమవుతుంది.


  లేవో కానలఁ గందమూలఫలముల్ లేవో గుహల్ తోయముల్
   లేవో యేఱులఁ బల్లవాస్తరణముల్లేవో సదా యాత్మలో
   లేవో నీవు విరక్తులన్మనుప జాలిన్ బొంది భూపాలురన్
   సేవల్సేయఁగఁ బోదులేరొకో జనుల్ శ్రీకాళహస్తీశ్వరా!  (45)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! అడవిలో కందమూలఫలపుష్పాదులు లేవా? పరుండుటకు గుహలు లేవా? యేఱులయందు నీళ్ళు లేవా? పూజించుటకు ఆత్మలో నీవు లేవా? వర్తకవ్యాపారములని ఏలనో ఈ జనులు సేవలు చేయుదమని రాజుల ప్రాపకము కోసము పోయెదరో ప్రభో?


   మును నేఁ బుట్టినపుట్టులెన్ని గలవో మోహంబుచే నందుఁ జే
   సిన కర్మంబుల ప్రోవులెన్ని గలవో చింతిచినన్ గాన నీ
   జననంబే యని యున్న వాడ నిదియే చాలింపవే నిన్నుఁ గొ
   ల్చిన పుణ్యంబునకుం గృపారతుఁడవై శ్రీకాళహస్తీశ్వరా!  (46)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ముందు నేను ఎత్తిన జన్మలెన్నో, వాటిలో నేను చేసిన కర్మలెన్నో నాకు తెలియదు.ఎంత ఆలోచించినా నేను తెలుసుకోనలేకున్నను. ఈ జన్మమే పారమార్థికమని భావించుచున్న నాకు ఈ జన్మలో చేసిన నీ ధ్యానపుణ్యముచేత ఇదియే కడగొట్టు జన్మ గావింపుము ప్రభో


   తనువెందాక ధరిత్రినుండు నను నందాకన్ మహారోగ దీ
   పన దుఃఖాదులఁ బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి యా
   వెనుకన్ నీపదపద్మముల్ దలఁచుచున్ విశ్వప్రపంచంబుఁ బా
   సిన చిత్తంబున నుండఁజేయంగదవే శ్రీకాళహస్తీశ్వరా!  (47)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ఈ శరీరము ఎంతవరకూ భూమియందు ఉండునో అంతవరకూ నీవు నన్ను దయాదృష్టితో వీక్షించి రోగదుఖముల బారిన పడకుండునట్టు కాపాడి ఆ తరువాత నీదివ్యపాదపద్మములే ధ్యాసగా చేసి నన్ను ఉద్దరించు ప్రభో.



   మలభూయిష్ట మనోజధామము సుషుమ్నా ద్వారమో యారు కుం
   డలియో పాదకరాక్షియుగ్మంబులు షట్కంజంబులో మోము దా
   జలజంబో నిటలంబు చంద్రకళయో సంగంబు యోగంబో గా
   సిలి సేవింతురు కాంతలన్ జనుల్ శ్రీకాళహస్తీశ్వరా! (48)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ఆడువారి సాంగత్యము కోసము జనులు తాపత్రయము చూడ, వారి యోనిమార్గము సుషుమ్నా ద్వారమయిన మూలాధారమనినట్టు, నూగారు కుండలి అయినట్టు, పద్మములతో పోల్చునట్టి వారి పాద కర, అక్షిద్వయములు షట్చక్రములు అనినట్టు, మొహము సహస్రారమనినట్టు, నుదురు చంద్రకళ అనినట్టు, సంయోగమే యోగమనినట్టు భావించి సేవించెదరు కదా ప్రభో.


   జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యము
   ల్కలశబ్దధ్వను లంచితాంబర మలంకారంబు దీప్తుల్మెఱుం
   గులు నైవేద్యము మాధురీ మహిమగాఁ గొల్తున్నిన్నున్ భక్తిరం
   జిల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీకాళహస్తీశ్వరా!  (49)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! కావ్యరసములే స్నానముగా, పద్యములే పూలుగా, అర్థమే భేరీకాహళవాద్యములుగా, అలంకారములు వస్త్రములుగా, కవితాసౌందర్యమే దీపములుగా, మాధుర్యమే నైవేద్యముగా కూర్చి నా చేతనయినట్టుగా నీ కైంకర్యము చేసెదను స్వామీ.


   ఏలీలన్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వని వ్యంగ్య శ
   బ్దాలంకార విశేషభాషల కలభ్యంబైన నీ రూపమున్
   జాలుంజాలుఁ గవిత్వముల్ నిలుచునే సత్యంబు వర్ణించుచో
   చీ లజ్జింపరు కదా మాదృశకవుల్ శ్రీకాళహస్తీశ్వరా!  (50)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ఉపమాది అర్థాలంకారములతో, నానావిధ శబ్దాలంకారములతో నిన్ను నావంటి కవులు వర్ణింపచూస్తారు. భాషకు దొరకనట్టి నీ రూపము వచిన్చాదము సాధ్యమా? సత్యము వర్ణించేటప్పుడు కవిత్వములు నిలుచునా ప్రభో?

పాలున్ బువ్వయుఁ బెట్టెదన్ గుడవరా పాపన్న రాయన్న లే
   లే లేమ్మన్న నరంటిపండు కొని తే లేకున్న నొల్లనం
   టే లాలింపరే తల్లితండ్రులపుడట్లే తెచ్చి వాత్సల్య ల
   క్ష్మీ లీలావచనంబులన్ మనుపవే శ్రీకాళహస్తీశ్వరా!  (51)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! చిన్నపిల్లలు పాలు, అన్నము తెచ్చి తినమంటే, కాదు అరటిపండు కావాలని ఎలా మారాం చేస్తారో, అదే విధముగా నేను కూడా నాకు ఇచ్చిన ఇహలోక సౌఖ్యములను వద్దని మోక్షమార్గము కోసము నిన్ను వేడితిని. తల్లితండ్రులు ఏ విధముగా ఆ మొండి బాలుని కోరికను తీరుస్తారో అదే విధముగా నీవు నన్నుద్ధరించు ప్రభో


   కలకంచున్శకునంబులంచు గ్రహయోగంబంచు సాముద్రికం
   బు లటంచు న్దెవులంచ రిష్టమనుచున్ భూతంబులంచు న్విషా
   దులటంచున్ నిమిషార్ద జీవనములందున్ బ్రీతిఁబుట్టించి యీ
   సిలుగుల్ ప్రాణులకెన్ని చేసితివయా, శ్రీకాళహస్తీశ్వరా! (52)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! కళలు, శకునములు, గ్రహయోగములు, సాముద్రికము, రోగములు, అరిష్టములు, భూతములు, విషాదమని ఇన్ని విధముల వెతలు కల్పించితివేమయ్యా ఈ అర్ధనిమిషపరిమాణ జీవితములకు ప్రభో.


   తలమీఁదం గుుసుమ ప్రసాద మలికస్థానంబు పై భూతియున్
   గళసీమంబున దండ, నాసిక తుదన్ గంధప్రసారంబు లో
   పల నైవేద్యముఁ జేర్చునే మనుజుడా భక్తుండు నీకెప్పుడున్
   జెలికాఁడై విహరించు రౌప్యగిరిపై శ్రీకాళహస్తీశ్వరా!  (53)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ఎవడైతే సదా తలమీద నీ నిర్మాల్యమును, నుదుట విభూతిని, మెడలో రుద్రాక్షలను, ముక్కుయందు నీ అభిషేకజల సుగంధమును, ఉదరములో నైవేద్యమును కలిగి ఉంటాడో అతడు వెండికొండపై నీ స్నేహితుడితో సమముగా వర్తించగలడు.

   ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టార్థంబులీ నేర్తురే
   వేళన్ వారి భజింప జాలిబడకావిర్భూతమోదంబునన్
   గాలంబెల్ల సుఖంబు నీకు నిఁక భక్తశ్రేణి రక్షింప కీ
   శ్రీలెవ్వారికిఁ గూడఁబెట్టెదవయా, శ్రీకాళహస్తీశ్వరా!  (54)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నీ ఆలుబిడ్డలు (పార్వతీదేవి, కుమారగణనాయకులు), స్నేహితుల (కుబేరాదులు), హితులు (మహావిష్ణువు) నీకు మోదము చేకూరునట్టుగా నీవు కోరినవి నీకు సమకూర్చుతూ ఉండగా, నీవు నీ భక్తకోటిని రక్షింపక సిరిసంపదలు ఎవరికోసమని కూడబెడుతున్నావు ప్రభో?

   సులభుల్ మూర్ఖులు నుత్తమోత్తములు రాజుల్ కల్గి యేవేళ న
   న్నలఁతం బెట్టిన నీ పదాబ్జములఁ బాయంజాల, నేమిచ్సినం
   గలధౌతాచల మేలు టంబునిధిలోఁ గావుండు టబ్జంబు పైఁ
   జెలువొప్పన్ సుఖియింపఁ గాంచుట సుమీ, శ్రీకాళహస్తీశ్వరా!  (55)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! రాజులు భిన్నమనస్కులు. కొందఱు మంచివారు, కొందఱు మూర్ఖులు, మరి కొందఱు ఉత్తమోత్తములు. వారు నాకు ఏ విధమైన ప్రలోభములకు లోను చేసినా నేను నీ పాదారవిందములను విడువబోను. నీవు నాకు ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా సంతోషమే ప్రభో.

   కలధౌతాద్రియు, నస్థిమాలికయు, గోగంధర్వమున్బున్కయన్
   బులితోలున్ భసితంబుఁ బాపతోడవుల్పోకుండఁ దోఁబుట్లకై
   తొలి నేవారాలతోడఁ బుట్టవు కళాదుల్ కల్గ మేలయ్యె నా 
   సిలువున్ దూరము చేసికొంటెఱిఁగియే శ్రీకాళహస్తీశ్వరా!   (56)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! తోడబుట్టువులు లేనివాడివి, నీకున్న ఆస్తి అంతా మంచుకొండ, ఎముకల మాలిక, చేతిలోని ఎద్దు, లేడి, పులిచర్మము, భస్మము, సర్పాభరణము, చంద్రకళ. ఇన్నింటిని పోషించుచున్న నీకు నేను భారమా? నన్ను కూడా పోషించలేవా ప్రభో?


   శృతులభ్యాసము చేసి శాస్త్రగరిమల్ శోధించి తత్త్వంబులన్
   మతినూహించి శరీరమస్థిరము బ్రహ్మంబెన్న సత్యంబుఁ గాం
   చితిమంచున్ సభలన్ వృధావచనముల్ చెప్పంగనే కాని ని
   ర్జిత చిత్తస్థిరసౌఖ్యముల్ దెలియరో శ్రీకాళహస్తీశ్వరా!  (57)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! వేదాలు చదివితిమని, శాస్త్రములు శోధించితిమని, భగవత్తత్వము తేలియునని, శరీరము అశాశ్వతమని, బ్రహ్మమే సత్యమనీ వృధామాటలు చెప్పుదురే కానీ వాటిని పరిత్యజించిన వారు మాత్రము లేరు కదా.


   గతి నీవంచుఁ దలంచువార లపవర్గంబొందఁగా నేల సం
   తతమున్ గూటికినై చరింప వినలేదా యాయురన్నం ప్రయ
   చ్ఛతి యంచున్మొఱవెట్టఁగా శృతులు సంసారాంధకారాభి ధూ
   షిత దుర్మార్గులు గానఁ గానఁబడవో శ్రీకాళహస్తీశ్వరా!  (58)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ఆయువుంటే అన్నము కలదని శృతివాక్యములు వినికూడా నీవే మోక్షప్రదాతవు అయి ఉండగా, జనులు నిన్ను కొల్చక సంసారకూపములో పడి కొట్టుమిట్టాడుతూ దుర్మార్గులు అని అనిపించుకుంటూ ఉంటారు కదా

రతిరాజుద్ధతిమీఱ నొక్కతఱి గోరాజాశ్వునిన్ నొక్కఁ బో
   నతఁడా దర్పకు వేగనొత్తఁ గవయంబాఁబోతునుం దాఁకి యు
   గ్రతఁ బోరాడుఁగనున్న యన్నడిమిలేఁగ ల్వోలె శోకానల
   స్థితిపాలై మొఱవెట్టినన్ మనుపవే శ్రీకాళహస్తీశ్వరా!
తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! మన్మథుడు నిన్ను పొగరుగా ఎదిరించగా నీవూ అతడూ, గోవృషభముల వలే పోరాడగా మిమ్మిద్దరినీ చూసి దేవతలు లేగదూడలవలె వణుకుచుండ నీవు దయాస్వరూపుడివై వారిని రక్షించితివి కదా.


   అంతా సంశయమే శరీరఘటనం బంతా విచారంబే లో
   నంతా దుఃఖపరంపరాన్వితమే మేనంతా భయభ్రాంతమే
   యంతా నంత శరీరపోషణమె దుర్వ్యాపారమే దేహికిన్
   జింత న్నిన్నుఁ దలంచి పొందరు నరుల్ శ్రీకాళహస్తీశ్వరా! (59)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! దేహవాసియైన జీవునికి అంతా సంశయమే, విచారమే, దుఃఖభాజనమే, శరీరపోషణార్థం తాపత్రయమే. ఇంత దుర్వ్యాపారము ఉన్ననూ జనులు నిన్ను ఎల తలంచి ముక్తినొందరో ప్రభో?

   సంతోషించితిఁ జాలుఁ జాలు రతిరాజ ద్వారసౌఖ్యంబులన్
   శాంతిన్ బొందితిఁ జాలుఁ జాలు బహురాజ ద్వార సౌఖ్యంబులన్
   శాంతిన్ బొందెదఁ జూపు బ్రహ్మపద రాజద్వార సౌఖ్యంబు ని
   శ్చింతన్ శాంతుఁడనౌదు నీ కరుణచే శ్రీకాళహస్తీశ్వరా! (60)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! స్త్రీలతో రతిసౌఖ్యములు అనుభవించితిని, పెక్కు రాజుల ప్రాపకమును చవి చూసితి. ఇక చాలును. నీవు కరుణించి నాకు బ్రహ్మపద సౌఖ్యమును కల్పించిన చాలును ఇక నిశ్చింతగా ఉందును ప్రభో.

   స్తోత్రం బన్యులఁ జేయనొల్లని వ్రతస్థుల్వోలె వేసంబుతోఁ
   బుత్రీపుత్రకళత్రరక్షణ కళాబుద్ధిన్ నృపాలాధమున్
   బాత్రంబంచు భజింపఁబోదు రిదియున్భావ్యంబె యవ్వారి చా
   రిత్రం బెన్నఁడు మెచ్చనెంచ మదిలో శ్రీకాళహస్తీశ్వరా! (61)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! కొందఱు గర్వముతో ఎవరినీ పొగడని వారివలె నటించుచుందురు కానీ ఆలుబిడ్డల పాలాన కోసమై రాజాధముల ప్రాపకముకు వెంపటలాడుచుందురు. అటువంటి వారిని నేను మెచ్చలేను ప్రభో.

   అకలంకస్థితినిల్పి నాదమను ఘంటారావమున్ బిందు దీ
   ప కళాశ్రేణి వివేక సాధనము లొప్పంబూని యానంద దా
   రక దుర్గాటవిలో మనోమృగము గర్వస్ఫూర్తి వారించు వా
   రికిఁగా వీడు భవోగ్రబంధలతికల్ శ్రీకాళహస్తీశ్వరా!  (62)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! మనస్సును నాదము అను ఘంటారావముతో జతచేర్చి సదా శ్రీచక్రసంచారిణియగు లలితాపరాభట్టారికయందు నిలిపి మనస్సాను మృగమును ఆమె సాన్నిధ్యములో త్రిప్పువాడికి గర్వాది దుర్వాసనలు నశించి భవబంధ విమోచనము కలుగును ప్రభో

   ఒకయర్థము నిన్ను నేనడుగఁగా నూహింప నెట్లైనఁ బొ
   మ్ము కవిత్వంబులు నాకుఁ జెందనివి యేమోయంటివా నాడు జి
   హ్వకు నైసర్గిక కృత్యమింతియసుమీ ప్రార్థించుటేకాదు కో
   రికలన్ నిన్నును గాన నాకు వశమా శ్రీకాళహస్తీశ్వరా!  (63)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ఈ కవిత్వములు నా జిహ్వకు అలవాటై నిన్ను ప్రార్థించుచున్నాను కానీ నీ స్తోత్రపాఠము చేసి నా కోరికలను తీర్చుకోవలెనని కాదు. కోరికలున్న నిన్ను చేరుట సాధ్యమగునా స్వామీ

   శుకముల్కింశుపుష్పముల్గని ఫలస్తోమంబటంచు స్సము
   త్సుకతం జేరఁగఁబోవ నచ్చట మహాదుఃఖంబు సిద్ధించుఁ గ
   ర్మకళాభాషలకెల్లఁ బ్రాపులగు శాస్త్రంబుల్విలోకించు వా
   రికి నిత్యత్వమనీషదూరమగు నో శ్రీకాళహస్తీశ్వరా!  (64)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! మోదుగపూలను చూసి పండ్లు అని భ్రమచెంది చిలుకలు వాటిని తినబోయిన చందమున శాస్త్రములు చదివి నీ స్వరూపమును తెలియగోరు వారు నిరాశ చెందుతున్నారు కదా స్వామీ

   ఒకరిన్ జంపి పదస్థులై బ్రతుకఁ దా మొక్కొక్కరూహింతు రే 
   లోకొతా మెన్నఁడుఁ జావరో తమకు బోవో సంపదుల్పుత్ర మి
   త్ర కళత్రాదుల తోడ నిత్య సుఖమందంగందురో యున్నవా
   రికి లేదో మృతి యెన్నఁడున్ గట గటా శ్రీకాళహస్తీశ్వరా!  (65)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ఒకరిని చంపి వారి పదవిని కైవశము చేసుకోవలెనని అలోచించెదరే కానీ తమకు ఆ సంపదలు శాశ్వతమా అని ఆలోచించారు కదా. తాము అలుబిడ్డలతో మిత్రులతో శాశ్వతముగా సౌఖ్యమును అనుభవించాలని భావిస్తారు మూర్ఖజనులు స్వామీ

   నీకారుణ్యముఁ గల్గినట్టి నరుఁ డే నీచాలయంబుం జొరం
   డే కార్పణ్యపు మాట లాడ నరుగం డెవ్వారితో వేషముల్ 
   గైకోఁ డేమతముల్భజింపఁ డిలనే కష్టప్రకారంబులన్
   జీకాకై చెడిపోఁడు జీవనదశన్ శ్రీకాళహస్తీశ్వరా!  (66)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నీ కృపాకటాక్షవీక్షణములు ఉన్న నరుడు ఇతర దేవతలను మొక్కడు, అన్యమతములను సేవించాడు, దుష్టసంభాషణములు చేయడు, వేషములు పూనాడు, ఎటువంటి కష్టములు వచ్చినా క్రుంగడు ఏ జీవనదశలోనైనా

   జ్ఞాతుల్ద్రోహులు వారు సేయు కపటేర్ష్యాది క్రియాదోషము
   ల్మా తండ్రాన సహింపరాదు ప్రతికర్మంబించుకేఁ జేయఁగాఁ
   బోతే దోషము గాన మాని యతినై పోఁగోరినన్ సర్వదా
   చేతః క్రోధము మానదెట్లు నడతున్ శ్రీకాళహస్తీశ్వరా! (67)
  
తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! దాయాదులు ద్రోహచింతన కలవారు. వారు చేసిన దోషములు అలవికానివి. వారికి ప్రతిక్రియ చేయుదమన్న పాపము తలచెదను. కానీ వాటినన్నింటినీ పోదోసుకుని సన్యాసిగా మారుదామన్న వారిపై కోపము చల్లారుట లేదు. నన్నేమి చేయమందువు స్వామీ.

   చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్చాభాషణ క్రీడలన్
   వదరన్ సంశయ భీకరాటవులఁ ద్రోవల్దప్పి వర్తింపఁగాఁ
   మదన క్రోధకిరాతులందుఁగని  భీమప్రౌఢి వేఁదాఁకినం
   బెదరుం జిత్తము చిత్తగింపగఁదవే శ్రీకాళహస్తీశ్వరా! (68)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! వేదములు చదివితిమని చెప్పుకొనుచున్న ధూర్త పండితులు కొందఱు మాకు భోదలు చేయబోగా వాటిని విని మేము సంశయమను అరణ్యములను పట్టి దోవతప్పి తిరుగాడుతున్నాము. అటువంటి మాపై కామక్రోధములనే మృగములు దాడి చేస్తున్నాయి. మేము ఈ విధముగా మతి తప్పి తిరుగాడుతూ ఉంటే మమ్ము ఆదుకొనక ఉపేక్ష వహించెదవేమయ్యా ప్రభో?

   రోసిందేటిది రోఁతలేటివి మనోరోగస్థుఁడై దేహి తాఁ
   బూసిందేఁటిది పూఁతలేటివి మదాపూతంబులీదేహముల్
   మూసిందేటిది మూఁతలేటివి సదా మూఢత్వమేకాని తాఁ
   జేసిందేఁటిది చేఁతలేఁటివి వృథా శ్రీకాళహస్తీశ్వరా!  (69)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! వాంఛలు రోయక రోసిందేమిటి? మనస్సులోని మదము పోగొట్టుకోనక వృథా విభూతి రేఖలేమిటికి? తనలోని మూఢత్వము మానక కనులు మూసియేమి? ధ్యానము చేసినా పైవి లేక చేసిందేమీ స్వామీ?


   శ్రీశైలేశు భజింతునో యభవుఁ గాంచీనాథు సేవింతునో
   కాశీవల్లభుఁ గొల్వబోదునో మహాకాళేషుఁ బూజింతునో
   నాశీలం బణువైన మేరువనుచున్ రక్షింపవే నీ కృపా
   శ్రీశృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వరా!  (70)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! శ్రీశైలములో నిన్ను భజించమందువా? కాంచీపురమునందా, లేక వారాణసి లోనా లేక ఉజ్జయిని మహాకాలునిగానా? నీవే రూపమున సేవింపమన్న చేసెదను. నన్ను ణీ కృపాకరుణావీక్షణమందహాసములచే రక్షింపు ప్రభో

   అయవారై చరింపవచ్చుఁ దనపాదాంభోజ తీర్థంబులన్
   దయతోఁ గొమ్మనవచ్చు సేవకుని యర్థప్రాణదేహాదుల
   న్నియు నా సొమ్మనవచ్చుఁగాని సిరులన్నిందించినిన్నాత్మ ని
   ష్క్రియతంగానఁగారాదు పండితులకున్ శ్రీకాళహస్తీశ్వరా!  (71)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! తాము పండితులమని విర్రవీగి తమ పాదతీర్థమును పంచవచ్చు, తమనే ప్రాణధన దేహాదులచేత సేవించమని చెప్పవచ్చు. కానీ సిరిసంపదలు చెడ్డవని చెప్పుచూ వాటికోసమే పాకులాడినంత కాలము నిన్ను ఆత్మలో సాక్షాత్కరింపచేసుకోలేరు స్వామీ

   మాయాజాండకరండ కోటిఁ బొడిగా మర్దించిరో విక్రమా
  జేయుం గాయజుఁ జంపిరో కపటలక్ష్మీ మోహమున్ బాసిరో
   యాయుర్దాయ భుజంగమృత్యువు ననాయాసంబునన్గెల్చిరో
   శ్రేయోదాయకులౌదురెట్లు రితరుల్ శ్రీకాళహస్తీశ్వరా!  (72)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నీ మాదిరి ఇతరులు ప్రళయకాలమందు విశ్వమును సంహరించిరా? మన్మథుని కంటిమంటచే బూడిద చేసిరా? ధనములు వద్దనిరా? సర్పరూపములో ఉన్న మృత్యువును గెలిచిరా? ఇన్ని చేసిన నీవు కాక ఇతరులు నాకు మంచి చేయువారు ఎట్లౌదురు స్వామీ?

   చవిగాఁజూడ వినంగ మూర్కొనఁ దనూ సంఘర్షణా స్వాదమొం
   ద వినిర్మించెదవేల జంతువుల నేతత్క్రీడలే పాతక
   వ్యవహారంబులు సేయుదేమిటికి మాయా విద్యచేఁ బ్రొద్దుపు
   చ్చి వినోదింపఁగ దీన నేమిఫలమో శ్రీకాళహస్తీశ్వరా!  (73)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! పంచేంద్రియములు అనువాటితో రుచి, చూపు, వినికిడి, వాసన, స్పర్శ అని భావములు కలుగచేసి వాటితో జంతుకోటి సుఖపడుతూ ఉండగా మరలా శాస్త్రములు సృష్టించి తద్భావములు పాపములనే శంక వాటిలో కలిగించి వినోదము చూస్తున్నావు కదా, దీనివల్ల నీకేమి ఆనందము ప్రభో?

   వెనుకం జేసిన ఘోరదుర్దశలు భావింపంగ రోఁతయ్యెడున్
   వెనుకన్ముందుటవచ్చు దుర్మరణముల్వీక్షింప భీతయ్యెడున్
   నను నేఁజూచిన నావిధుల్దలచియు నాకే భయంబయ్యెడున్
   జినుకుం జీఁకటి యాయెఁ గాలమునకున్ శ్రీకాళహస్తీశ్వరా!  (74)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నేను చేసిన పూర్వకర్మములు ఆలోచించిన అసహ్యమేయుచున్నది. వాటి పరిణామములు ముందు ఆలోచించిన భయమేస్తున్నది. నేను ఆచరించిన విధివిధానములు నాకే భయము గొల్పుచున్నవి. నా అంత్యకాలమందు అంతా చీకటే అనిపించుచున్నది. నన్ను కరుణించు ప్రభో.

   పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్వింటి సాంఖ్యాది యో
   గ రహస్యంబులు వేదశాస్త్రముల్ వక్కాణించితిన్ శంక వో 
   దరయన్ గుమ్మడికాయలోన యవగింజంతైన నమ్మించి సు
   స్థిర విజ్ఞానము త్రోవఁజూపఁగదవే శ్రీకాళహస్తీశ్వరా!  (75)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! మంత్రతంత్రములు పరిశీలించితి యోగరహస్యములు పెద్దలు చెప్పగా వింటి వేదశాస్త్రములు చదువచెప్పితి కానీ గుమ్మడికాయలోని ఆవగింజంత విజ్ఞానము చేకూరలేదు. అంతమాత్రమైనా భోదించి నాకు దారి చూపుము ప్రభో

   మొదలం జేసినవారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి దు 
   ర్మదులై యిప్పుడు వారి ధర్మములొనర్పం దమ్ముదైవంబు న 
   వ్వదె రానున్న దురాత్ములెల్లఁ దమత్రోవం బోవరే యేల చే
   సెదరో మీఁదు దలంచి చూడకధముల్ శ్రీకాళహస్తీశ్వరా!  (76)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! సనాతన ధర్మములు తప్పని, తాము నేర్చినవి ధర్మములని చెప్పేవారిని చూసి దైవము నవ్వదా? ముందు తరాలవారు అవి నమ్మి చెడిపోరా? ముందు ఆలోచించక ఈ విధముగా చెప్పి ఏల అధములగుదురో కదా ప్రజలు స్వామీ

   కాసంతైన సుఖంబోనర్చునొ మనఃకామంబులీడేర్చునో
   వీసంబైనను వెంటవచ్చునొ జగద్విఖ్యాతి గావించునో
   దోసంబుల్వెడఁబాపునో వలసినం దొడ్తో మిముంజూపునో
   చీ సంసారదురాశేలుడుపవో శ్రీకాళహస్తీశ్వరా!  (77)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ఈ సంసారవ్యామోహము కొంచెమైనా సుఖదాయకమా? కోరిన కోర్కెలు తీర్చునా? వెంట వచ్చు పుణ్యమా? యశఃదాయకమా? దోషనాశకమా? లేక నిన్ను చేరు మార్గమా? దీనిని ఏల తొలగింపవు ప్రభో?

   ఒకపూఁ టించుక కూడు తక్కువగునే నోర్వంగలేఁ డెండకో
   పక నీడన్వెదకున్ జలిన్ జడిసి కుంపట్లెత్తుకోఁ జూచు వా
   నిల్లిల్లును దూఱు నీ తనువు దీనన్వచ్చు సౌఖ్యంబు రో
   సి కడాసింపరు గాక మర్త్యులకటా శ్రీకాళహస్తీశ్వరా!  (78)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ఈ శరీరముకు భోజనము ఒకపూట కొంచెము తక్కువైనా, ఎండ తగిలినా, చలి కలిగినా వానయందు తడిసినా తట్టుకోలేదు. నీడపట్టుకోసమో, కుంపట్లకొ, వానకు జడిసి ఇంటిచూరో వెతుక్కొంటారే కానీ ఈ జనులు ఈ శరీరవాంఛ పోగొట్టుకోరు కదా ప్రభో

   కేదారాది సమస్త తీర్థములు కోర్కిం జూడఁ బో నేటికిన్
   గాదా ముంగిలి వారణాసి కడుపే కైలాసశైలంబు నీ
   పాదధ్యానము సంభవించునపుడే భావింప నజ్ఞాన ల
   క్ష్మీ దారిద్ర్యులు గారే లోకులటా శ్రీకాళహస్తీశ్వరా!  (79)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నీ ధ్యానము మనస్సులో కలిగినప్పుడే ఇంటి ముంగిలి కాశీ క్షేత్రము కాదా? కడుపే కైలాసము కాదా. ఇది చేయక కేదారాది పుణ్య క్షేత్రములు సేవించుటకు పోవుదురే అజ్ఞానజనులు?

   తమకంబొప్పఁ బరాంగనాజన పరద్రవ్యంబులన్ మ్రుచ్చిలం
   గ మహోద్యోగముసేయు నెమ్మనము దొంగంబట్టి వైరాగ్య 
   పాశములంజుట్టి బిగించి నీదుచరణ స్తంభమునన్ గట్టి వై
   చి ముదం బెప్పుడుఁగల్గఁజేయఁగదవే శ్రీకాళహస్తీశ్వరా!  (80)

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నా మనస్సు అనెడు దొంగ ఒకడు సదా పరస్త్రీ, పరద్రవ్యములను దొంగలించవలెనను గొప్ప పథకముతో ఉన్నాడు. అట్టివానిని పట్టి వైరాగ్యమను తాళ్ళతో కత్తి ణీ పాదములనెడు స్తంభమునకు కట్టి నాకెప్పుడు ఆనందము కలుగజేసెదవు స్వామీ

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics