సుమతీ శతకం రెండవ భాగం sumathee satakam part two
సుమతీ శతకం రెండవ భాగం
041
కొక్కోకమెల్ల జదివిన,
చక్కనివాడైన, రాజ చంద్రుండైనన్,
మిక్కిలి రొక్కము లియ్యక,
చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ
భావం: వెలయాలు పుష్కలముగా ధనమీయకున్న ఎంతగా రతిశాస్త్రమును చదివినవాడైనను, అందగాడైనను, గొప్ప రాజశ్రేష్టుడైనను, ప్రేమించి దగ్గరకు చేరదు.
042
కొఱ గాని కొడుకు బుట్టిన
కొఱ గామియె కాదు, తండ్రి గుణముల జెఱచున్
చెఱకు తుద వెన్ను బుట్టిన
జెఱకున తీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ
భావం: చెఱకుగడ చివర వెన్ను పుట్టినచో ఆ చెఱకునందలి తీయదనము నంతయు నేవిధముగ పాడుచేయునో ఆ విధముగనే అప్రయోజకుడైన కుమారుడు కలిగిన కుటుంబమునకుపయోగకారి కాకపోవుట యటుండగా తండ్రి మంచిగుణమును కూడా పాడుచేయును.
043
కోమలి విశ్వాసంబును,
బాములతో జెలిమి, యన్య భామల వలపున్,
వేముల తియ్యదనంబును,
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ
భావం: స్త్రీలయందు విశ్వాసమును, పాములయందు స్నేహమును, పరస్త్రీలయందు ప్రేమయును, వేపచెట్లయందు తీయదనమును, రాజులయందు విశ్వాసము వట్టి అసత్యములు.
044
గడన గల మగని జూచిన
నడుగడుగున మడుగు లిడుదు రతివలు దమలో;
గడ నుడుగు మగని జూచిన
నడ పీనుగు వచ్చె నంచు నగుదురు సుమతీ
భావం: స్త్రీలు సంపాదన కలిగిన భర్తను చూచిన అడుగులకు మడుగులొత్తుచు పూజింతురు. సంపాదనలేని మగనిని చూచినచో నడుచునట్టి శవము వచ్చెనని హీనముగా జూతురు.
045
చింతింపకు కడచిన పని,
కింతులు వలతురని నమ్మ కెంతయు మదిలో,
నంతఃపుర కాంతలతో
మంతనముల మాను మిదియె మతముర సుమతీ
భావం: జరిగిపోయిన దానిని గురించి ఆలోచించుటయు, స్త్రీలు తన్ను ప్రేమింతురని విశ్వసించుటయును, రాణీవాసపు స్త్రీలతో రహస్యములను విడిచిపెట్టుము. ఇదియే అనుసరించవలసిన మంచితనము.
046
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుడు దగన్
హేమంబు గూడ బెట్టిన
భూమీశుల పాల జేరు భువిలో సుమతీ
భావం: చీమలు పెట్టినటువంటి పుట్టలు పాములకు నివాసమైనంట్లు, అజ్ఞానుడు కూడబెట్టిన బంగారమంతయు రాజుల వశమైపోవును.
047
చుట్టములు గాని వారలు
చుట్టములము నీకటంచు సొంపు దలిర్పన్
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగ ద్రవ్యంబు గలుగ గదరా సుమతీ
048
చేతులకు దొడవు దానము,
భూతలనాథులకు దొడవు బొంకమి ధరలో,
నీతియె తొడవెవ్వారికి,
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ
భావం: చేతులకు దానమును, పాలకులకు అసత్యమును పలుకకుండుటయును, అందరికినీ న్యాయమును, స్త్రీకి అభిమానమును అలంకారములు.
049
తడ వోర్వక, యొడ లోర్వక,
కడు వేగం బడిచి పడిన గార్యం బగునే;
తడ వోర్చిన, నొడ లోర్చిన,
జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ
భావం: ఆలస్యమునకు, శరీర శ్రమకును సహింపక తొందరపడిన నేకార్యమును కానేరదు. ఆలస్యమునకును శరీర శ్రమకును ఓర్చుకొన్నప్పుడే చెడిపోయిన కార్యమంతయు నెఱవేరుచుండును.
050
తన కోపమె తన శత్రువు,
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము,
తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ
భావం: తన కోపమే తనను శత్రువులువలె బాధించును. తన శాంతమే తనను రక్షించును. తన దయయే తనకు చుట్టమువలె సహాయపడును. తన ఆనందమే తనకు ఇంద్రలోక సౌఖ్యము. తన దుఖమే తనకు నరకమగును. ఇది నిజము.
051
తన యూరి తపసి తపమును,
తన పుత్రుని విద్య పెంపు, దన సతి రూపున్,
దన పెరటి చెట్టు మందును,
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ
భావం: తన యూరిజనుల తపోనిష్టయును, తన కుమారుని విద్యాధిక్యమును, తన భార్యయొక్క సౌందర్యమును, తన ఇంటి వైద్యమును ఎట్టి మనుజులును గొప్పగా వర్ణించి చెప్పరు.
052
తన కలిమి యింద్ర భోగము,
తన లేమియె స్వర్గలోక దారిద్ర్యంబున్,
దన చావు జల ప్రళయము,
తను వలచిన యదియె రంభ తథ్యము సుమతీ!
భావం: తన యొక్క ఐశ్వర్యమే దేవలోక వైభవము, తన దారిద్ర్యమే సమస్తమైన లోకములకు దారిద్ర్యము, తన చావే ప్రపంచమునకు ప్రళయము, తాను ప్రేమించినదే రంభ. ఈ విధముగా మనుజులు భావింతురు. నిజము ఇది.
053
తన వారు లేని చోటను,
జనమించుక లేని చోట, జగడము చోటన్,
అనుమానమైన చోటను,
మనుజునకును నిలువ దగదు మహిలో సుమతీ
భావం: తనకు కావలసిన చుట్టములు లేనిచోటునను, తనకు చెల్లుబడి లేని తావునను, తగువులాడుకొను చోటునను, తన్ను అవమానించు ప్రదేశమునను మానవుడు నిలువరాదు.
054
తమలము వేయని నోరును,
విమతులతో చెలిమి చేసి వెతబడు తెలివిన్,
గమలములు లేని కొలకును,
హిమధాముడు లేని రాత్రి హీనము సుమతీ
భావం: తాంబూలము వేయని నోరును, దుర్మార్గులతో స్నేహము చేసి బాధపడు బుద్ధియును, తామరపూవులులేని చెఱువును, చంద్రుడు లేని రాత్రియును శోభిల్లవు.
055
తలనుండు విషము ఫణికిని,
వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్,
తల తోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ
భావం: సర్పమునకు విషము తలయందుండును, తేలునకు తోకయందుండును. దుష్టునకు విషము తలతోక యనకుండ శరీరమంతనుండును.
056
తలపొడుగు ధనము పోసిన
వెలయాలికి నిజము లేదు వివరింపంగా
దల దడివి బాస జేసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ
భావం: విచారింపగా నిలువెత్తు ధనమిచ్చినప్పటికిని వేశ్య నిజము పలుకదు. కావున తలమీద చేయి పెట్టి ప్రమాణము చేసినప్పటికి వేశ్యను విశ్వసించరాదు.
057
తల మాసిన, నొలు మాసిన,
వలువలు మాసినను బ్రాణ వల్లభునైనన్
గులకాంతలైన రోతురు
తిలకింపగ భూమిలోన దిరముగ సుమతీ!
భావం: పరిశీలింపగా భూలోకములో, తలమాసినను, శరీరమునకు మురికిపట్టినను, ధరించెడి బట్టలు మాసిపోయినను చేసుకొన్న భర్తనైనను ఇల్లాండ్రు ఏవగించుకొందురు.
058
తాను భుజింపని యర్థము
మానవ పతి జేరు గొంత మఱి భూగతమౌ
గానల నీగలు గూర్చిన
తేనియ యొరు జేరునట్లు తిరముగ సుమతీ!
భావం: అరణ్యమునందు తేనేటీగలచే కొడబెట్టిన తేనె కడకు ఇతరుల పాలైనట్లు లోభివాడు తాను నోరుకట్టుకొని కూడబెట్టిన ధనము కొంత ప్రభువులపాలును కొంత భూమి పాలునగును.
059
దగ్గఱ కొండెము సెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మఱి దా
నెగ్గు బ్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ!
భావం: రాజు తన మంత్రి చెప్పెడి చాడీ మాటలకు లోబడి మంచి చెడ్డలు తెలుసుకొనజాలక జనులను హింసించుట, బొగ్గుల కొఱకు కోరిన కోరిక లొసగెడి కల్పవృక్షమును నఱకి వేసుకొనుటవంటిది.
060
ధన
నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్;
దన వారి కెంత గలిగిన
దన భాగ్యమె తనకు గాక తథ్యము సుమతీ!
భావం: గొప్ప ధనవంతుడైన కుబేరుడు తనకు మిత్రుడై యున్నను శివుడు బిచ్చమెత్తవలసి వచ్చెను. కావున తాను సంపాదించుకొన్న (తన దగ్గరున్న) భాగ్యమే తనకు సహాయ పడవలయును కాని తన దగ్గర నున్నవాడికడ నెంత భాగ్యమున్నను నిష్ప్రయోజనము.
061
ధీరులకు జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గౌరవమును మఱి మీదట
భూరి సుఖావహము నగును భువిలో సుమతీ!
భావం: బుధ్ధిమంతుడైన వారికి చేసెడు మేలు, కొబ్బరికాయయందలి నీరు వలె మిక్కిలి శ్రేష్టమైనదియును, ప్రియమైనదియును, గొప్ప సుఖమునకు స్థానమైనదియును అగును.
062
నడువకుమీ తెరువొక్కట,
గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్,
ముడువకుమీ పరధనముల,
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ
భావం: తోడులేక మార్గమందు ఒంటరిగా పోకుము, విరోధియింట ప్రీతితో భుజింపకుము, ఇతరుల ధనమును దగ్గరనుంచుకొనకుము, ఇతరుల మనస్సు నొచ్చునట్టుగా మాట్లాడకుము.
063
నమ్మకు సుంకరి, జూదరి,
నమ్మకు మొగసాల వాని, నటు వెలయాలిన్,
నమ్మకు మంగడి వానిని,
నమ్మకు మీ వామ హస్తు నవనిని సుమతీ!
భావం: పన్ను వసూలు చేయువానిని, జూదమాడువానిని, కంసాలివానిని, నటకుని, వేశ్యను, వర్తకుని, ఎడమచేతితో పనులు చేయువానిని విశ్వసింపుకుము.
064
నయమున బాలుం ద్రావరు,
భయమునను విషమ్మునైన భక్షింతురుగా;
నయమెంత దోషకారియొ,
భయమే జూపంగ వలయు బాగుగ సుమతీ!
భావం: మెత్తని మాటలచే పాలు కూడ త్రాగరు. భయపెట్టినచో విషమునైనను త్రాగుదురు. మృదుత్వ మెప్పుడును చెడునే కలిగించును. కావున చక్కగా భయమునే చూపుచుండవలయును.
065
నరపతులు మేఱ దప్పిన,
దిరమొప్పగ విధవ యింట దీర్పరి యైనన్,
గరణము వైదికుడైనను,
మరణాంతక మౌనుగాని మానదు సుమతీ!
భావం: రాజు హద్దుమీరి వర్తించినను, శాశ్వతముగా విధవ ఇంట పెత్తనదారి ఐనప్పటికిని, లేఖకుడ నియొగికాక వైదికుడైనప్పటికిని ప్రాణము మీదికి వచ్చును తప్పదు.
066
నవరస భావాలంకృత
కవితా గోష్టియును, మధుర గానంబును దా
నవివేకి కెంత జెప్పిన
జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ!
భావం: తొమ్మిది రసములతో కూడిన మంచి భావములతో శృంగారింపబడిన కవిత్వ సంబంధమైన సంభాషణమును, కమ్మని సంగీతమును జ్ఞానహీనునకు వినిపించుట, చెవిటివాని యొద్ద శంఖమును ఊదినట్లుండును.
067
నవ్వకుమీ సభ లోపల;
నవ్వకుమీ తల్లి, దండ్రి, నాథుల తోడన్;
నవ్వకుమీ పరసతితో;
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ
భావం: సభలలో నవ్వరాదు. తల్లిని, తండ్రిని, భర్తను, ఇతరుల భార్యను, బ్రాహ్మణులను చూచి నవ్వరాదు.
068
నీరే ప్రాణాధారము
నోరే రసభరితమైన నుడువుల కెల్లన్
నారియె నరులకు రత్నము
చీరయె శృంగారమండ్రు సిద్ధము సుమతీ!
భావం: ఎల్లవారికిన్ బ్రతుకుటకు ఆధారమైనది నీరే. నవరసముల తోడను నిండునట్టి మాటలన్నింటీని ఆధారమైనది నోరే. నరులకు స్త్రీయే రత్నమువంటిది.
069
పగవల దెవ్వరి తోడను,
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్,
దెగ నాడ వలదు సభలను
మగువకు మనసియ్య వలదు మహిలో సుమతీ
భావం: భూమియందెవ్వరితోదను విరోధము మంచిది కాదు. దారిద్ర్యము వచ్చిన పిదప విచారింపరాదు. సభలో ఎవ్వరిని దూషింపరాదు. స్త్రీకి తన యొక్క హృదయము తెలియనీయరాదు.
070
పతికడకు, దన్ను గూరిన
సతికడకును, వేల్పు కడకు, సద్గురు కడకున్,
సుతుకడకు రిత్తచేతుల
మతిమంతులు చనరు నీతి మార్గము సుమతీ!
భావం: ప్రభువు కడకును, భార్యకడకును, భగవంతుని సన్నిధానమునకును, గురుదేవుని దగ్గరకును, కుమారుని కడకును వట్టిచేతులతో బుద్ధిమంతులు పోరాదు. ఇదియే నీతిమార్గము.
071
పనిచేయునెడల దాసియు,
ననుభవమున రంభ, మంత్రి యాలోచనలన్,
దనభుక్తి యెడల దల్లియు,
నన్ దన కులకాంత యుండు నగురా సుమతీ!
భావం: ఇంటిపనులు చేసుకొనునప్పుడు దాసిగాను, భోగించునప్పుడు దేవతాస్త్రీయగు రంభగాను, సలహా లొసంగునపుడు మంత్రిగాను, భోజనము పెట్టునపుడు తల్లిగాను వర్తింపగలిగినదిగా భార్యయుండవలయును.
072
పరనారీ సోదరుడై,
పరధనముల కాసపడక, పరులకు హితుడై,
పరులు దను బొగడ నెగడక,
పరు లలిగిన నలుగ నతడు పరముడు సుమతీ!
భావం: ఇతర స్త్రీలను తోడబుట్టిన వారిగా చూచుకొనుచు, ఇతరుల ధనముకొఱకు కాంక్షింపక ఎల్లవారికిష్టుడై, ఇతరులు తన్ను పొగడునప్పుడుప్పొంగక, కోపించినప్పుడు బాధపడక యుండువాడే శ్రేష్టమైనవాడు.
073
పరసతి కూటమి గోరకు,
పరధనముల కాసపడకు, బరునెంచకుమీ,
సరిగాని గోష్టి సేయకు,
సిరిచెడి చుట్టంబు కడకు జేరకు సుమతీ
భావం: ఇతరుల స్త్రీలతోడ కలయికను కోరకుము, ఇతరుల భాగ్యములకు నాసక్తిపడకు, ఇతరులయొక్క దోషములను లెక్కింపకుము. మంచిది కాని సంభాషణ చేయకుము, భాగ్యము పోయినప్పుడు బంధువులకడకు చేరవలదు.
074
పరసతుల గోష్ఠి నుండిన
పురుషుడు గాంగేయుడైన భువి నింద పడున్,
బరసతి సుశీలయైనను
బరుసంగతి నున్న నింద పాలగు సుమతీ!
భావం: పరస్త్రీలతో సరససల్లాపములాడుచుండిన భీష్ముడైనను భూమియందు నిందము పొందును. ఇతర స్త్రీయెంత సుస్వభావయైనను పరపురుషునితో స్నేహం చేసిన అపకీర్తి పాలగును.
075
పరులకు నిష్టము సెప్పకు,
పొరుగిండ్లకు బనులు లేక పోవకు మెపుడున్,
బరు గదిసిన సతి గవయకు,
మెఱిగియు బిరుసైన హయము లెక్కకు సుమతీ
భావం: ఇతరులకు అప్రియములైనవానిని పలుకకుము. పనులులేక పొరుగిండ్లకు పోకుము. ఎప్పుడును పరుని పొందిన భార్యను కలియకుము. తెలిసియుండియు పొగరుబోతైన గుర్రమును ఎక్కకుము.
076
పర్వముల సతుల గవయకు,
ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలో,
గర్వింప నాలి బెంపకు,
నిర్వహణము లేని చోట నిలువకు సుమతీ
భావం: పుణ్యదినములలో స్త్రీలను కలియకుము, ప్రభువుల దయను నమ్మి మనస్సునందు ఉప్పొంగిపోకుము. గర్వమును పొందిన భార్యను పోషింపకుము. సాగుదల లేనిచోట నిలువకుము.
077
పలు దోమి సేయు విడియము,
తలగడిగిన నాటి నిద్ర, తరుణులయెడలన్
బొల యలుక నాటి కూటమి
వెల యింతని చెప్పరాదు వినరా సుమతీ!
భావం: ధంతధావము చేసుకొని, తాంబూలమును వేసుకొని, తలంటుకొనినవాడు పోయిన నిద్రయును, స్త్రీలతోడ ప్రణయకలహం వచ్చిననాటి పొందును అంత్యంత సౌఖ్యప్రదములు, వాటి విలువ ఇంతని చెప్పజాలము.
078
పాటెఱుగని పతి కొలువును,
గూటంబున కెఱుకపడని కోమలి రతియున్,
బేటెత్త జేయు చెలిమియు,
నేటికి నెదురీదినట్టు లెన్నగ సుమతీ
భావం: శ్రమను తెలుసుకొంజాలని ప్రభువును సేవించుటయును, కలయికకు తెలివిలేని స్త్రీతోడి సంభోగమును, వెంటనే భగ్నమగునట్లుగా చేయు స్నేహమును ఆలోచింపగా నదీప్రవాహమునకు ఎదురీదినట్లుగా నుండును.
079
పాలను గలసిన జలమును
పాల విధంబుననె యుండు బరికింపంగా
పాల చవి జెఱచు గావున
పాలసుడగు వాని పొందు వలదుర సుమతీ
భావం: పాలతోగలిసిన నీరు పాలవలెనే పైకి కనబడును, పరిశీలించినచో పాలయొక్క రుచిని చెడగొట్టును. అట్లే చెడ్డవారలతోడి స్నేహము స్వగౌరవము కూడ పోగొట్టజాలును. కావున అట్టి స్నేహము కూడదు.
080
పాలసునకైన యాపద
జాలింబడి తీర్ప దగదు సర్వజ్ఞునకున్
తేలగ్ని బడగ బట్టిన
మేలెఱుగునె మీటు గాక మేదిని సుమతీ
భావం: తేలు నిప్పులో పడినప్పుడు, వానియందు జాలిపడి దానిని బయటకు తీయుటకు పట్టుకొనినచో కుట్టును. కాని మనము చేయబోవు మేలును తెలుసుకొనజాలదు. ఆ విధముగనే జాలిపడి మూర్ఖునకు ఆపదయందు అడ్దుపడజూచిన తిరిగి మనకపకారము చేయును కావున అట్లు చేయరాదు.
Comments
Post a Comment