వేమన పద్యాలు మొదటి భాగం vemana padyalu part one
వేమన పద్యాలు మొదటి భాగం
ఏక బ్రహ్మము నిత్యము
వైకల్పితమైనయట్టి వస్తువులెల్ల
నేకత్వంబని యెఱిగిన
శోకము లేనట్టిముక్తి సులభము వేమా!
ఏకమయినవర్ణ మెఱిఁగినయోగికిఁ
బరము నెఱిఁగిచూడ భావమొందు
నాకృతులును మఱియునన్నిటఁ దానౌను
విశ్వదాభిరామ వినర వేమ!
ఏడె యక్షరముల నీయంద మొందిన
నందు నిందు ముక్తి యలరుచుండు
నందు నిందుఁ దెలియ నదియెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!
ఏమి గొంచువచ్చె నేమి తాఁగొనిపోవుఁ
బుట్టువేళ నరుఁడు గిట్టువేళ
ధనము లెచటి కేఁగు దానేగు నెచటికి
విశ్వదాభిరామ వినర వేమ!
ఏరుదాఁటి మెట్ట కేగినపురుషుండు
పుట్టి సరుకుగొనక పోయినట్లు
యోగపురుషుఁడేల యొడలిఁ బాటించురా
విశ్వదాభిరామ వినర వేమ!
ఏవంక మనసు కలిగిన
నా వంకకు నింద్రియంబు లన్నియు నేగు
నీ వంక మనసు కలిగిన
నే వంకకు నింద్రియంబు లేగవు వేమా!
ఏసూత్ర మరసిచూచిన
స్త్రీ సూత్రం బదియుఁ గాక సిద్ధము కాఁగా
నా సూత్రముఁ స్త్రీ సూత్రము
నాసూత్రముఁ దెలియువాఁడు సాధుఁడు వేమా!
ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు
దాని బలిమి నెంతయైన గూడు
గడ్డి వెంట బెట్టి కట్టరా యేనుంగు
విశ్వదాభిరామ వినురవేమ!
ఒక్కఁడు రోగి యాయె మఱియొక్కఁడు దిక్కులఁ ద్యాగి యాయె
వేఱొక్కఁడు భోగి యాయెనటు నొక్కఁడు చక్కనియోగి యాయెఁ
దా నొక్కఁడు రాగియాయె నినుబోలు మహాత్మునిఁగాన మెచ్చట
నిక్కము నిన్నిరూపములు నీకును జెల్లుగదన్న వేమనా!
ఒక్కఘటములోనఁ బెక్కురూపులు నిల్చు
నెన్నియెన్నిరూపు లెసఁగుచుండు
నవియుఁదొలఁగెనేని యన్నియు బయలౌను
ఆత్మతత్వ మిట్టులౌర వేమా!
ఒక్కమనసుతోడ నున్నది సకలము
తిక్క బట్టి నరులు తెలియలేరు
తిక్క నెఱిఁగి నడువ నొక్కఁడే చాలురా
విశ్వదాభిరామ వినర వేమ!
ఒకటిక్రింద నొక్క డొనర లబ్ధముఁ బెట్టి
వలనుగ గుణియింప వరుసఁ బెరుఁగు
నట్టిరీతి నుండు నౌదార్యఫలములు
విశ్వదాభిరామ వినర వేమ!
ఒకరి నోరుఁగొట్టి యొకరు భక్షింతురు
వారినోరు మిత్తి వరుసఁగొట్టు
చేఁపపిండు పిల్ల చేఁపలఁ జంపును
జనుఁడు చేఁపపిండుఁ జంపు వేమ!
ఒకరికీడు వేర ఒకరికి నియ్యడు
యొకని మేలు వేర యొకరికీడు
కీడుమేలువారు పోడిమి తెలియరు
కాలుడెరుగు వారి గదరవేమ!
ఒడ్డుపొడుగుగల్గి గడ్డంబునిడుపైన
దానగుణములేక దాతయౌనె
యెనుము గొప్పదైన యేనుగున్ బోలునా?
విశ్వదాభిరామ వినురవేమ!
ఒడల భూతిఁ బూసి జడలు ధరించిన
నొడయుఁడైన ముక్తిఁ బడయలేఁడు
తడకబిఱ్ఱుపెట్టఁ దలపుతో సరియౌనె
విశ్వదాభిరామ వినర వేమ!
ఒడలు బడలఁజేసి యోగుల మనువారు
మనసు కల్మషంబు మాన్పలేరు
పుట్టమీదఁ గొట్ట భుజగంబు చచ్చునా
విశ్వదాభిరామ వినర వేమ!
ఒడలుఁ బెంచులంజ యుబ్బకంబుననైన
వేగ విటునిమీఁద విఱుఁగఁబడును
పందికొక్కుమీద బండికల్ పడ్డట్లు
విశ్వదాభిరామ వినర వేమ!
ఒరులకొఱకు భూమి నొరసెటివారును
అవనిపతికి వశ్యులయినవారు
పాలవంటివారు పన్ను పెట్టెడువారు
వాకెఱుంగరు శాఖవారు వేమా!
ఒల్ల నన్నఁ బోదు నొల్ల ననఁగరాదు
తొల్లి చేయునట్టి ధూర్తఫలము
ఉల్లమందు వగవకుండుట యోగ్యంబు
విశ్వదాభిరామ వినర వేమ!
ఒల్లనిపతి నొల్లనిసతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడె
గొల్లండు గాక ధరలో
గొల్లనికిం గలవె వేఱె కొమ్ములు వేమా!
ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని
భావ మిచ్చి మెచ్చు పరమ లుబ్ధు
పంది బురద మెచ్చుఁ బన్నీరు మెచ్చునా?
విశ్వదాభిరామ వినర వేమ!
ఓగుబాగెఱుఁగని యుత్తమూఢజనంబు
లిలను ధీ జనముల నెంచుటెల్ల
కరినిజూచి కుక్క మొఱిగిన సామ్యమౌ
విశ్వదాభిరామ వినర వేమ!
ఓజమాలుపొలతి యోలిమాడలు చేటు
పోటికెడలుబంటు కూటి చేటు
పనికిమాలినతొత్తు బత్తెంబు చేటురా
విశ్వదాభిరామ వినర వేమ!
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment