వేమన పద్యాలు "ఉ" తో మొదలయ్యేవి vemana padyalu starting with u
వేమన పద్యాలు "ఉ" తో మొదలయ్యేవి
ఉండడె సుఖశీలి యుండును గొన్నాళ్లు
యుండి యుండి యుండి యుండలేక
ఉండ వెరవు దెలిసి గండిదొంగను బట్టి
చెండిచెండి తావుచేరు వేమా!
ఉండియుండు జ్ఞాని యుగములు చనినను
బ్రాణహాని లేదు ప్రళయమునను
బ్రాణహానియైనఁ బరమాత్ము గలియునో
విశ్వదాభిరామ వినర వేమ!
ఉచితవంతుఁడైన నుద్యోగపరుఁడైన
సాగుబాటునున్న సమయమునను
పరుల కుపకరించి పరఁగ రక్షించును
విశ్వదాభిరామ వినర వేమ!
ఉచితాహారము వల్లనె
యుచితంబుగ బుద్ధిస్థిరత నొప్పునటులనే
ఉచితమగు బోధవల్లనే
సుచరితుడై పరముగాంచుసుమ్ముర వేమా!
ఉడుగక క్రతువుల తపముల
నడవుల తీర్థముల తిరిగినంతనే ధరలో
నొడయని కనుగొనజాలడు
కడుథీరత గురుడు తెలుపగలడిది వేమా!
ఉత్తమోత్తముండు తత్వజ్ఞుఁ డిలమీద
మహిమఁజూపువాఁడు మధ్యముండు
వేషధారి యుదరపోషకుఁడధముండు
విశ్వదాభిరామ వినర వేమ!
ఉత్తముని కడుపున నోగు జన్మించిన
వాఁడు చెఱచువానివంశమెల్ల
చెఱకువెన్ను పుట్టి చెఱపదా తీపెల్ల
విశ్వదాభిరామ వినర వేమ!
ఉద్దరింపగల్గు నుత్తముండు కులంబు
మధ్యముండు దాని మాట గనడు
అధముడైన వాఁడంగించు నొక్కట
విశ్వదాభిరామ వినురవేమ!
ఉన్న సరికి మనుజుఁ డుపకారి గాలేక
కన్నుగనక పల్కుగర్వములను
దీనులయినవారి దిగువారిగాఁజూచి
పరము గనకనూత బడును వేమ!
ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండుఁ
జూడఁ జూడ రుచుల జాడ వేఱు
పురుషులందు పుణ్య పురుషులు వేఱయా
విశ్వదాభిరామ వినర వేమ!
ఉప్పుచింతపండు వూరిలోనుండన
తాళకంబెరుగరో, తగరంబు నెరుగరో
విశ్వదాభిరామ వినురవేమ!
ఉపము గలుగు నాత డూరకుండగరాదు
గురునితోడ బొందు కూడవలయు
గురుడు సెప్పురీతి గురిమీర రాదయా
విశ్వదాభిరామ వినురవేమ!
ఉపముతోడ గురుని నొప్పుగ సేవించి
జపము హృదినిజేయు జాడ నెరిగి
తపము చేయువాడు తత్త్వజ్ఞుడగు యోగి
విశ్వదాభిరామ వినురవేమ!
ఉపముదోపనట్టి యుపవాసముల లేదు
తపముచేయనైన తగులరాదు
జపముతోన గురుని జవదాటకుండురా
విశ్వదాభిరామ వినురవేమ!
ఉపవసించుచుండి యోగి నీళ్ళలోమున్గి
కూడువండి వేల్పు గడువుమనుచు
దానినోరుగట్టి తామెతిందురుగదా!
విశ్వదాభిరామ వినురవేమ!
ఉపవసములనున్న నూరపందిగఁబుట్టుఁ
దపసియై దరిద్రతను వహించు
శిలకు మ్రొక్కనగునె జీవమడుగు పొమ్ము
విశ్వదాభిరామ వినర వేమ!
ఉర్వి గురుని వేడి యబ్బురపడువాడు
దబ్బరాడబోడు తత్తరమున
నిబ్బరంపు మదిని నిర్విణ్ణతనుగాంచు
విశ్వదాభిరామ వినురవేమ!
ఉర్విజనులు పరమయోగీశ్వరునిఁ జూచి
తెగడువారె గాని తెలియలేరు
అమృతస్వాదురుచులహస్త మేమెఱుఁగును
విశ్వదాభిరామ వినర వేమ!
ఉర్వివారికెల్ల నొక్కకంచముఁబెట్టి
పొత్తుఁ గుడిపికులము పొలయఁ జేసి
తలను చేయిపెట్టి తగ నమ్మఁజెప్పరా
విశ్వదాభిరామ రామరవు మ మమ
ఉసురు లేనితిత్తి యిసుమంత నూదిన
పంచలోహములును భస్మమౌను
పెద్ద లుసురుమన్న పెనుమంట లెగయవా
విశ్వదాభిరామ వినర వేమ!
Comments
Post a Comment