పతంజలి యోగ సూత్రాలు కైవల్య పాదం patanjali yoga sutralu kaivalya padham
పతంజలి యోగ సూత్రాలు
కైవల్య పాదం
1. జన్మౌషధిమంత్రతపఃసమాధిజాః సిద్ధయః
సిద్ధశక్తులు జన్మతః వస్తాయి. లేదా ఓషధులతో గానీ, మననం, సాధన, ధ్యానంతో గానీ సాధించవచ్చు.
2. జాత్యంతరపరిణామః ప్రకృత్యాపూరాత్
ఒక జీవి మరొక జీవిగా పరిణామం పొందడానికి కారణం సహజసిద్ధమైన ప్రకృతి.
3. నిమిత్తమప్రయోజకం ప్రకృతీనామ్ వరణభేదస్తు తతః క్షేత్రికవత్.
పునర్జన్మకి పాపపుణ్యాలు స్వయంగా కారణాలు కావు.అవి కేవలం సహజ పరిమాణంలో అవాంతరాలను దాటడానికి ఉపయోగపడతాయి. రైతు ఏటినీరు పారుదలకి అడ్డమైన వాటిని తొలగించి పారుదల సుఖకరం చేసినట్టే.
4. నిర్మాణచిత్తాన్యస్మితామాత్రాత్.
చిత్తమును అస్మిత మాత్రమే సృష్టించగలదు.
5. ప్రవృత్తిభేదే ప్రయోజకమ్ చిత్తమేకమనేకేషామ్.
వేరు వేరు జీవుల చిత్తముల ప్రవర్తన భిన్నంగా ఉన్నా, వీటి అన్నిటిమీద ఆధిపత్యం వహించే చిత్తము వేరొకటి ఉన్నది.
6. తత్ర ధ్యానజమనాశయమ్.
చిత్తములు వేరు వేరు రూపాలలో ఉన్నా, స్వచ్ఛమైన చిత్తము మాత్రమే సమాధిద్వారా అంతరాంతరాల అణగి ఉన్న కర్మఫలాలనుండీ కోరికలనుండీ విముక్తి పొందగలదు.
7. కర్మాశుక్లాకృష్ణమ్ యోగినస్త్రివిధమితరేషామ్
యోగికి మంచి కర్మా చెడు కర్మా అంటూ లేవు. ఇతరులకు కర్మ మూడు విధములు, మంచిఫలితాలనిచ్చేది, చెడుఫలితాలనిచ్చేది లేదా మిశ్రమ ఫలితాలనిచ్చేది.
8. తతస్తద్విపాకానుగుణానామేవాఽభివ్యక్తర్వాసనానామ్
ఒక జన్మలో చేసిన కర్మయొక్క ఫలితాలు వాసనలుగా మరుజన్మలో వ్యక్తమవుతాయి.
9. జాతిదేశకాలవ్యవహితానామప్యానంతర్య్యమ్ స్మృతి సంస్కారయోరేకరూపత్వాత్
దేశము, కాలము, స్థూలరూపము(జన్మ) వేరు అయినా స్మృతి, సంస్కారములలో వ్యత్యాసము ఉండదు. అంచేత వాసనలు వ్యక్తమవడానికి తగిన సమయంలో అనుగుణమైన జన్మ కలిగినప్పుడు మళ్ళీ వ్యక్తమవుతాయి.
10. తాసామనాదిత్వమ్ చాశిషో నిత్యత్వాత్.
ఈ వాసనలకి మొదలు లేదు కనక జీవితాశ కూడా అనంతంగా సాగుతూనే ఉంటుంది.
11. హేతుఫలాశ్రయాలంబనైః సంగృహీతత్వాదేషామభావే తదభావః
హేతువు, ఫలము, సాధకుడు ఆచరించే క్రియలు ఆధారంగా వాసనలు ప్రోది అవుతాయి కనక వాటిని తొలగిస్తే, వాటికి ఆధారమయిన అవిద్య నశిస్తుంది.
12. అతీతానాగతమ్ స్వరూపతోఽస్త్యధ్వభేదాద్ధర్మాణామ్
గతమూ, భవిష్యత్తూ స్వరూపాలలో తేడా ఉంది. వాటి మార్గాలను అనుసరించి వాటి తత్త్వాలు ఉంటాయి.
13. తే వ్యక్తసూక్ష్మా గుణాత్మానః
అవి స్థూలంగానో సూక్ష్మంగానో వాటి సహజప్రకృతులని అనుసరించి వ్యక్తమవుతాయి.
14.పరిణామేకత్వాద్వస్తుతత్త్వమ్
వస్తువు యొక్క తత్త్వం ఆ వస్తువు మార్పు చెందే ఉంటుంది.
15. వస్తుసామ్యే చిత్తభేదాత్తయోర్విభక్త పంథాః
వేరు వేరు సాధకుల చిత్తములలో వ్యత్యాసాలమూలంగా ఒకే వస్తువుగురించిన అభిప్రాయాలు వేరు వేరుగా ఉంటాయి.
16. న చైకచిత్తతంత్రమ్ వస్తు తదప్రమాణకమ్ తదా కిం స్యాత్?
ఒక వస్తువుయొక్క అస్తిత్వం ఒక వ్యక్తి చిత్తముమీద మాత్రమే ఆధారపడి ఉండదు. మరి ఆ వ్యక్తి ఆ వస్తువును గమనించనప్పుడు ఏమవుతుంది?
17. తదుపరాగాపేక్షిత్వాచ్చిత్తస్య వస్తు జ్ఞాతాజ్ఞాతమ్.
ఒక వస్తువును గురించి తెలియడం కానీ తెలియకపోవడం కానీ ఆ వస్తువుకి సంబంధించినంతవరకూ దాన్ని చూచే వ్యక్తి ఆలోచనలను బట్టి ఉంటుంది.
18. సదా జ్ఞాతాశ్చిత్తవృత్తయస్తత్ ప్రభోః పురుషస్యాపరిణామిత్వాత్.
పరమపురుషుడికి మార్పు లేదు. అతడు సమస్త చిత్తవృత్తులలో మార్పులను గ్రహించగలవాడు.
19. నతత్స్వాభాసమ్ దృశ్యత్వాత్.
చిత్తము స్వయంప్రకాశము కాదు. ఇతరులకు మాత్రమే చిత్తమును పరిశీలించడం సాధ్యము.
20. ఏకసమయే చోభయఽనవధారణమ్
చిత్తమునకు ఒకే సమయంలో రెంటిమీదా – ఆత్మ, ద్రష్టలమీద- ధ్యానము నిలపడం
సాధ్యము కాదు.
21. చిత్తాంతరదృశ్యే బుద్ధిబుధ్ధేరతిప్రసంగః స్మృతిసంకరశ్చ.
ఒక చిత్తము మరొక చిత్తమును అర్థం చేసుకోడానికి ఆ రెంటికంటే వేరు అయిన మరొక బుద్ధి కావాలి వాటిని పరిశీలించడానికి. అది అసాధ్యం. అది ఆ కారణంగా స్మృతిలో అయోమయం కలిగించడానికి కారణమవుతుంది.
22. చిత్తేరప్రతిసంక్రమాయాస్తదాకారాపత్తౌ స్వబుద్ధిసంవేదనమ్.
ఒక ప్రవృత్తినుండి మరొక ప్రవృత్తికి మారని స్థితి చిత్తమునకు కలిగినతరవాత స్వబుద్ధిని తెలుసుకోగలదు.
23. ద్రష్టృద్దృశ్యోపరక్తం చిత్తం సర్వార్ధమ్.
ద్రష్ట, దృశ్యముల ప్రవృత్తులను గ్రహించిన చిత్తమునకు తానే ద్రష్ట అయి ఆ చిత్తమును పరిశీలించగల శక్తిని పొందగలదు.
24. తదసంఖ్యేయవాసనాభిశ్చిత్రమపి పరార్థమ్ సంహత్యకారిత్వాత్.
చిత్తము అనేక వాసనలతో నిండి ఉన్నప్పటికీ పరమపురుషునికి చేరువ కావడంచేత, తదనుగుణంగా ప్రవర్తిస్తుంది.
25. విశేషదర్శిన ఆత్మభావభావనావినివృత్తిః
అనుభూతి ఆత్మలమధ్య విభేదము గమనించిన సాధకుడు చిత్తమును సంపూర్ణంగా నిరోధించగలడు.
26. తదా వివేకనిమ్నమ్ కైవల్యప్రాగ్భారమ్ చిత్తమ్
అప్పుడే చిత్తము వివేకముతో ప్రాపంచికపరమైన ఆత్మనుండి సంపూర్ణంగా విడివడి పరమపురుషునికి చేరువ అవుతుంది.
27. తచ్ఛిద్రేషు ప్రత్యయాంతరాణి సంస్కారేభ్యః
ఆవిధంగా ప్రశాంతత పొందిన చిత్తములో సూక్ష్మవిషయాలు లేదా స్మృతులు అంతరాంతరాలనుండి తిరిగి వెలువడి గోచరము అవుతాయి.
28. హానమేషాం క్లేశవదుక్తమ్.
వీటిని కూడా తొలగించడం (ముందు చెప్పుకున్న) చిత్తవృత్తులకి సంబంధించిన క్లేశములను తొలగించడం వంటిదే అని యోగులు చెప్తారు.
29. ప్రసంఖ్యానేఽప్యకుసీదస్య సర్వథా వివేకఖ్యాతేర్ధర్మమేఘస్సమాధిః
ఎవరు ఆ సమాధిలో లౌకికలాభమును గమనించరో వారికి ఇతోధికంగా సద్వివేచన లభిస్తుంది, మేఘములు స్వతస్సిద్ధంగా వర్షించినట్టు.
30. తతః క్లేశకర్మనివృత్తిః
అప్పుడు అనేక జన్మలతాలూకు క్లేశములు మళ్ళీ మళ్ళీ బయట పడడం ఆగిపోతుంది.
31. తదా సర్వావరణమలాపేతస్య జ్ఞానస్యానంత్యాజ్ఞేయమల్పమ్.
ఆ తరవాత, ఈ ఉత్కృష్ట వివేచనతో పోలిస్తే చిత్తములో వసిస్తున్న మానసికమైన, బౌద్ధికమైన వికారాలు చాలా అల్పమయినవిగానూ అర్థరహితంగానూ కనిపిస్తాయి.
32. తతః కృతార్థానాం పరిణామక్రమసమాప్తిగుణానామ్.
ఆ పరిణామ క్రమం పని పూర్తయిన తరవాత పరిణామదశ అంతమవుతుంది.
33. క్షణప్రతియోగీ పరిణామాపరాంతనిర్గ్రాహ్యః క్రమః
ఆ పరిణామానికి కారణమైన సమయం అంతమైన తరవాత ఆ క్రమం కూడా అంతమవుతుంది. పరిణామక్రమం పూర్తి అయిందన్న విషయం సాధకునికి స్పష్టమవుతుంది.
34. పురుషార్థశూన్యానామ్ గుణానామ్ ప్రతిప్రసవః కైవల్యమ్ స్వరూపప్రతిష్ఠా వా చిత్తశక్తిరితి.
సాధారణ మానవులకి ధ్యేయం అయిన విషయాలలో ఆత్మ (లౌకికమైన) చిత్తమునుండి, ప్రాపంచిక విషయప్రభావాలనుండి విడివడి, యోగియొక్క భగవత్పరమైన ఆత్మలో లయమవుతుంది. అదే సమాధి.
All copyrights reserved 2012 digital media act

Comments
Post a Comment