పతంజలి యోగ సూత్రాలు సాధన పాదం patanjali yoga sutralu sadhana padham


పతంజలి యోగ సూత్రాలు

సాధన పాదం

పతంజలి యోగ సూత్రాలు సాధన పాదం patanjali yoga sutralu sadhana padham



1. తపస్స్వాధ్యాయేశ్వరప్రణిధానాని క్రియాయోగః
యోగసాధన మూడు భాగాలు. అవి తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరునియందు మనస్సును లగ్నము చేయడం.

2. సమాధిభావనార్థః క్లేశతనుకరణార్థశ్చ
 ఈ క్రియాయోగం ఆచరించడం క్లేశములను నశింపజేసి సమాధిస్థితి పొందడానికి.

3. అవిద్యాఽస్మితారాగద్వేషాభినివేశాః పంచక్లేశాః
క్లేశములు ఐదు. అవి అజ్ఞానం, అస్మిత (అహమిక), రాగము, ద్వేషము, అభినివేశము (జీవితేచ్ఛ, మరణభయం).

4. అవిద్యాక్షేత్రముత్తరేషాం ప్రసుప్తతనువిచ్ఛిన్నోదారాణామ్
అవిద్య మిగతా నాలుగు క్లేశములకు హేతువు. క్లేశములు అంతర్లీనమయి ఉంటాయి. లేదా క్షీణిస్తూనో వృద్ధి పొందుతూనో ఉంటాయి.

5. అనిత్యాశుచి దుఃఖానాత్మసు నిత్యశుచీ సుఖాఽత్మ ఖ్యాతిరవిద్యా
అనిత్యము అనీ, అశుద్ధమైనదానిని పరిశుద్ధమైనది అనీ, దుఃఖమును సుఖమనీ భ్రమించడమే అవిద్య.

6. దృగ్దర్శనశక్త్యోరేకాత్మతేవాస్మితా
దృక్కుని (సాధారణ బుద్ధిని) దర్శనశక్తిగా గుర్తించడం అస్మిత.

7. సుఖానుశయీ రాగః
మమత్వము సుఖమును కలిగిస్తుంది.

8. దుఃఖానుశయీ ద్వేషః
ద్వేషం  దుఃఖమును కలిగిస్తుంది.

9. స్వరసవాహీ విదుషోఽపి తథాఽఽరూఢోఽభినివేశః
పండితులలో సైతం జీవితేచ్ఛ, మరణభయం అజ్ఞానమువల్లనే అభివృద్ధి చెందుతాయి.

10. తే ప్రతిప్రసవహేయాః సూక్ష్మాః
ఈ విషయముల (రాగద్వేషాలు, అహం, అభినివేశం) మూలములను గుర్తించి, వాటిని ప్రతిఘటించి నివర్తింపచేయాలి.

11. ధ్యానహేయాస్తద్వృత్తయః
క్లేశములను ధ్యానముతో నివర్తింపచేయాలి.

12. క్లేశమూలః కర్మాశయో దృష్టాదృష్టజన్మవేదనీయాః
క్లేశములు (రాగద్వేషాలు, అభినివేశము) ప్రస్తుత జన్మలోనూ భావి జన్మలలోనూ కర్మలవలన కలుగుతాయి. కర్మలకు మూలము అస్మిత. క్లేశములవలన కర్మలూ, కర్మలవలన క్లేశములు పునరావృతము అవుతూ మళ్ళీ మళ్లీ జన్మించడానికి కారణం అవుతాయి.

13. సతి మూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః
 ఒక జన్మలో జీవి చేసిన కర్మలయొక్క ఫలములను అనుసరించి మరుజన్మలో జాతి, ఆయుష్షు, ఇతర భోగములు కలుగుతాయి.

14. తే హ్లాదపరితాపఫలాః పుణ్యాపుణ్య హేతుత్వాత్
 ఒక జన్మలో చేసిన పుణ్యపాపాలను అనుసరించి మరుజన్మలో సుఖదుఃఖాలు అనుభవము అవుతాయి.

15. పరిణామతాపసంస్కారదుఃఖైర్గుణవృత్తివిరోధాచ్చ దుఃఖమేవ సర్వం వివేకినః
అనవరతమూ మారే పరిస్థితులు, భౌతిక సుఖాలు, సాత్త్విక తామస రాజస గుణాలు – వీటివలన కలిగే పరస్పర విరుద్ధ అనుభవాలూ - అన్నిటినీ వివేకవంతుడు దుఃఖభాజనముగా పరిగణిస్తాడు.

16. హేయమ్ దుఃఖమనాగతమ్ .
భావి జన్మలలో కలగనున్న దుఃఖములను ప్రస్తుత జన్మలో ఉపసంహరించుకోవాలి.

17. ద్రష్టృదృశ్యయోః సంయోగో హేయహేతుః
(చూచేవాడు) తనకీ దృశ్యమునకూ (దృశ్యమాన ప్రపంచం) మధ్య విభేదము లేదన్న భావన ఉపసంహరించవలసి ఉంది.

18. ప్రకాశక్రియాస్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యమ్
 దృశ్యముయొక్క గుణములు కాంతి, ఆచరణ (క్రియాశీలత), స్థిరత్వము. సాధకుడు ఇంద్రియములద్వారా కలిగిన అనుభవాలను గుర్తించి, వాటినుండి తన దృష్టిని యోగసాధనవైపు మళ్ళించడమే దృశ్యముయొక్క ప్రయోజనము.

19. విశేషావిశేష లింగమాత్రాలింగాని గుణపర్వాణి
 ఈ గుణాలు నాలుగు విధాలుగా చెప్పుకోవచ్చు – ప్రత్యేకత కలిగినవి, సాధారణమైనవి, సూచనప్రాయమైనవి, సూచనప్రాయంగానైనా ఏమీ చెప్పనివి.

20. ద్రష్టా దృశిమాత్రః శుద్ధోఽపి ప్రత్యయానుపశ్యః
 ద్రష్ట (ఆత్మ) స్వతస్సిద్ధంగా పరిశుద్ధము అయినా దృశ్యమును ఇంద్రియాలద్వారా చూడడం జరుగుతుంది.

21. తదర్థ ఏవ దృశ్యస్యాత్మా
 ద్రష్ట ఏర్పడినది దృశ్యముయొక్క అనుభవంకోసం మాత్రమే.

22. కృతార్థం ప్రతి నష్టమప్యనష్టం తదన్యసాధారణత్వాత్
 అది గ్రహించినవారికి దృశ్యము కనిపించకుండా పోతుంది. కానీ ఆ అవగాహన లేనివారికి మాత్రం ఆ దృశ్యం కనిపిస్తూనే ఉంటుంది.


23. స్వస్వామిశక్త్యోః స్వరూపలబ్ధిహేతుస్సంయోగః
 ఆత్మ ప్రకృతి, దృశ్యము పురుషుడు. ప్రకృతి ధ్యేయము ఆత్మజ్ఞానం. పురుషుని ధ్యేయం సంయోగముద్వారా ఆ రెంటి స్వరూపాలను తెలివిడి చేయడం.


24. తస్య హేతురవిద్యా
 ప్రకృతి పురుషుల సంయోగానికి కారణం అవిద్య.


25. తదభావాత్ సంయోగాభావో హానం తద్దృశేః కైవల్యమ్
అవిద్య నశించినతరవాత సంయోగం అంతమవుతుంది. అదే విముక్తి. దృశ్యమాన ప్రపంచంనుండి విడివడగలగడమే కైవల్యము. (నాల్గవ అధ్యాయములో విపులముగా వివరించబడింది).


26. వివేకఖ్యాతిరవిప్లవా హానోపాయః
 అవిద్యను తొలగించగల సాధనము విచారణ. దానిని నిరవధికంగా స్పష్టంగా నిర్దుష్టంగా కొనసాగించాలి.


27. తస్య సప్తధా ప్రాంతభూమిః ప్రజ్ఞా
 అవిద్యను నాశనము చేసి ప్రజ్ఞ సాధించడానికి ఏడు పద్ధతులు ఉన్నాయి. (ఆ ఏడు పద్ధతులు - నిత్యానిత్య వస్తు వివేకజ్ఞానం, సమస్త దుఃఖనివారణ, పరిపూర్ణజ్ఞానప్రాప్తి, కర్తవ్య త్యాగబుద్ధి, స్వాతంత్ర్యం, చిత్తస్వాధీనం, నిరాశ్రయమైన జ్ఞానం.)


28. యోగాంగానుష్ఠానాదశుద్ధిక్షయే జ్ఞానదీప్తిరవివేకఖ్యాతేః
 యోగాంగములు అనుష్ఠించడంవల్ల అవిద్య నశించి జ్ఞానదీపం ప్రకాశిస్తుంది.


29.యమనియమాఽసనప్రాణాయామప్రత్యాహారధారణధ్యానసమధయోఽష్టావంగాని
 యోగసాధనలో ఎనిమిది అంగములు ఉన్నాయి. అవి యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, నిశ్చల ధ్యానము, అనవరత ధ్యానము, సమాధి.


30. అహింసాసత్యమస్తేయబ్రహ్మచర్యాపరిగ్రహా యమాః
యమములు ఐదు. అవి అహింస, సత్యము, చోరబుద్ధి లేకుండుట, బ్రహ్మచర్యం, పరుల సొమ్ము స్వీకరించకుండుట.


31. జాతిదేశకాలసమయానవచ్ఛిన్నాః సార్వభౌమా మహావ్రతమ్
 కులం, స్థలం, కాలం, పరిస్థితులవల్ల కలిగే అవధులను లెక్క చేయకుండా నియమాలను ఆచరించడమే మహా వ్రతము.


32. శౌచసంతోషతపః స్వాధ్యాయేశ్వరప్రణిధానాని నియమాః
 నియమములు ఐదు. అవి పరిశుభ్రత (మనస్సు, శరీరము), ఆనందము, తపస్సు, స్వాధ్యాయము, భగవంతునియందు చిత్తము లగ్నము చేయడం.


33. వితర్కబాధనే ప్రతిపక్షభావనమ్
 బాధించే తలపులను వాటికి వ్యతిరేకమైన భావాలతో తొలగించుకోవాలి.


34. వితర్కా హింసాదయః కృతకారితానుమోదితా లోభక్రోధమోహపూర్వకామృదుమధ్యాధిమాత్రాదుఃఖాజ్ఞానానంతఫలా ఇతి ప్రతిపక్షభావనమ్
 యోగసాధనకి ప్రతిబంధకమైన హింసవంటి చర్యలు స్వయంకృతం గానీ ఇతరుల చర్యలవల్ల గానీ సంభవిస్తాయి. కోపము, లోభము లేదా మోహము ఇత్యాదులవల్ల కలుగవచ్చు. అవి ఏ స్థాయిలోనైనా - మహోధృతంగానో, ఓ మోస్తరుగానో, సాధారణస్థాయిలో -సాధకునిచర్యగా పరిణమించవచ్చు. అందుచేత ఆ యా ప్రవృత్తులను వాటికి తగిన వ్యతిరేక భావనలతో అరికట్టాలి.

35. అహింసాప్రతిష్ఠాయాం తత్సన్నిధౌ వైరత్యాగః
అహింసాప్రవృత్తిని గట్టి పట్టుదలతో నిలకడగా పాటించినవాని సమీపంలో వైరభావాలు నిలువవు.

36. సత్యప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వమ్
నిత్య సత్యవ్రతుని కర్మలు సత్ఫలితాలను ఇస్తాయి.


37. అస్తేయప్రతిష్ఠాయాం సర్వరత్నోపస్థానమ్
 చోరబుద్ధిని జయించినవానికి సకల సంపదలు సమకూరుతాయి.


38. బ్రహ్మచర్యప్రతిష్ఠాయాం వీర్యలాభః
 దృఢచిత్తంతో బ్రహ్మచర్యదీక్ష పూనినవానికి శారీరక, మానసిక దారుఢ్యము కలుగుతుంది.



39. అపరిగ్రహస్థైర్యే జన్మకథంతాసంబోధః
 పరులసొమ్ము స్థిరచిత్తముతో తిరస్కరించినవాడు జన్మవృత్తాంతమునుగురించి తెలుసుకొనగలడు.


40. శౌచాత్ స్వాంగజుగుప్సా పరైరసంసర్గః
 పరిశుభ్రతను పాటించడంవలన తన శరీరము అంటే రోత, ఇతరులతో సంపర్కము విషయంలో వైముఖ్యం సిద్ధిస్తాయి.


41. సత్త్వశుద్ధిసౌమనస్యైకాగ్ర ఇంద్రియజయాత్సమదర్శనయోగ్యత్వాని చ
మనసు నిర్మలముగా ఉంచుకున్న సాధకుడు సాత్వికగుణము, మంచితనము, ఏకాగ్రత, ఇంద్రియనిగ్రహము, ఆత్మదర్శనము పొందగలడు.


42. సంతోషాదనుత్తమసుఖలాభః
 నిత్య సంతుష్టునికి అత్యుత్తమైన ఆనందము సిద్ధిస్తుంది.


43. కాయేంద్రియసిద్ధిరశుద్ధిక్షయాత్తపసః
 తపోనిష్ఠ శరీరాన్నీ ఇంద్రియములనూ అంటి ఉన్న మాలిన్యమును తొలగిస్తుంది.


44. స్వాధ్యాయాదిష్టదేవతా సంప్రయోగః
 స్వాధ్యాయమువలన ఇష్టదేవతలను చేరగలుగుతాడు.


45. సమాధిసిద్ధిః ఈశ్వరప్రణిధానాత్
ఈశ్వరునియందు చిత్తము లగ్నము చేయడంవలన సమాధి సిద్ధిస్తుంది.


46. స్థిరసుఖామాసనం
 స్థిరంగానూ ఇబ్బంది కాని విధంగానూ కూర్చోడం ముఖ్యం.


47. ప్రయత్నశైథిల్యానంతసమాపత్తిభ్యామ్
 అది సమాధిస్థితి చేరుకోడానికి సహాయకారి అవుతుంది.


48. తతో ద్వంద్వానభిఘాతః
 ఆ పైన సుఖదుఃఖాలు, శీతోష్ణాలవంటి ద్వంద్వములు బాధించవు.


49. తస్మిన్ సతి శ్వాసప్రశ్వాసయోర్గతివిచ్ఛేదః ప్రాణాయామః
 ఊపిరి పీల్చి ఉంచడం, వదలి ఉంచడం (పూరక, రేచక క్రియలు) యోగసాధనకు నిర్ణీతమైన పద్ధతిలో చేయడం ప్రాణాయామము.


50. బాహ్యాభ్యంతరస్తంభవృత్తిః దేశకాలసంఖ్యాభిః పరిదృష్టో దీర్ఘసూక్ష్మః
ఊపిరి పీల్చి ఆస్థితిలో ఉండడం (పూరక),ఊపిరి వదలి ఆ స్థితిలో ఉండడం (రేచక) రెండు పద్ధతులు. అలా ఊపిరి బిగబట్టి గానీ బయటికి వదలి గానీ ఎంతసేపు నిలపడం అన్నది సాధకుని సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. అలాగే రోజుకి ఎన్నిసార్లు చేయడం అన్నది కూడా సాధకుడు నిర్ణయించుకోవాలి.


51. బాహ్యాంతరవిషయాఽక్షేపీ చతుర్థః
 ఈ ప్రాణాయామము నాలుగు స్థాయిలలో ఉంటుంది.


52. తతః క్షీయతే ప్రకాశాఽవరణమ్
 అది అంతర్జ్యోతిని ఆవరించిన అంధకారాన్ని నశింపచేస్తుంది.

53. ధారణాసు చ యోగ్యతా మనసః
ఈ అష్టాంగములను ఆచరించడంద్వారా సాధకుడు పరమపురుషుని చేరడానికి తగిన యోగ్యత, సామర్ధ్యము పొందగలడు.


54. స్వవిషయాసంప్రయోగే చిత్తస్య స్వరూపానుకార ఇవేంద్రియాణాం ప్రత్యాహారః
 ఇంద్రియప్రవృత్తులను (చూడడం, వినడం వంటివి) వాటికి లక్ష్యాలు అయిన వస్తువులనుండి నివర్తింపజేయడమే ప్రత్యాహారం.


55. తతః పరమా వశ్యతేంద్రియాణాం
 ఈ అభ్యాసాలను ఆచరించడంద్వారా ఇంద్రియములను సంపూర్ణంగా జయించగలడు.


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics