పతంజలి యోగ సూత్రాలు విభూతి పాదం patanjali yoga sutralu vibuthi padham

పతంజలి యోగ సూత్రాలు

విభూతి పాదం

పతంజలి యోగ సూత్రాలు విభూతి పాదం patanjali yoga sutralu vibuthi padham

1. దేశబంధశ్చిత్తస్య ధారణా
చిత్తమును ఒకే ఒక్క స్థానములో నిశ్చలంగా ఉంచడం ధారణ.


2. తత్ర ప్రత్యయైకతానతా ధ్యానమ్
 ధ్యానానికి కేంద్రమైన వస్తువుమీద అచంచలంగా ఏకాగ్రతతో దృష్టి నిలపడం ధ్యానము.

3. తదేవార్థమాత్రానిర్భాసమ్ స్వరూపశూన్యమివ సమాధిః
ధ్యానం సాఫల్యమైతే సాధకునికి స్థూలశరీరానికీ సమస్త ప్రపంచానికీ అతీతమైనదీ, తనలో అంతర్లీనంగా ఉన్నదీ అయిన అంతర్జ్యోతి కనిపిస్తుంది. అదే సమాధి.

4. త్రయమేకత్ర సంయమః
 ఈ మూడింటినీ కలిసికట్టుగా (ధారణ, ధ్యానము, సమాధి) సంయమము అంటారు.

5. తజ్జయాత్ ప్రజ్ఞాఽఽలోకః
 సంయమము చేస్తే ప్రజ్ఞ కలుగుతుంది.

6. తస్య భూమిషు వినియోగః
 ఆ ప్రజ్ఞను క్రమపద్ధతిలో వినియోగించుకోవాలి.

7. త్రయమంతరంగమ్ పూర్వేభ్యః
 సాధన పాదం 29వ సూత్రంలో ప్రస్తావించిన ఐదు విధాలకి (యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారము) భిన్నంగా ఈ మూడూ (ధ్యానం, ధారణ, సమాధి) అంతరంగానికి సంబంధించినవి.

8. తదపి బహిరంగమ్ నిర్బీజస్య
 అష్టాంగాలలో యమ, నియమ మొదలైన ఐదు స్థితులకంటె సంయమం ఉత్తమమే అయినా అది ప్రాథమిక దశలో బహిరంగ సాధనగా ఉంటుంది.

9. వ్యుత్థాననిరోధసంస్కారయోరభిభవప్రాదుర్భావౌ నిరోధక్షణచిత్తాన్వయో నిరోధపరిణామః
 ప్రారంభదశలో కింది స్థాయిలో చిత్తవృత్తులను అదుపులో ఉంచడానికి నిరోధక చిత్తవృత్తులు పుడతాయి. సాధకుడు వాటిని కూడా తొలగించుకోవాలి. ఈ చిత్తవృత్తులు పుట్టడం, వాటిని నిరోధించడం – ఈ నిరోధకపరిణామాన్ని సాధకుడు గుర్తించడం సాధనలో ఒక పరిణామదశ.

10. తస్య ప్రశాంతవాహితా సంస్కారాత్
 ఆ సాధనతో ధ్యానం ఏకోన్ముఖంగా సాగి ఆధ్యాత్మికమైన ప్రశాంతత లభిస్తుంది సాధకునికి.

11. సర్వార్థతైకాగ్రతయోః క్షయోదయౌ చిత్తస్య సమాధి పరిణామః
 చిత్తవృత్తులు కలగడం, వాటిని నిరోధించడం, నిరోధిస్తున్నానన్న స్పృహ సాధకునికి కలగడంచేత ఇతర ఆలోచనలన్నీ తొలగి ఏకాగ్రత సాధిస్తాడు. చిత్తము సమాధిస్థితి చేరువ అవుతుంది.

12. తతః పునః శాంతోదితౌ తుల్యప్రత్యయౌ చిత్తస్యైకాగ్రతాపరిణామః
 ఆవిధంగా చిత్తవృత్తులు పుట్టడం గిట్టడం సమాన స్థాయిలో (హెచ్చుతగ్గులు లేకుండా) జరిగినప్పుడు ఆ స్థితికి ఏకాగ్రతా పరిణామం అని పేరు.

13. ఏతేన భూతేంద్రియేషు ధర్మలక్షణావస్థాపరిణామా వ్యాఖ్యాతాః
 చిత్తము యొక్క పరిణామము వివరించినతరవాత, ఆ పరిమాణానికి ఇంద్రియముల ధర్మము (తత్వము), లక్షణములు, అవస్థలతో (పరిస్థితి) గల సంబంధాన్ని వివరిస్తున్నారు.

14. శాంతోదితావ్యపదేశ్యధర్మానుపాతీ ధర్మీ
 ధర్మము అంతర్లీనంగానో అవ్యక్తంగానో వ్యక్తంగానో ప్రతి జీవిలోనూ ఉండడం సర్వసాధారణం.

15. క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతుః
 పరిణామంలో తేడాలకి కారణం పరిణామ క్రమం (చిత్తము ఒక దశనుండి మరొక దశకి పరిణమించే క్రమం)

16. పరిణామత్రయసంయమాదతీతానాగతజ్ఞానమ్
 ఈ ధర్మ, లక్షణ, అవస్థలను (పరిణామత్రయం) స్వాధీనం చేసుకున్న సాధకునికి గత, భావి జన్మలగురించిన జ్ఞానం కలుగుతుంది.

17. శబ్దార్థప్రత్యాయానామితరేతరాధ్యాసాత్సంకరః
తత్ప్రవిభాగ సంయమాత్సర్వభూత రుతజ్ఞానమ్
శబ్దం (పదము), అర్థం, వాటికి మూలమైన వస్తువు – సాధారణంగా ఒకదానితో ఒకటి కలిసిపోయి అయోమయం కలిగిస్తాయి. సంయమంతో వీటిని విడదీసి స్వాధీనం చేసుకుంటే సమస్త జీవుల భాషను అర్థం చేసుకోడం సాధ్యం.

18. సంస్కారసాక్షాత్కరణాత్పూర్వజాతిజ్ఞానమ్
సంస్కారంమూలంగా (పైన వివరించిన మూడు స్థాయీభావాలను అర్థం చేసుకోడంవలన) పూర్వజన్మగురించిన జ్ఞానము కలుగుతుంది.

19. ప్రత్యయస్య పరచిత్తజ్ఞానమ్
 ఇతరచిత్తములతో సంయమంద్వారా వారి చిత్తముయొక్క స్వభావం గ్రహించగలరు.

20. న చ తత్సాలంబనమ్ తస్యావిషయీభూతత్వాత్వ్
 అయితే ఆ జ్ఞానము కేవలము చిత్తస్వభావానికి సంబంధించినదే కానీ ఆ స్వభావానికి మూలమయిన చిత్తవృత్తులను, తెలుసుకోవడం సాధ్యం కాదు. వేరు వేరు జీవులలో చిత్తవృత్తులు వేరు వేరుగా ఉంటాయి కనక. పైగా సంయమంయొక్క ధ్యేయం అది కాదు

21. కాయరూపసంయమాత్ తద్గ్రాహ్యశక్తి స్తంభే చక్షుష్ప్రకాశాసంప్రయోగేఽన్తర్ధానమ్
 శరీరాన్ని కేంద్రము చేసుకుని సంయమం ఆచరించడంద్వారా ఆ దేహానికీ, దానిని చూచే కళ్ళకీ మధ్య గల సంబంధం తెగిపోతుంది. తద్వారా ఆ దేహం ఇతరులకి అగోచరము అవుతుంది.

22. ఏతేన శబ్దాద్యంతర్ధానముక్తమ్.
 అదేవిధంగా శబ్దము మొదలైనవి కూడా ఎదుటివారికి అనుభవము కావు.

23. సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్సంయమాత్
అపరాంత జ్ఞానమరిష్టేభ్యః వా
కర్మ ఫలితాలు రెండు విధాలు. వెంటనే కనిపించేవీ, కొంతం సమయం గడిచేక కనిపించేవి. ఈ రెండు రకాల కర్మలను సంయమంద్వారా స్వాధీనం చేసుకుంటే శకునములద్వారా మృత్యువు గురించి తెలుసుకోగలడు.

24. మైత్ర్యాదిషు బలాని.
 అలాగే మైత్రివంటి గుణములు (మొదటి పాదం సూ. 33లో చెప్పిన కరుణ, ఆనందము, ఉపేక్ష) సంయమనంద్వారా వృద్ధి పొందుతాయి.

25. బలేషు హస్తిబలాదీని.
 ఏనుగుగురించి సంయమం చేస్తే ఏనుగుబలం పొందుతాడు.

26. ప్రవృత్త్యాలోకన్యాసాత్సూక్ష్మవ్యవహితవిప్రకృష్టజ్ఞానమ్
 హృదయకమలంలో ప్రతిష్ఠమైన అంతర్జ్యోతిని సంయమం చేస్తే సూక్ష్మ విషయాలూ, కంటికి కనిపించనవీ, బహుదూరంలో ఉన్నవీఅన్నిటి గూర్చిన జ్ఞానము కలుగుతుంది.

27. భువనజ్ఞానమ్ సూర్యే సంయమాత్.
 సూర్యునిగూర్చి సంయమువలన సూర్యమండలం గురించిన జ్ఞానము కలుగుతుంది.

28. చంద్రే తారావ్యూహజ్ఞానమ్.
 చంద్రుని గూర్చి సంయము చేస్తే చంద్ర, నక్షత్రమండలానికి సంబంధించిన జ్ఞానము కలుగుతుంది.

29. ధృవే తద్గతజ్ఞానమ్.
 ధృవునిగూర్చి చేసిన సంయమువలన ధృవమండలంలోని గ్రహములు, తారలగురించిన జ్ఞానం కలుగుతుంది.

30. నాభిచక్రే కాయవ్యూహజ్ఞానమ్.
 నాభితో సంయమము చేస్తే నాడీజ్ఞానము గురించిన జ్ఞానము కలుగుతుంది.

31. కంఠకూపే క్షుత్పిపాసానివృత్తిః.
 కంఠంతో సంయమము చేస్తే ఆకలి దప్పులను అరికట్టగలడు.

32. కూర్మనాడ్యాం స్థైర్యమ్.
 గొంతులో నాలుకకింద ఉండే కూర్మనాడితో సంయమము చేస్తే శరీర స్థైర్యం కలుగుతుంది.

33. మూర్ధజ్యోతిషి సిద్ధదర్శనమ్.
 తలతో సంయమము చేస్తే సిద్ధులదర్శనము లభిస్తుంది.

34. ప్రతిభాద్వా సర్వమ్.
అసాధారణమైన మేధవలన సర్వ విషయాలనూ తెలుసుకోగలుగుతాడు.

35. హృదయే చిత్తసంవిత్.
 హృదయంతో సంయమము చేస్తే మనోభావనలకి సంబంధించిన జ్ఞానము కలుగుతుంది.

36. సత్త్వపురుషయోరత్యంతాసంకీర్ణయోః ప్రత్యయ అవిశేషాత్ భోగః పరార్థత్వాత్ స్వార్థసంయమాత్పురుషజ్ఞానమ్
సత్త్వం (చిత్తం), పరమపురుషుడు – ఈరెంటిమధ్య గల విశేషమైన వ్యత్యాసాన్ని గుర్తించలేడు. తద్వారా ప్రాపంచికమైన సౌఖ్యం కలుగుతుంది. ఆ వ్యత్యాసం ఉందని గ్రహించి పరమపురుషునితో సంయమం చేస్తే పరమపురుషని గురించిన జ్ఞానము కలుగుతుంది.

37. తతః ప్రాతిభశ్రావణ వేదనాఽఽదర్శాఽఽస్వాదవార్తా జాయంతే
 ఆ సంయమంవలన పరమ పురుషునికి సంబంధించిన శ్రవణం, దృష్టి, అవగాహన, రుచి, వాసన సాధకునికి అనుభవం అవుతాయి.

38. తే సమాధావుపసర్గా వ్యుత్థానే సిద్ధయః
 ఆ అనుభవ ప్రభావాలు బాహ్యప్రపంచంలో అలౌకిక శక్తులుగా సాధకుడు పొందుతాడు. అవి సమాధికి ప్రతిబంధకాలు.

39. బంధకారణశైథిల్యాత్ ప్రచారసంవేదనాచ్ఛ చిత్తస్య పరశరీరావేశః
బంధనాలకి కారణమైన చిత్తవృత్తులను తెంచుకుని, సమాధివైపు సాధన కొనసాగిస్తే, మరొక దేహం ప్రవేశించగల శక్తి లభిస్తుంది.

40. ఉదానజయాజ్జల పంకకంటకాదిష్వసంగ ఉత్క్‌క్రాంతిశ్చ
ఉదానవాయువును స్వాధీనం చేసుకుంటే నీరు, బురద, ముండ్లపైన నడవగల సామర్థ్యము కలుగుతుంది.


41. సమానజయాజ్జ్వలనమ్.
 సమానవాయువును జయించినవాని శరీరం ఉజ్జ్వలంగా ప్రకాశిస్తుంది.


42. శ్రోత్రాఽకాశయోః సంబంధసంయమాద్దివ్యం శ్రోత్రమ్
ఆకాశంతో చెవులను సంయమం చేయడంవల్ల దివ్యశ్రవణ శక్తి కలుగుతుంది.


43. కాయాఽకాశయోస్సంబంధసంయమాతే లఘుతూలసమాపత్తేశ్చ ఆకాశగమనం
శరీరమును ఆకాశముతో సంయమం చేయడంవల్ల శరీరము దూదివలె తేలిక అయి ఆకాశ సంచారము చేయగల శక్తి కలుగుతుంది.


44. బహిరకల్పితా వృత్తిర్మహావిదేహా తతః ప్రకాశావరణక్షయః
 ఆత్మని పరమాత్మతో సంయమం చేస్తే కలిగే స్థితికి మహావిదేహము (దేహం లేని స్థితి) అని పేరు. ఆ స్థితిలో పరమాత్మని కప్పిన చీకటి తెర తొలగిపోతుంది.


45. స్థూలస్వరూపసూక్ష్మాన్వయార్తవత్ త్వసంయమాద్భూతజయః
 స్థూలశరీరము, సూక్ష్మ శరీరము, వాటి మూలతత్వాలు, గుణాలతో సంయమం చేస్తే పంచభూతములపై విజయము సాధించగలడు.


46. తతోఽణిమాదిప్రాదుర్భావ కాయసంపత్తద్ధర్మానభిఘాతశ్చ
 తద్వారా అణిమాది సిద్ధులు, శరీరసంపద (రూపం, సౌష్ఠవం) పొందగలడు. శరీరానికి సంబంధించిన అవధులను అధిగమించగలడు.


47. రూపలావణ్యబలవజ్రసంహననత్వాని కాసంపత్
 దేహానికి రూప, లావణ్యాలు, వజ్రఘాతాన్ని తట్టుకోగల బలము కలుగుతాయి.


48. గ్రహణస్వరూపాస్మితాన్వయార్థవత్త్వసంయమాదింద్రియజయః
 గ్రహణేంద్రియాలను, గ్రహించగలశక్తినీ, వాటి మూలస్థానాలతోనూ, అస్మితతోనూ సంయమం చేస్తే ఇంద్రియాలను జయించగలడు.

49. తతో మనోజవిత్వం వికరణభావః ప్రధానజయశ్చ
అప్పుడు స్థూలశరీరంనుండి విడివడగలడు. సాధకుడికి మనోదారుఢ్యం కలుగుతుంది.


50. సత్త్వపురుషాన్యతాఖ్యాతిమాత్రస్య సర్వభావాధిష్ఠాతృత్వం సర్వజ్ఞాతృత్వం చ
 సత్త్వము (చిత్తము) పరమపురుషుడు – ఈ రెంటిమధ్య గల విబేధంతో సంయమము చేసి పొందిన జ్ఞానమువలన అన్నివిధాల శక్తిమంతుడు, సర్వమూ తెలిసినవాడూ కాగలడు.


51. తద్వైరాగ్యాదపి దోషబీజక్షయే కైవల్యమ్
 ఆ వైరాగ్యమువలన చివరలో మిగిలిన బీజము (తాను జ్ఞానిని అన్న భావం) కూడా నశించి కైవల్యం సిద్ధిస్తుంది.


52. స్థాన్యుపనిమంత్రణే సంగస్మయాకరణం పునరనిష్టప్రసంగాత్
 ఆవిధంగా భగవంతుని సమాదరణ సాధించినప్పుడు మమకార, అహంకారాలకు లోను కారాదు. అలా చేసినట్లయితే, మళ్లీ అవాంఛనీయ విషయాలు తలెత్తుతాయి.


53. క్షణతత్క్రమయోః సంయమాద్వివేకజం జ్ఞానమ్
 ఆ జ్ఞానము (అంటే భగవంతుని సమాదరణ లభించిందన్న జ్ఞానము) అది పొందడానికి కారణమైన వరుస క్రమం - వీటితో సంయమం చేయడంతో ఆ బీజము కూడా నశించి సంపూర్ణ సమాధి లభిస్తుంది.


54. జాతిలక్షణదేశైరన్యతానవచ్ఛేదాత్తుల్యయోస్తతః ప్రతిపత్తిః
సాధారణదృష్టికి సమంగా కనిపించే వస్తువులలో వస్తువుయొక్క జాతి, లక్షణాలు, అవి ఉన్న స్థానాలనుబట్టి తేడా ఉంటుంది. సాధకుడికి ఈ సంయమంవలన ఆ తేడా గుర్తించగల వివేకం కలుగుతుంది.


55. తారకమ్ సర్వవిషయం సర్వథా విషయమక్రమమ్ చేతి వివేకజం జ్ఞానమ్
 సర్వ విషయాలనూ – స్థల, కాల, సమయాలతో సంబంధం లేకుండా – అవగాహన చేసుకోగల వివేకంతో పొందిన జ్ఞానమే పరమోత్కృష్టమైన జ్ఞానము.



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics