ధైర్య గౌరి నోము కథ Dhairya Gauri Nomu Katha
ధైర్య గౌరి నోము కథ
ఒక రాచకూతురు మిక్కిలి భయస్తురాలై ఉండెను. ఆమె చెలికత్తెలందరూ ధైర్యముగా నున్ననూ ఆమె పిరికిపంద. అది చూచి ఆమె తల్లితండ్రులు చిన్నతనముచేత భయపడుచున్నది, పెద్దదైన వెంటనే భయము పోవును అని ధైర్యపడిరి. కొంతకాలమున కామె యుక్తవయస్కురాలై భర్తతో కాపురమునకు వెళ్ళిననూ భయస్తురాలై యుండెను. ఆమెను పలుకరించినను, పని చెప్పినను యేడ్చుచుండెను. అదిచూచి ఆమెభర్తకు విసుగువచ్చి “నవ్వెడి మగవానిని యేడ్చెడి ఆడదానినినమ్మరాదని” అనుకొని ఆమెను పుట్టింటి దగ్గర వదిలి పెట్టెను. అందుచే నామెతల్లి తండ్రులు చాల పరితపించి భక్త వశంకరుడగు శంకరుని పూజించుచుండగా నొకనాడా స్వామి ముసలి బ్రాహ్మణ రూపమునవచ్చి ఆ యువతి పూర్వజన్మము నందు ధైర్యగౌరి నోము నోచి ఉల్లంఘన చేయుటచే ఈ జన్మలో నట్లు పిరికిపంద యయ్యెనని చెప్పి ఆ యువతితో ఆ నోము నోపించినచో ధైర్యము కల్గునని తెలిపి మాయమయ్యెను. తోడనే ఆమె తల్లితండ్రులాశ్చర్యపడి ,పరమేశ్వరుడే ఆనోము నోచుటకు ఆనతినిచ్చెనని సంతోషించి, తమ పుత్రికతో దానిని యధావిధిగా చేయించిరి. అప్పటినుండి ఆమె ధైర్య సంపన్నురాలయ్యెను. ఆ సంగతి ఆమె భర్త తెలుసుకొని సంతోషించి ఆమెను తన యింటికి తీసుకుపోయి సుఖముగా ఉండెను.
ఉద్యాపన:
తొమ్మిది గిద్దెల ఆవు నేతితో ఒక వరహా యెత్తు భమిడిపత్తితో వత్తిచేసి వెలిగించి పైకథను చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను. ఐదు సోలలు ఆవు పాలలో అవసరమైనన్ని బియ్యం వేసి ,వండి ,దానిని నైవేద్యముగపెట్టి ఆ ప్రసాదమును ఇతరులకు పెట్టకుండా తానే భుజించవలెను. ఈదీపమును భాద్రపద ఆశ్వీయుజ,కార్తీక, మార్గశిర మాసములలో నెప్పుడైనను వెలిగించ వచ్చును. పధ్ధతి తప్పినను భక్తి తప్పకపోయినయెడల ఫలము తప్పదు.All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment