కరళ్ళ గౌరి నోము Karalla Gauri Nomu
కరళ్ళ గౌరి నోము
ఒక బ్రాహ్మణునకు అయిదుగురు కొడుకులు, అయిదుగురు కోడళ్ళు వుండిరి. అతని ఆఖరి కోడలు కరళ్ళ గౌరి నోము నోచుకొనెను. అందుచేత వాళ్ళందరూ సంపదలతో తులతూగుచుండిరి. ఆ చిన్నది ప్రతిదినము ఉదయ కాలమందే స్నానము చేసి , అత్త సొమ్ము వద్దు, మామసొమ్ము వద్దు, భర్తసొమ్ము వొద్దు, బిడ్డలసొమ్ము వొద్దు. నా సొమ్మే నాకిమ్ము అని సూర్యుని ప్రార్ధించుచుండెడిది. అది చూచి ఆమె యత్త మామలు, బావలు, మగడు, తోడికోడళ్ళు కోపగించుచుండిరి. అందుచే ఒక నాటి రాత్రి ఆమె నిద్రపోవుచుండగా వారామెను మంచముతో నేత్తుకొనిపోయి ఒక యరణ్యములో వదలిపెట్టి యింటికి పోయిరి. తెల్లవారగానే ఆమె లేచి తన దుర్దశకు దుఃఖించి, దిక్కులేని వారికి దేవుడే దిక్కనుకొని ప్రక్కచెరువులో స్నానముచేసి పూర్వము వలెనే సూర్యునమస్కారము చేసినవెంటనే ఆమె దోసిలి నిండావరహాలు పడినవి. ఆమె వాటిని దీసుకొని ప్రక్కగ్రామములోకావలసిన వస్తువులన్నింటిని కొనుకొని, సుఖముగ ఒక యింటిలో కాపురము వుండెను. కాని ఆమె అత్తవారింటిని వదలి వచ్చినది మొదలు వారందరు దరిద్రులైపోయిరి. ఒకనాడు వారాయడవిలో కట్టెలు కట్టుకొనుటకు వచ్చి సూర్యనమస్కారము చేయుచున్న చిన్న కోడలిని చూచి గురుతుపట్టి తమ తప్పును క్షమింపమని కోరిరి. ఆమె కూడా వారి దుఃస్థితికి విచారించి మిక్కిలి ఆదరమున వారినందరినీ మన్నించెను. ఆమె పట్టిన నోమును అత్తవారు, తోటికోడళ్ళు పట్టి అంత సుఖముగా ఉండిరి. ఈ కథ ప్రతిదినము చెప్పుకొని అక్షతలు వేసుకొని యేడాది నిండిన తర్వాత ఉద్యాపనము చేసుకోవాలి.
ఉద్యాపన:
యేడాది నిండిన తర్వాత ఒక క్రొత్త కంచములో పదమూడు కరళ్ళు పెట్టి చీర , రవికేలగుడ్డతో ముత్తైదువులకు వాయన మియ్యవలెను. భక్తి తప్పకుండిన ఫలము తప్పదు.All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment