పోలాల అమావాస్య నోము

శ్రావణ బహుళ అమావాస్య నాడు ఈ నోము చేసుకోవాలి. శ్రావణమాసం మహిళలకు విశేషమైనమాసం. ఈ నెలలోనే శ్రావణమంగళవారాలు, మంగళగౌరీవ్రతాలు, శ్రావణశుక్రవారం నాడు శ్రీ వరలక్ష్మీవ్రతం చేసుకుంటారు. ఇంకా శ్రావణమాసమంతా గౌరీదేవికి ప్రీతికరమైన నెల కాబట్టి సకల సంపత్ సౌభాగ్యాలని ప్రసాదించే ఆ తల్లిని ప్రతి మహిళ ప్రతిరోజూ ఏదో ఒక పూజ చేసి ఆ అమ్మవారి అనుగ్రహాం పొందడానికి ప్రయత్నిస్తారు. మహిళలు తమ సంతానం ఆయురారోగ్య అభివృద్ధి కోసం ఈ శ్రావణ బహుళ అమావాస్య నాడు అమ్మవారిని పూజిస్తే సంతానం లేనివారికి సైతం సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది ఈ అమ్మ. ఒక యూరిలో ఏడుగురన్నదమ్ములుండిరి. వారందరికి పెండ్లయి భార్యలుకాపురమునకు వచ్చిరి.కొంత కాలమునకు ఆ ఏడుగురు తోటికోడండ్రు పోలాలఅమావాస్యనోము నోచుకొనవలెనని, ప్రయత్నము చేసిరి. కాని అమావాస్యనాడు ఆఖరి ఆమెబిడ్డ బిడ్డ చనిపోవుటచే వారందరు నోము నోచుకొనలేదు. ఆవిధముగావారు ఆరుసంవత్సరములు నోమునోచుటకు ప్రయత్నముచేయుటయు, ఆమె బిడ్డ చచ్చుటయు, అందుచే వారందరు నానోముని నోచుకొనుట వీలు లేకపోవుటయు, మిగిలిన ఆరుగురు ఏడవ ఆమెను దుమ్మెత్తిపోయుటయు జరుగుచుండెను. అట్లే యేడవ యేటకూడా వారందరు నోముప్రయత్నముచేసిరి, పూర్వము వలెన ఆఖరిఆమె బిడ్డ చనిపోయెను. కాని ఆమె తనను తిట్టిపోయుదురని భయపడి చచ్చిన బిడ్డను యింటిలో పెట్టి తాళమువేసి మిగిలిన తోటికోడండ్ర యిళ్ళకు వెళ్ళి వారితోకలిసి నోమునోచుకుని రాత్రికి ఇంటికి వచ్చెను. పిమ్మట ఆమె చచ్చిన బిడ్డ శవమును భుజముమీద వేసుకుని, ఊరిచివరనున్న పోలేరమ్మ గుడి వద్దకు తీసుకొనిపోయి, యేడ్చుచుండెను. అంతలో గ్రామ సంచారమునకు బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూచి ఎందులకేడ్చుచుంటివని? అడిగెను.అందుల కామె “అమ్మా! ఏడవక ఏమి చేయమ న్నావు? ఏడేండ్ల నుంచి యేటికొక పిల్లచోప్పున నేను పోలేరమ్మకు అప్పగించుచున్నాను. ఈ బిడ్డ నేటి ఉదయముననే చనిపోయెను. కాని ప్రతియేటా నాపిల్లలు చనిపోవుటచే నా తోటికోడండ్రు నోమునోచుకొనక నన్ను తిట్టుట జరుగుచుండుతచేత ఈయేడు నేను వారి నోము నాపుటకిష్టపడక చచ్చినబిడ్డను ఇంటిలో దాచి వారితో నోము నోచుకుని ఇప్పుడు శవమును తీసుకుని వచ్చితిని” అనెను. ఆ మాటలు విని పోలేరమ్మ జాలినొంది ఆమెకు అక్షతలిచ్చి వాటిని ఆమె బిడ్డలను పూడ్చినచోట చల్లి పేర్లతో చచ్చినవారిని పిలువవలసినదిగా చెప్పి వెడలి పోయెను. ఆమె అమ్మవారు చెప్పినట్లు తన పిల్లలను పాతిన గోతులమీద అక్షతలను చల్లి చచ్చినవారిని పిలువగా ఆ పిల్లలందరూ సజీవులై వెలుపలకు వచ్చిరి. అంతట ఆమె ఆ ఏడుగురుపిల్లలను వెంటబెట్టుకొని ఇంటికి వెళ్ళెను. తెల్లవారుసరికి ఆమె తోటికోడళ్ళు ఊరివారు ఆ పిల్లలను చూచి “వీరెక్కడనుండి వచ్చిరి?” అని అడగగా ఆమె గతరాత్రి జరిగిన విషయములు తెల్పెను. ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరమూ పోలాల అమావాస్య నోమును నోచుకొనుచూ సుఖముగా నుండిరి. దీనికి ఉద్యాపనము లేదు. ఇది అందరూ చేయవచ్చును. ఈ నోమును నోచుట వలన సంతానము లేనివారికి సంతానము , సంతానము ఉన్నవారికి కడుపు చలువా కలుగును.
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment